Home News జన్వాడ ఘటనలో RSS పై అసాంఘిక శక్తుల దుష్ప్రచారం.. అసలు వాస్తవాలివే..!!

జన్వాడ ఘటనలో RSS పై అసాంఘిక శక్తుల దుష్ప్రచారం.. అసలు వాస్తవాలివే..!!

0
SHARE

లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా భ్రమ కల్పించటం అంటే ఇదేనేమో. ఓ క్రైస్తవ ప్రార్థనామందిరంపై జరిగిన దాడిని హిందూ మతానికి ముడిపెట్టి.. శాంతిభద్రతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ శివారు శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని ఓ చర్చ్ పై కొందరు దుండగులు రాళ్లు రువ్వి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తలుపులు, కిటికీలు విరగ్గొట్టారు. ప్రార్థనామందిరంలోకి దౌర్జన్యంగా చొరబడి అడ్డొచ్చిన ముగ్గురు వ్యక్తులను చితక్కొట్టారు. మహిళలపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో జన్వాడా గ్రామం రణరంగంగా.. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

వాస్తవానికి గ్రామంలో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. మార్గమధ్యంలో పనులకు చర్చ్ అడ్డురావడంతో.. దాన్ని అక్కడి నుంచి వేరేచోటికి మార్చాలని.. రోడ్డు వెడల్పు చేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ క్రమంలో చర్చ్ వర్గాలు, కొంత మంది గ్రామస్థుల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. అది కాస్తా దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మోకిలా, నార్సింగి పోలీసులు.. లాఠీచార్జ్ చేశారు. దాడికి పాల్పడ్డవారిని చెదరగొట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ అదనపు డీసీపీ.. ముగ్గురు బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వివాదానికి కారణమైన ఇరు వర్గాలకు వార్నింగ్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేని కొందరు దుండగులు.. దీన్ని తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ ఘటనకు ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సంఘాలకు ముడిపెడుతూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సంఘ్ కు చెందిన కొందరితో పాటు.. స్థానిక నాయకులు కూడా చర్చ్ పై దాడికి దిగారని, చర్చ్ లో ఉన్న ముగ్గురిని చావబాదారని, దళితులను కులం పేరుతో దూషించారంటూ లేనిపోని అవాస్తవాలను పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ.. మతాలు, కులాల మధ్య వివాదంగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి.. ఇది స్థానికంగా జరిగిన ఒక వివాదం తప్ప ఇందులో హిందువులకు, హిందూ సంఘాలకు, ఆర్ఎస్ఎస్ ‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ.. ఈ వివాదాన్ని సాకుగా చూపి ఆర్ఎస్ఎస్‌పై బురద జల్లటానికి జరుగుతున్న ప్రయత్నాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక సంఘ విద్రోహ శక్తుల కుట్రలు దాగి ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఈ విషయం తెలుసుకున్న సంఘ్ ప్రముఖులు.. ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేని ఓ ప్రకటనలో ఖండించారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసి.. శాంతిభద్రతలకు భంగం కలిగేలా వ్యవహరిస్తే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఘ‌ట‌న‌పై SC పరిరక్షణ సమితి స్పందిస్తూ… రోడ్డు విస్త‌ర‌ణ‌లో భాగంగా చ‌ర్చిని తోల‌గించాల‌ని గ్రామ‌స్తులు చేస్తున్న ఆందోళ‌న‌ను, త‌ప్పుదోవ ప‌ట్టిస్తూ హిందువుల మ‌ధ్య చిచ్చు పెట్టాల‌ని కుట్ర‌లు చేస్తున్నార‌ని అన్నారు. అస‌లు చ‌ర్చికి వెళ్లేవారు క్రిస్టియ‌న్లు అవుతార‌ని, ద‌ళితులు ఎలా అవుతార‌ని వారు ప్ర‌శ్నించారు. ద‌ళితుల‌ను హిందూ స‌మాజానికి దూరం చేయాల‌నే ల‌క్ష్యంలో ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను సృష్టిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌ల ప‌ట్ల హిందూ స‌మాజం జాగృత‌మ‌వ్వాల‌న్నారు.