(ఫిబ్రవరి 23 – గాడ్గే బాబా జయంతి )
ఆయన బౌద్ధ భిక్షువు కాదు. కానీ సర్వసంగ పరిత్యాగిలా దేశాటన చేశారు. ఆయనకు దైవారాధన పట్ల నమ్మకం లేదు..కానీ దేవాలయాల వద్ద కనీస వసతులు కల్పించారు. స్నానఘట్టాలు నిర్మించారు. దేవాలయ ప్రాంగణాలను శుభ్రపరిచేవారు. ఆయన అక్షరాస్యులు అంతకన్నా కాదు…కాని వందలాది విద్యాసంస్థలు నెలకొల్పిన విద్యా దాత ఆయనే గాడ్గే బాబా…ఆయనది ఏకాకి జీవితమే అయినా జగమంతా ఆయన కుటుంబమే. స్వచ్ఛత కోసం తపించిన గాడ్గే బాబా…పరిశుభ్రతే దైవమని నిర్వచించిన తొలి సంస్కర్త. చీపురుతో వీధుల్ని- కీర్తనలతో మస్తిష్కాలను శుభ్రం చేసిన వాగ్గేయకారుడు, బడిలో ఆధ్యాత్మికతను వెతికిన వాడు, నిమ్న వర్గాలకు అంబేద్కరే దేవుడు అన్న దార్శనికుడు, సామాజిక న్యాయం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు, మెహర్ బాబాకి ఆత్మీయుడు, సమస్త ఛాందసాలను హేతువుతో ఖండించిన సాధువు ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన పర్యావరణ వాది. మొత్తంగా, ఒక్క మాటలో చెప్పాలంటే, యావత్ జీవితాన్ని సమాజానికి అర్పించిన సర్వసంగ పరిత్యాగి సంత్ గాడ్గే బాబా.
గాడ్గే బాబా 1876 ఫిబ్రవరి 23న పరిత్ అంటే రజక కులానికి చెందిన సక్కుబాయి, ఝింగ్రాజీలకు జన్మించారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని షేన్గావ్. అసలు పేరు దేవూజీ. గాడ్గే అంటే మరాఠీలో మట్టిచిప్ప. చేతిలో చీపురు, తలపై మట్టిచిప్ప ఉండేది. ఎవరికైనా ఒక పనిని చేసిపెట్టి సంపాదించిన ఆహారాన్ని ఆ మట్టిచిప్పలో ఆరగించేవారు. ఏ ఊరికి వెళ్లినా మొదటగా చీపురుతో వీధులను, దేవాలయ ప్రాంగణాలను ఊడ్చేవారు. అక్కడే ‘గోపాలా.. గోపాలా.. దేవకీ నందన్.. గోపాలా..’ అంటూ కీర్తనలు పాడేవాడు. ఆయన గాత్ర మాధుర్యంతో జనం భారీగా తరలి వచ్చేవారు. వారికి మూఢవిశ్వాసాలు, జంతు బలులు, మద్యపానం వల్ల కలిగే అనర్థాలు, నష్టాలను విడమర్చి చెప్పేవారు. సాటి మనిషిని కులం పేరిట చిన్నచూపు చూడవద్దని బోధించేవారు. మనుషులందరూ సమానమని హితవు చెప్పేవారు. గాడ్గేబాబా చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాము లయ్యేవారు. పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు ముఖ్యంగా నిరుపేద, అణగారినవర్గాల జనాలకు విడమరచి చెప్పేవారు.
మహారాష్ట్రలోని సతారా, నాసిక్, అమరావతి, పుణె, ముంబై వంటి ప్రాంతాల్లో అనాథాశ్రమాలు, బాలిక సదనాలు, పాఠశాలలు, వసతిగృహాలు, ధర్మశాలలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు, స్నానఘట్టాలు… ఇలా మొత్తం 150 నిర్మాణాలను ప్రజల సహకారంతో చేపట్టి దిగ్విజయంగా నిర్వహించారు. ముంబైలోని ప్రఖ్యాత జేజే ఆసుపత్రి వద్ద ధర్మశాల కట్టించి పేదరోగులకు ఎంతో మేలు చేశాడు. పండరీపురంతోపాటు అనేక దేవాలయాల వద్ద స్నానఘట్టాలు కట్టించారు. మెహర్ బాబాతో కలసి కుష్టురోగులకు సపర్యలు చేసేవారు. ఒకసారి వార్థాలోని తన సేవాగ్రామ్ సమీపం నుంచి జనం తండోపతండాలు గా తరలివెళ్లడం గాంధీజీ గమనించారు. విషయం ఆరా తీయగా గాడ్గేబాబా కీర్తనలు వినడానికి వెళ్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. గాంధీ ఆహ్వానం మేరకు సేవాగ్రామ్కు వచ్చారు బాబా. ఆయన కీర్తనలకు గాంధీజీ మంత్రముగ్ధులయ్యారు. గాడ్గే బాబా తన 30వ ఏట ఇంటినుంచి బయటకు వచ్చి రోడ్డు మీదే తిని, రోడ్డు పక్కన జీవించి, రోడ్డు మీదే కన్నుమూశారు. 1956 డిసెంబర్ 20న గాడ్గేబాబా తనువు చాలించారు.
విద్యారంగానికి బాబా చేసిన సేవలకు గుర్తింపుగా 1983లో ఏర్పాటు చేసిన అమరావతి విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక 1998లో కేంద్రం బాబా పేరిట తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన స్మారకార్ధం జాతీయ అవార్డును ప్రకటించింది. స్వచ్ఛత అంటే కేవలం వీధులను శుభ్రం చేయడమే కాకుండా ప్రజల మనసులను కూడా శుభ్రం చేయడమని నిరూపించారు గాడ్గే బాబా. వీరి జీవితం అందరికీ ఆదర్శప్రాయమైనది. స్వచ్ఛత వైపు నడిచేలా సమాజానికి ప్రేరణ అందించిన ఆ మహనీయుని స్మృతిలో… అందరం మన మనస్సులని మలినం లేకుండా చేసుకుందాం. సామాజిక సమరసతను పెంపొందిద్దాం. విద్వేషాలు లేని సమ సమాజాన్ని నిర్మిద్దాం.