Home News చదరంగంలో ప్రజ్ఞానంద అసాధారణ ప్ర‌తిభ‌

చదరంగంలో ప్రజ్ఞానంద అసాధారణ ప్ర‌తిభ‌

0
SHARE

భారతదేశం చెస్ క్రీడాకారుల కేంద్రంగా మారుతోంది. ప్రస్తుతం 18 ఏళ్ల రమేష్‌బాబు ప్రజ్ఞానంద ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడ‌లో కీర్తిని పొందుతున్నాడు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న FIDE ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి టైబ్రేక్స్‌లో భారత ఆట‌గాడు సోమవారం ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో ​​కరువానాను ఓడించాడు. నేడు ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ తో పోటి ప‌డ‌బోతున్నాడు.

ఈ అద్భుతమైన విజయంతో రెండు దశాబ్దాల తర్వాత చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. భారత చెస్ దిగ్గ‌జం విశ్వనాథన్ ఆనంద్ 2000, 2002లో మొదటి రెండు ప్రపంచ కప్‌లను గెలుచుకున్నారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో 2005 ఆగస్ట్ 10న జన్మించిన ప్రజ్ఞానంద తన 5వ ఏట‌నే చదరంగం ప్రయాణం ప్రారంభించాడు. తల్లి నాగలక్ష్మి, పోలియో బాధితుడైన తండ్రి ర‌మేష్ బాబు బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్ర‌జ్ఞానంద తన సోదరి వైశాలి రమేష్‌బాబు నుండి చెస్ ను అభిరుచిగా ఎంచుకున్నాడు.

వైశాలి చిన్న వ‌య‌సులో టీవీ ముందు ఎక్కువ సమయం గడుపుతుంద‌ని ఆందోళన చెందిన త‌ల్లిదండ్రులు ఆమెకు చెస్‌ను పరిచయం చేశారు. దీంతో సొద‌రి అభిరుచి పట్ల ప్రజ్ఞానందకు కూడా ఆస‌క్తి పెంచుకోవ‌డం, అతని జీవితాన్ని మార్చ‌డ‌మే కాకుండా క్రీడా మాంత్రికుడికి స్ఫూర్తినిస్తుందని ఎవరు ఊహించి ఉండరు!

వైశాలి కూడా U-14, U-12 ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. ఆమె 2016లో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకుంది. గత సంవత్సరం చెన్నైలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో ఈ సోదరుడు-సోదరి ద్వయం వ్యక్తిగత ఈవెంట్‌లలో కాంస్య పతకాలను గెలుచుకున్నారు.


ఆర్థిక ఇబ్బందులున్న‌ప్ప‌టికీ అతని తండ్రి ఎల్లప్పుడూ వారికి మద్దతుగా నిలిచాడు. తల్లి నాగలక్ష్మి దాదాపు ప్రతి టోర్నమెంట్‌లో ప్రజ్ఞానానంద వెంట ఉంటుంది.

ప్రజ్ఞానంద 10 సంవత్సరాల, 10 నెలల, 19 రోజుల వయస్సులో అతి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ మాస్టర్‌గా గుర్తింపు రావ‌డంతో వార్త‌ల్లో నిలిచాడు. రెండు సంవత్సరాల తరువాత, ప్రజ్ఞానానంద 2018లో రెండవ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. ఈ రికార్డును 2019లో తోటి భారతీయుడు డి గుకేష్ బద్దలు కొట్టాడు.

ప్రగ్ఞానంద 2013లో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్స్ అండర్-8 టైటిల్‌ను గెలుచుకున్నాడు. కేవలం 7 సంవత్సరాల వయస్సులో FIDE మాస్టర్‌గా కూడా నిలిచాడు. ఆ తర్వాత 2015లో అండర్-10 టైటిల్ గెలుచుకున్నాడు. అతను గతేడాది కార్ల్‌సెన్ తో ఒక సంచలనాత్మక ప్రదర్శన క‌న‌బ‌రిచాడు.  నార్వేజియన్ చెస్ గ్రాండ్‌మాస్టర్‌ను వరుసగా మూడుసార్లు  మెరుపు వేగంతో ఓడించాడు.

2016లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ప్రజ్ఞానానంద కోచ్ RB రమేష్ మాట్లాడుతూ “అతనికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది. అది అతని పాత మ్యాచ్‌లను గుర్తుంచుకునేలా చేస్తుంది. తను చేసిన తప్పులు గుర్తుంచుకుని ఆడ‌తాడు. అతను తన ఆటలను విశ్లేషించే విధానం అతని వ‌య‌సు కంటే మించినది.” అని పేర్కొన్నాడు.

ప్రజ్ఞానందా నిత్య దైవ‌భ‌క్తి

ప్ర‌జ్ఞానంద ఎప్పుడూ త‌న నుదుట విభూతి ధ‌రిస్తాడు. ఒక సంద‌ర్భంలో “మీ నుదుటిపై ఉన్న తెల్లటి గుర్తు గురించి ఇక్క‌డి ప్ర‌జ‌లు చాలా ఆసక్తిగా ఉన్నారు. దాని అర్థం ఏమిటో మీరు నాకు చెప్పగలరా” అని ఒక విలేఖ‌రి అడ‌గ‌గా “మా అమ్మ ప్రేర‌ణ‌తో నేను ఈ విభూతిని ధ‌రిస్తున్నాను,  నేను ప్రతిరోజూ చేస్తాను” అని అతను చెప్పాడు.