– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం పేరిట ఏర్పడిన శ్రావణ మాసంలోని పౌర్ణమికి ఎన్నో విశిష్టతలు. ‘వాగీశ్వరుడు’ హయగ్రీవుడు అవతరించిన తిథి. వేదాధ్యాయనం ఆరంభించే రోజు. చేపట్టిన పనులలో విజయం సాధించాలని కంకణబద్ధులయ్యేది, సోదరసోదరీ ప్రేమకు ప్రతీకగా రక్షాబంధన్ వంటివి ఈ తిథి ప్రత్యేకతలలో కొన్ని. మరాఠీయులు, కన్నడిగులు ఈ రోజున సాగరపూజ చేసి కొబ్బరికాయలు సమర్పిస్తారు. దీనిని నారికేళ పౌర్ణమి, నార్లీ పూర్ణిమ అంటారు. పం•లు బాగా పండాలని కోరుతూ ఉత్తరప్రదేశ్, ఛ•త్తీస్‌గఢ్ వాసులు కజరీ (గోధుమ) పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇలా మన సంస్కృతీ సంప్రదాయాల బలిమి, ఘనమైన వారసత్వ కలిమి శ్రావణ పౌర్ణమి.
—————————-
విజ్ఞానప్రదాత హయగ్రీవుడు
‘జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే’ విద్యారంభం శ్లోకం, ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ….’ శ్లోకమంతటి ప్రాధాన్యం కలది. హయగ్రీవ అవతారం గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. వేదోద్ధరణ కోసం శ్రీమహావిష్ణువు హయ గ్రీవుడిగా అవతరించాడన్నది ప్రధాన పురాణ కథనం. ఆయన జ్ఞానానందయయుడు, వాగీశ్వరుడు కాగా సరస్వతీ వాగ్దేవి.
వైకుంఠనాథుని అన్ని అవతారాలలో హయగ్రీవ అవతారం మొట్టమొదటిదని, ఇది సృష్టికి ముందు న్నది.. కాలానికి అందనిదిగా చెబుతారు. ఇది జ్ఞానావతారం. నిర్మలమైన స్ఫటికం వంటి ఆకృతి కలవాడు. సర్వ విద్యలకు ఆధార భూతుడు. గుర్రపు తల, మానవదేహంతో నాలుగు భుజాలలో శంఖం, చక్రం, పుస్తకం, చిన్ముద్రలను కలిగి ఉంటాడు. సృష్టి కార్యానికి అవసరమైన జ్ఞాన ప్రదాతలైన వేదాల సంరక్షణలో శ్రీ మహావిష్ణువు జాగరూకులై ఉంటాడట. గుర్రం సకిలించే ధ్వనిని ‘హేష’ అంటారు. ఆ ధ్వనిని బీజాక్షరాలకు ప్రతీకగా చెబుతారు.
విధాత నుంచి వేదాలను అపహరించి సము ద్రంలో దాగిన మధుకైటభులు అనే రాక్షసులను శ్రీహరి హయగ్రీవ స్వరూపంతో సంహరిస్తాడు. వేదోద్ధరణకు శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞగుండం నుంచి హయగ్రీవుడిగా ఆవిర్భవించారు. వేదాలను కాపాడిన స్వామి, బ్రహ్మకు వేదాధిపత్యాన్ని, సరస్వతికి సకల విద్యాధిపత్యాన్ని అప్పగించాడు. సరస్వతీమాత హయగ్రీవునికి విగ్రహ రూపం కల్పించి ఆరాధించిం దని పురాణగాథ. ఆమె కాశ్మీరంలో రామాను జాచార్యులకు సాక్షాత్కరించి శ్రీలక్ష్మీ సమేత హయగ్రీవ మూర్తిని ప్రసాదించగా, అది రామానుజుల నుంచి వారి శిష్యులు పిళ్లైయాచార్యులు, వారి నుంచి వేదాంత దేశికులకు.. ఇలా గురుశిష్య క్రమంలో సంక్రమించింది. ఆ మూర్తి మైసూరులోని శ్రీ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠంలో అర్చనలు అందుకుంటోంది. కలియు గంలో మానవ ఉద్ధరణకు ఉపాయం చెప్పాలని అగస్త్యముని విన్నవించగా, హయగ్రీవుడు రుషి రూపంలో కాంచీపురంలో ఆయనకు శ్రీలలితా రహస్య నామాలను, శ్రీవిద్యను ఉపదేశించారు.
