Home News హిందూయేతరులను హిందూ దేవాలయాల్లో నియ‌మించరాదు: ఆంధ్రా హైకోర్టు

హిందూయేతరులను హిందూ దేవాలయాల్లో నియ‌మించరాదు: ఆంధ్రా హైకోర్టు

0
SHARE
  • క్రైస్తవ వ్యక్తి చేసిన పిటిషన్‌ నిరాక‌ర‌ణ‌

హిందువులు కానివారిని, ఇతర మతాలను అనుసరించే వ్యక్తులను హిందూ దేవాలయాల్లో నియమించరాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. హిందూ మతాన్ని అనుసరించే వారు మాత్రమే దేవాలయాల్లో పని చేసేందుకు అర్హులని కోర్టు పేర్కొంది.

శ్రీశైలం దేవస్థానం అత్యున్నత కార్యనిర్వహణాధికారి తనను సర్వీసు నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ పి సుదర్శన్‌బాబు అనే వ్య‌క్తి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ హరినాథ్ నూనెపల్లి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2002లో రికార్డ్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామకం పొందడానికి అతను తన క్రైస్తవ మ‌త గుర్తింపును దాచిపెట్టాడని దేవస్థానం గుర్తించిన తర్వాత ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించారు.

2010లో ఓ క్రైస్తవ మహిళతో హోలీ క్రాస్ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. దీంతో తన అసలు గుర్తింపును దాచిపెట్టి దేవస్థానంలో ఉద్యోగం పొందినందుకు అతని పేరు మీద అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదుల మేరకు లోకాయుక్త విచారణ చేపట్టింది.

లోకాయుక్త నోటీసుకు ఇచ్చిన సమాధానంలో తన మ‌తాన్ని దాచడం లేదని తన కుల స‌ర్టిఫికేట్‌, పాఠశాల ధృవీకరణ పత్రాలను సమర్పించినట్లు సుదర్శన్ బాబు పేర్కొన్నారు. అయితే వివిధ పత్రాలను పరిశీలించిన తర్వాత సుదర్శన్ బాబు తన మతాన్ని దాచిపెట్టి ఉద్యోగం సంపాదించినట్లు లోకాయుక్త గుర్తించింది. దీంతో ఆయనను సర్వీసు నుంచి తొలగిస్తూ శ్రీశైలం దేవస్థానం ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.

2012లో సుదర్శన్ బాబు తనను సర్వీసు నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా వివిధ పత్రాలను పరిశీలించిన జస్టిస్ హరినాథ్, హోలీ క్రాస్ చర్చి రిజిస్టర్‌లో పిటిషనర్ మతం క్రిస్టియన్‌గా పేర్కొనబడిందని, అందులో పిటిషనర్ సంతకం ఉందని పేర్కొన్నారు.

“సుదర్శన్ బాబు క్రైస్తవ మతంలోకి మారకుండా స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే, వివాహాన్ని ప్రత్యేక వివాహాల చట్టం, 1954 కింద నమోదు చేసి, చట్టం ప్రకారం వివాహ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసి ఉండాలి. అయితే సుదర్శన్ బాబు విషయంలో అలా జరగలేదు’’ అని జస్టిస్ హరినాథ్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

ఆలయ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. కర్నూలులోని అహోబిలం ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి “ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్”ని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొన్న రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి నిరాకరించిన జస్టిస్ కౌల్ గారు మత స్థలాలను సంబంధిత మతానికి చెందిన వ్యక్తులను నియ‌మించాల‌ని పేర్కొన్నారు.