Home News సమరసత సాధకుడు, భక్తాగ్రేసరుడు సంత్ తుకారాం

సమరసత సాధకుడు, భక్తాగ్రేసరుడు సంత్ తుకారాం

0
SHARE

(మార్చి 22 – సంత్ తుకారాం జయంతి)

సువిశాల, సుసంపన్నమైన ఈ భారత దేశంలో వర్ణ వ్యవస్థ సమాజాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చింది. మన సమాజం కులాధిక్య ప్రభావంతో మనుగడ సాగిస్తున్న రోజుల్లో జ్ఞానమార్గాన్ని, కర్మమార్గాన్ని ఉన్నత వర్గాలు, విద్యావంతులు విశ్వసించగా, సమాజంలోని అట్టడుగు పేదవర్గాలు, అణగారిన వర్గాలు భక్తిమార్గాన్ని అనుసరించడం మనం గమనించవచ్చు. దీనికి ప్రధానంగా నాడు హిందూమతంలో ఉన్న వైరుధ్యాలు, ఇస్లాం మతం దేశవ్యాప్తంగా వ్యాపించడం కారణంగా చెప్పాల్సి వుంటుంది. దేవుడు ఒక్కడే, ముక్తి మార్గానికి భక్తిమార్గమే ప్రధాన ద్వారమని ప్రబోధించిందీ భక్తి ఉద్యమం. మొత్తం మీద ఈ ఉద్యమం వల్ల దళితుడు మానవుడేనని, మనలోని వ్యక్తేనని, జన్మతః అస్పృశ్యుడు కాదని కేవలం సమాజంలోని కొన్ని వర్గాల వల్లనే సంపదకు, సమానతకు, జ్ఞానానికి దూరమైనాడని, దళితులకూ హక్కులున్నాయని సమాజం గుర్తించింది. నాడు సమాజంలో ఉన్న ఎంతోమంది అట్టడుగు వర్గాలకు చెందిన తాత్వికులు, మేధావులు, ఆలోచనా పరుల్లో ప్రధానంగా చెప్పుకోదగినవారు తుకారాం వంటి గురు శిరోమణులు.

పాండురంగ భక్తుడైన తుకారాం మహారాష్ట్రలోని దేహూ అనే గ్రామంలో కనకై, బోల్హోబా దంపతులకు 1607వ సంవత్సరంలో జన్మించారు. తుకారాం బాల్యం నుండే దైవరాధనలో పాల్గొంటూ ఉండేవారు. ఒకసారి మహారాష్ట్ర ప్రాంతంలో కరువు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు ఆకలి చావులు గురయ్యారు. దీంతో సంసారిక జీవితంపై విరక్తి కలిగి తనను తాను విఠలుని పాదపద్మాలకు సమర్పించుకున్నాడు. ఒక రోజు ఒకరోజు సంత్ నామదేవ్ స్వప్నంలో కనిపించి అభంగ కావ్యము రచించాలని తుకారాంని ప్రేరేపించారు. ఆ ప్రేరణతో తుకారాం ఏడెనిమిది వేల అభంగాలు రచించాడు. అంతరాత్మ నుండి పెల్లుబికిన భక్తిగీతాల వెల్లువ అది. తుకారాం తన అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు పరోక్షంగా ఊతం ఇచ్చారు. ధర్మనిష్ఠతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్య పరచడంలో కీలకమైన భూమికను పోషించారు. ముస్లిం పాలకుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడడంలో హిందువులను పరోక్షంగా ప్రేరేపించిన వాగ్గేయకారుడు సంత్ తుకారాం.

శ్రీ సంత్ తుకారాం మహారాజ్ తాను రచించిన అభంగాలలో విఠలేశ్వరుడిని కొలుస్తూనే సత్యాసత్యాలు, ధర్మాధర్మాల పట్ల హిందువుల్లో విచక్షణ కలిగించే మార్గానికి దారి చూపారు. ‘‘సత్య తోచి ధర్మ్ అసత్య తో కర్మ్..ఆణిక్ హే వర్మ్ నాహీ దూజే’’, సత్యం మాట్లాడుతూ తదనుగుణంగా ప్రవర్తించడం ధర్మం. అసత్యం మాట్లాడుతూ తదనుగుణంగా ప్రవర్తించడం అధర్మం. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి అని ప్రబోధించారు. భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు ఆజన్మాంతం పాటుపడిన నామ్‌దేవ్, ఏకనాథ్, జ్ఞానేశ్వర్ తదితర మహాత్ముల సరసన సంత్ తుకారాం నిలిచారు. ముస్లిం పాలకుల అరాచకాలకు, దురాగాతాలకు వ్యతిరేకంగా పోరాడడంలో సంత్ తుకారాం అభంగాలు హిందువులను పరోక్షంగా చైతన్య పరిచాయి. స్వధర్మ ఆచరణ, సత్యపాలన దిశగా హిందువులను కార్యోన్ముఖులను చేశాయి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అసత్యం సత్యంగా చలామణి అవుతున్న నేటి కాలంలోనూ సంత్ తుకారాం రాసిన అభంగాలు కాలదోషం పట్టకపోవడం విశేషం.

హిందూ పద పాదషాహి ఛత్రపతి శివాజీకి కర్తవ్య పాలన గావించిన వ్యక్తి తుకారాం. వైరాగ్యం పొంది సన్యాస ప్రవృత్తి పెరిగిన శివాజీకి తపస్సు కంటే కూడా కర్తవ్యం గొప్పది..కర్తవ్య పాలన సూచించని వ్యక్తికి మరణానంతరం కూడా సద్గతి లభించదు..కనుక నీ రాజ్యాన్ని శక్తియుక్తులతో నేర్పుతో నిర్వహించమంటూ కర్తవ్య బోధ చేశారు. ‘‘హిందూ సమాజం యొక్క నైతిక పతనాన్ని ఆపగలిగేలా ఉండాలి, భారతదేశం సర్వతోముఖ వికాసం చెందడానికి ఆలోచించాలి..అదే నా కోరిక…అది నాకు కానుకగా సమర్పించు,’’ అని శివాజీని తుకారాం అడిగారు.

తుకారం తాను రాసిన అభంగాలను మధురంగా గానం చేస్తూ ప్రజల్లో భక్తిభావాలను పెంపొందించారు. సంత్ తుకారాం ఒక సాధువు మాత్రమే కాదు విప్లవకారుడు కూడా. సమాజంలోని మూఢ నమ్మకాలపై, కుల వ్యవస్థపై తన అభంగాల ద్వారా తిరుగుబాటు చేశారు. సంత్ జ్ఞానేశ్వరుడు రూపొందించిన భాగవత ధర్మ మందిరానికి తుకారాం కలశ స్వరూపులు. వీరు తమ 41వ ఏట ఇంద్రాయణీ నది తీరంలో భజన చేస్తూ చేస్తూ దేహంతో స్వర్గానికి వెళ్లారని వరకరి సంప్రదాయస్థుల నమ్మకం. ఈ సంవత్సరం మార్చ్ 22న ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. తన అభంగాల ద్వారా హిందూ సమాజాన్ని చైతన్యపరిచిన సంత్ తుకారాం బోధనలను మనం మనసా వాచా కర్మణా ఆచరించడమే మనం ఆయనకు ఇచ్చే పవిత్రమైన, ఘనమైన నివాళి.