పరాశక్తి గురించి తపస్సు చేసిన హయగ్రీవాసురుడు మరణం లేకుండా వరం కోరాడు. ‘పుట్టుట గిట్టుట కొరకే…’ అన్నట్లు మృత్యువు అనివార్యమైనప్పుడు అమరత్వం ఎలా సాధ్యమని జగన్మాత ప్రశ్నించిందట. దానికి సమాధానంగా ‘తనలాంటి రూపం కలవారి చేతిలోనే మరణం ఉండేలా’ వరం కోరాడని పురాణ గాథ. మానవ శరీరానికి గుర్రపు తల గల తనలాంటివాడు సృష్టిలో ఉండబోడనే విశ్వాసంతో, తనకెదురే లేదనే ధీమాతో పెచ్చరిల్లిపోయాడు. అంతులేని ఆతని ఆగడాలకు భీతావహులైన బ్రహ్మాది దేవతలు, మునులు శ్రీమహా విష్ణువును శరణువేడగా, ఆయన శ్రావణ పూర్ణిమ నాడు హయవదనుడిగా ఉద్భవించి దానవ సంహారం చేశాడు. సృష్టి యజ్ఞంలో విరాడ్రూపు నుంచి అశ్వం మొదట ఉద్భవించింది. ‘తస్మాదశ్వా అజాయంత’ అని వేదం (పురుష సూక్తం)పేర్కొంటోంది.
హైదరాబాద్ శివారు మేడిపల్లి వద్ద హయగ్రీవుడు శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సమేతంగా కొలువై ఉన్నాడు. మైసూరులోని పరకాల మఠం తరహాలోనే ఇక్కడి ఆలయంలోనూ హయగ్రీవ జయంతితో పాటు ప్రతి నెల స్వామివారి తిరునక్షత్రం (శ్రీనివాసుడి నక్షత్రమూ అదే) శ్రవణం నాడు అభిషేకం, హోమాది క్రతువులు నిర్వహిస్తారు. ఇతర పండుగలను ఘనంగా జరుపుతారు.
—————————–
విశ్వప్రేమకు చిహ్నం ‘రక్షాబంధన్’
ఒకప్పుడు దుష్టశక్తులను పారదోడానికి, చేపట్టిన కార్యాలు విజయవంతంగా ముగించి డానికి ఉద్దేశించిన ‘రక్షాబంధన్’ అనంతర కాలంలో సోదరసోదరీ ప్రేమకు ప్రతీకగా మారింది. ఈ పండుగ కుటుంబ విలువలను, మానవ సంబంధాలను పరిపుష్టం చేస్తుంది. భవిష్యోత్తర, విష్ణు, కూర్మ పురాణాలు రక్షాబంధన్ గురించి చెబుతున్నాయి. యుద్ధవీరులకు పట్టుదల, ఆత్మ స్థయిర్యం కలిగేందుకు రక్ష కట్టేవారు. కాలక్రమంలో ప్రబలిన పాలకుల దుర్నీతి, అరాచకాల బారిన పడుతున్న మహిళల రక్షణ కోసం రక్షాబంధన్ (రాఖీ) సంప్రదాయం వచ్చిం దని చెబుతారు. పురాణ చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే.. దానవులతో జరిగిన యుద్ధంలో ఓడిన ఇంద్రుడికి ఆయన పత్ని శచీదేవి, ముంజేతికి రక్ష కట్టి ప్రోత్సహించడంతో విజయం సాధించాడట. ధ్రువుడు తపస్సుకు వెళుతున్నప్పుడు తల్లి సునీతి (సూనృత), కుమారుడు భరతుడికి శత్రుభయం ఉండకూడదని శకుంతల, బలిచక్రవర్తి సర్వస్వాన్ని వామనుడికి ధారపోసినప్పుడు ఆయన భార్య వింధ్యావళి, సోదరుల విజయాన్ని కాంక్షిస్తూ ధర్మరాజు రక్ష కట్టారని గాథలు. బలి చక్రవర్తి కోరిక మేరకు