- దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్రపుటల్లోకి భారత్
- చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్
అంతరిక్షంపై భారత్ సంచలనం సృష్టించింది. చందమామపై పరిశోధనలు జరిపేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగింది. 14 రోజులపాటు చంద్రుడిపై పరిశోధనలు జరుపనుంది.
నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జులై 14న చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ LVM3 M4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ‘ట్రాన్స్ లూనార్ కక్ష్య’లోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు.
ఆ తర్వాత ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ‘ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత రెండు సార్లు డీ-అర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు.
బుధవారం సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్, ల్యాండింగ్ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇస్రో ల్యాండింగ్ మాడ్యూల్కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS) కమాండ్ ను పంపించింది. ఈ కమాండ్ ను అందుకున్న ల్యాండర్ మాడ్యూల్ తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలు పెట్టింది. తన నాలుగు థ్రటల్‌బుల్ ఇంజిన్లను ప్రజ్వలించి తన వేగాన్ని తగ్గించుకుంది. రఫ్ బ్రేకింగ్ దశను విజయవంతంగా ముగించుకుని జాబిల్లి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ తన దిశను మార్చుకుంది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (ఎల్పీడీసీ), కేఏ బ్యాండ్ అండ్ లేజర్ బేస్డ్ అల్టీమీటర్లు, లేజర్ డాక్టర్ వెలోసిమీటర్ వంటి సాధనాలతో గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరిగా ల్యాండింగ్ కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపింది.
ప్రధాని ఆనందం, అభినందనలు
జాబిల్లి దక్షిణ ద్రువంపై భారత్ అడుగు పెట్టి సరికొత్త చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జొహెన్నెస్బర్గ్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించారు. చంద్రయాన్- 30, విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
“చంద్రయాన్ ను ఘన విజయంతో నా జీవితం ధన్యమైంది. అమృత కాలంలో తొలి ఘన విజయం ఇది. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం. అద్భుత విజయం కోసం 140 కోట్ల మంది ఎదురు చూశారు. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్ 3 పైనే ఉంది. చంద్రయాన్-3 బృందం. ఇస్రో శాస్త్ర వేత్తలకు అభినందనలు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశా” అని మోదీ అన్నారు.