సందేశ్‌ఖాలీలో మహిళలపై టీఎంసీ నేతల ఆగడాల్లో నిజాలు నిగ్గు తేల్చడానికి వెళ్లిన నిజ నిర్ధారణ బృంద సభ్యులను పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ బృందంలో తెలుగు వ్యక్తి, పాట్నా హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి రాజ్‌పాల్‌సింగ్, నేషనల్ ఉమెన్ కమిషన్ మాజీ సభ్యురాలు చారు వలి కన్నా, న్యాయవాది భావ్‌నా బజాజ్ ఉన్నారు.
సందేశ్‌ఖాలీకి వెళ్లకుండా పోలీసులు అరెస్టు చేసినందుకుగాను నిజనిర్ధారణ కమిటీ సభ్యులంతా ధర్నాకు దిగారు. అయితే వీరిని శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘మేం సందేశ్‌ఖాలీకి వెళ్లి బాధిత మహిళలతో మాట్లాడాలనుకున్నాం. కానీ పోలీసులు వెళ్లనివ్వకుండా మమ్మల్ని కావాలని అరెస్ట్ చేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.సెక్షన్ 144ను ఉల్లంఘించబోము అని చెప్పినా పోలీసులు వినడం లేదు’అని నిజనిర్ధారణ కమిటీ సభ్యురాలు చారుకన్నా తెలిపారు.
కాగా, పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమపై లైంగిక దాడులు చేసేందుకు, తమ భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో షాజహాన్‌ఖాన్ ఇంటిపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు కూడా జరిపింది. దాడులు జరుపుతున్న సమయంలో షాజహాన్‌ఖాన్ మనుషులు ఈడీ సిబ్బందిపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి షాజహాన్‌ఖాన్ పరారీలో ఉన్నాడు.