శ్రీహరి ఆయన రాజ్యానికి రక్షకుడిగా ఉండగా పతిని (హరి) వైకుంఠానికి రప్పించుకోవాలనే ప్రయత్నంలో లక్ష్మీదేవి బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్ద ఆశ్రయం పొంది శ్రావణ పూర్ణిమనాడు ఆతనికి రక్ష కట్టి తన గురించి వెల్లడిస్తుంది. ఆమె మంచితనానికి, తెలివికి సంతసించిన దానవేంద్రుడు, విష్ణువును వైకుంఠానికి వెళ్లవలసిందిగా వేడుకుంటాడు. ఇలా సోదర ప్రేమకు ఉదాహరణగా చెబుతారు. భారత స్వాతంత్య్ర సమర సమయంలో యోధులకు కట్టిన రాఖీని ‘వీరకంకణం’గా భావించి ఉద్యమించారు. ఛత్రపతి శివాజీ ఇదే రోజున తుల్జాభవానీ సమక్షంలో రక్షాబంధన్ ఉత్సవం నిర్వహించి, తాను ధర్మరక్షణకు పునరంకితమవుతున్నట్టు ప్రత్ఞి చేసేవాడట. ఆ స్ఫూర్తితోనే మరాఠా ప్రాంతంలో నేటికీ ఈ రోజును ‘ధర్మ దివస్’గా పాటిస్తారు.
రక్షకట్టే మహిళలు, కట్టించుకునేవారు ఏకోదరులు కాక పోయినా ‘నీకు రక్ష కడుతున్న నేను ఈ (మీ) కుటుంబానికి చెందిన వ్యక్తినే. నా రక్షణ బాధ్యత నీపై ఉంది’ అనే సందేశం ఇమిడి ఉంది. తనకు రక్షణను ఆశించడంతో పాటు సోదరుని, సోదర సమానుడి ఉన్నతిని కోరుతూ రక్షాబంధన్‌కు వేసేల మూడు ముడులు ఆరోగ్యం, సంపద, ఆయుష్సులకు సూచికలు. విద్య ఉద్యోగాలు లాంటి కారణాలతో వివిధ ప్రాంతాలలో ఉంటున్న వారు ఏడాదికి ఒకసారైనా కలుసుకునేందుకు ఈ రాఖీ పండుగ దోహదపడుతోంది. స్థూలంగా పరిశీలిస్తే, అంతటా శాంతి సౌభాగ్యాలు వెల్లి విరుస్తూ, అందరు సుభిక్షంగా ఉండాలనే విశాల భావన ఈ పండుగ సందేశంగా కనిపిస్తుంది. సమాజాన్ని, సనాతన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ, విశ్వమానవ కల్యాణానికి అనువైన వాతావరణాన్ని ఈ పండుగ కల్పిస్తుంది. విశ్వశాంతికి, అభ్యుదయానికి ఆలంబనగా నిలుస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రక్షాబంధన్ పండుగను సామాజిక ఉత్సవంగా నిర్వహిస్తోంది.
—————————–
‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం…’
శ్రావణ పూర్ణిమ నాడు ద్విజులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. జపహోమ ధ్యానాదుల నిమిత్తం దీక్షా సూచికగా నూతన యజ్ఞపవీతం ధరించాలని శాస్త్రవచనం. గడచిన సంవత్సరంలో తెలిసీ తెలియకుండా ఏమైనా దోషాలు చోటుచేసుకుంటే వాటి పరిహారార్థం కూడా నూతన యజ్ఞోపవీతధారణ చేయాలని చెబుతారు. పాల్కురికి సోమన ‘పండితారాధ్యచరిత్ర’లో ఈ జంధ్యాల పూర్ణిమను ‘నూలు’పండుగ అని పేర్కొన్నారు.
