– ఆకారపు కేశవరాజు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ : అబుదాబి , అజ్మాన్ , దుబాయ్ , ఫుజైరా , రస్ అల్ ఖైమా , షార్జా, ఉమ్ అల్ క్వైన్ లు అనే దేశాల.. ఏడు ఎమిరేట్ల సమాఖ్య. ఇస్లాంమత రాచరికపు వ్యవస్థ. ప్రతి ఎమిరేట్ కు ఒక పాలకుడుంటాడు. వీళ్ళందరూ ఏకకంఠంతో ఆమోదించి ప్రోత్సహించగా, BAPS స్వామినారాయణ్ సంస్థ చే నిర్మించబడుతున్న ఈ ఆలయం దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేకి దూరంగా అల్ రహ్బాకు సమీపంలో ఉన్న అబు మురీఖా వద్ద ఉంది.
ముస్లిం పాలకుడు సమర్పించుకున్న భూమి, క్యాథలిక్ క్రిస్టియన్ రూపొందించిన ప్రాజెక్ట్. ప్రముఖ్ స్వామి ప్రేరణతో, మహంత్ స్వామి మహారాజ్ ఆశీర్వాదంతో ఈ మందిరం, అరబ్ దేశాల సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాబోతున్నది. UAE పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్యంలో నిర్మాణమైన మొదటి హిందూ మందిరమిది.
ఇటలీ నుండి తెల్లని చలువరాళ్ళు రాజస్థాన్ నుండి గులాబీ రంగు ఇసుకరాళ్లు సేకరించారు. ఈ రాళ్ళు గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సాలోని వివిధ ప్రాంతాల్లోని శిల్పకళా నైపుణ్యం కలిగిన వారసత్వ కళాకారులచే అతి సున్నితంగా, సూక్ష్మంగా శిల్పాలుగా రూపొందాయి.
ఆగష్టు 2015లో, UAE ప్రభుత్వం అబుదాబిలో మందిరాన్ని నిర్మించడానికి భూమిని అందించాలనే నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదటి అధికారిక పర్యటన సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 10 ఫిబ్రవరి 2018న, BAPS స్వామి నారాయణ సంస్థ ప్రతినిధులు షేక్ మొహమ్మద్, భారత ప్రధానిని రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. “మొత్తం రాజకుటుంబం, 250 మందికి పైగా స్థానిక నాయకుల సమక్షంలో ఎంఓయూపై సంతకం చేశారు”. శంకుస్థాపన కార్యక్రమం లేదా శిలాపూజ మరుసటి రోజు జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దుబాయ్ ఒపెరా హౌస్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకను చూశారు.
యూఏఈలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించగా. 2019లో యూఏఈ టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆ సమయంలో మంత్రితో పాటు పలువురు అరబ్ ప్రముఖులు పాల్గొన్నారు.
2024 జనవరి 29న 42 దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు ఆలయాన్ని సందర్శించారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఈ పర్యటనను నిర్వహించారు. సరిగ్గా ఐదు సంవత్సరాల తరువాత నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయం ఫిబ్రవరి 14, 2024న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. ఆలయ ప్రారంభానికి ఒక రోజు ముందు, అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారతీయులు ఉద్దేశిస్తూ ఫిబ్రవరి 13న ‘అహ్లాన్ మోడీ’ గా ఏర్పాటు చేసిన ఒక భారీ సభలో ప్రసంగిస్తారు.
ఆలయ ప్రత్యేకతలు – విశేషాలు:
* గతంలో అనేక ఆలయాలు విధ్వంసం చేసిన వారి ఇప్పటితరం ఈ నిర్మాణానికి పూనుకోవడం ఒక విశేషం.
* అక్కడ 6శాతం ఉన్న హిందువులు మాత్రమే కాకుండా అనేక మంది హిందూ జీవన శైలిని అనుసరిస్తారు. ఆయుర్వేదం, శాకాహార సాత్వికాహారం తీసుకుకోవడం, యోగాసనాలు ప్రాణాయామం వంటి అష్టాంగయోగను అనుసరిస్తారు. భజనలు కీర్తనలు యజ్ఞము వంటి వాటిని నిర్వహిస్తూ ఆనందించేవారు. ప్రకృతి ఆరాధకులందరికీ ఈ ఆలయం కేంద్రం కాబోతున్నది.
* యూఏఈలోని 7 ఏమిరేట్స్‌ని ఆలయ ఏడు శిఖరాలు సూచిస్తాయి.
* మొత్తం 27 ఎకరాల్లో ఆలయం నిర్మితమైంది.
* యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని తెప్పించి ఆలయ నిర్మాణంలో వాడారు.
* పూర్తిగా టెక్ ఫీచర్లు, సెన్సార్లు వంటి వాటిని ఆలయంలో అమర్చారు.
* ఆలయంలో రెండు గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి. ప్రతీ శిఖరంపై భారతీయ ఇతిహాసాలు, గ్రంథాల కథలను చెక్కారు.
* ప్రార్థనా మందిరాలతో పాటు పిల్లలకు ఆట స్థలాలు, గార్డెన్స్, ఫుడ్ కోర్ట్స్, బుక్ స్టోర్స్, గిఫ్ట్ షాపులు ఉన్నాయి.
* మొత్తం ఆలయ ఎత్తు 108 ఫీట్లు
*40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయిని, 1,80,000 క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని నిర్మాణంలో వాడారు.
* 18 లక్షల ఇటుకలను వాడారు.
* 300 సెన్సార్లను టెంపుల్ కాంప్లెక్స్‌లో అమర్చారు.
* 700 కోట్ల రూపాయలు ఖర్చు (అంచనా.)
– సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ అనే ఋషి వాక్కును నిజం చేస్తూ.. ప్రజాహితం, ప్రకృతి హితకారకమైన జీవన పద్ధతిలో జీవించి సంపూర్ణమైన శాంతిని, ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని పొందాలని అందరం కోరుకుందాం.
విశ్వహిందూ పరిషత్, కేరళ తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాల సంస్థాగత కార్యదర్శి.