యజ్ఞోపవీతం విశిష్టతను మననం చేసుకుంటే… దానికి ఉండే మూడు పోగులు దేవ పితృ రుషి రుణాలకు సూచికలుగా పేర్కొంటారు. ఆ పోగులకు ఉండే మూడు ముళ్లు ఆరోగ్యం, సంపద, తేజస్సుకు సంకేతాలని చెబుతారు. శ్రౌత కర్మానుష్ఠాన, మంత్రానుష్ఠాన యోగ్యత కోసం మొదటి పోగు, గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ కోసం రెండవది, వైదిక కర్మానుష్ఠాన యోగ్యత కోసం మూడవ పోగు ధరించాలన్నది నియమం. అత్యవసర వినియోగార్థం అయిదు పోగులు ధరించాలంటారు పెద్దలు. పాముకాటు లాంటి వాటికి అత్యవసర చికిత్సగా కట్టు కట్టేందుకు నాలుగవది,ఎక్కడైనా యజ్ఞోపవీతం జీర్ణమైన బ్రహ్మచారులు / తారసిల్లితే వారికి ఆపద్ధ్దర్మంగా ధరింప(దానం) చేయడానికి ఐదవ పోగు ధరించాలని అంటారు.
జాత, మృత అశౌచ్యాదుల శుద్ధి సందర్భాలలో నూతన యజ్ఞోపవీత ధారణకు, శ్రావణ పూర్ణిమ నాటి పక్రియకు వ్యత్యాసం ఉంది. శ్రావణ పూర్ణిమనాడు నూతన యజ్ఞోపవీత ధారణతో ద్విజాతులు నాలుగైదు మాసాలు వేదాధ్యయనం చేయాలని మన సంస్మృతి చెబుతోంది. ఉత్తరాయణంలో ఉపనయం అయిన వారికి దక్షిణాయనంలో వచ్చే శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేస్తారు. అంటే ఉపనయనం వేళ యజ్ఞోపవీతంలో కట్టే ‘మౌంజి’ని ఉపాకర్మ సమయంలో తొలగించి నూతన యజ్ఞోపవీతాన్ని ధరింపచేస్తారు. వేదాభ్యాసకులకు మాత్రం ఏటా ఈ పౌర్ణిమ నాడు ఉపాకర్మ నిర్వహిస్తారు. అలాగే వేద విద్యాభ్యాసం ఈ పక్రియతో ప్రారంభమవుతుంది.
విద్యారంభం, వేద పునశ్చరణకు ఇదే సరైన సమయం అనడానికి కారణాలు ఏమిటి? అనే కొందరి సందేహాలకు, ‘వర్షరుతువు నుంచి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. వానల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉండదు. ఏరువాక సాగి మళ్లలో మొలకలు తలెత్తుతుంటాయి. తీరికా ఉంటుంది. ‘ఓషధీనాం ప్రాదుర్భావే..’ ఓషధులు మొలకెత్తిన తరువాత, శ్రవణ నక్షత్ర యుక్త శ్రావణ పూర్ణిమ నాడు కాని, హస్త నక్షత్రం గల రోజున కానీ వేదాధ్యయనం ఆరంభించాలి’ అని ధర్మశాస్త్రకారులు పేర్కొన్నారు.
శ్రవణ నక్షత్ర యుక్త శ్రావణ పూర్ణిమనాడు కాని, హస్త నక్షత్రం గల రోజున కానీ వేదాధ్యయనం ఆరంభించాలని ధర్మశాస్త్రకారులు పేర్కొన్నారు. కొత్తగా వేదాధ్యయనం మొదలు పెట్టడానికి, అధ్యయనం చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకునేం దుకు ఆవృత్తి చేయడం, వల్లె వేయడానికి కూడా ఈ రోజునే నిర్ణయించారు.
జాగృతి సౌజన్యంతో…