Home News నగరాలే కాదు.. వనవాసీ ప్రాంతాలకు కూడా సంఘ్ విస్తరించింది : జస్టిస్‌ ఏ. వేంకటేశ్వర రెడ్డి

నగరాలే కాదు.. వనవాసీ ప్రాంతాలకు కూడా సంఘ్ విస్తరించింది : జస్టిస్‌ ఏ. వేంకటేశ్వర రెడ్డి

0
SHARE

డాక్టర్జీ 1925 లో ఐదుగురు మంది బాలురతో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ నేడు మహా వటవృక్షమైందని, దేశంలోని వనవాసీ ప్రాంతాలకు కూడా సంఘం నేడు విస్తరించిందని తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏ. వేంకటేశ్వర రెడ్డి అన్నారు. కేవలం పట్టణాలు, నగరాలే కాకుండా వనాసీ ప్రాంతాల్లో కూడా స్వయం సేవకులు వున్నారని, ఇది అత్యంత గొప్ప విషయమని అభివర్ణించారు. ఇలా సంఘం విస్తరించడానికి డాక్టర్జీ, గురూజీ పాత్ర చాలా వుందని, నాడు నాటిన చిన్న విత్తనమే.. నేడు మహా వృక్షమైందని, ఇది చూస్తే వారు చాలా ఆనందం వ్యక్తం చేసేవారన్నారు. హైదరాబాద్‌ అన్నోజీగూడలోని శ్రీ విద్యావిహార్‌ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి జస్టిస్‌ వేంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంఘం నేడు తల్లి స్థానంలో వుందని, అందులోంచి రాజకీయ విభాగం, న్యాయ, విద్యార్థి, గ్రామీణ వికాస్‌, ధర్మ పరిరక్షణ కోసం, హిందూ జాగరణ కోసం… ఇలా రకరకాల సంస్థలు నేడు సమాజంలో హిందూ సంఘటన కార్యం చేస్తున్నాయని అన్నారు. అన్యాయానికి గురైన వారి పక్షాన వుంటూ, వారికి సరైన న్యాయం అందించడానికి ఇవి కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోని 140 దేశాల్లో సంఘ కార్యక్రమాలు విస్తరించాయని, భారత్‌లో దాదాపు 90 శాతం వరకు సంఘ కార్యకలాపాలు విస్తరించాయని వివరించారు. సమాజంలోని సామాజిక రుగ్మతల విషయంలో పోరాడుతూ.. గొంతు లేని వారికి గొంతుకై స్వయం సేవకులు నిలబడాలని పిలుపునిచ్చారు.

ఈ దేశానికి మంచి భవిష్యత్తుకు వుండాలని, అందులో స్వయంసేవకుల పాత్ర వుండాలని ఆకాంక్షించారు. సంఘం ప్రారంభించినప్పటి నుంచి సంఘ ప్రయాణం కొనసాగుతూనే వుందని, మధ్యలో కాస్త ఇబ్బందులు వచ్చినా.. సంఘ కార్యం మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే వుందని హర్షం వ్యక్తం చేశారు. ఒక్కసారి ఓ వ్యక్తి సంఘ సంపర్కంలోకి వస్తే… ఆ వ్యక్తి సద్గుణాలతో ప్రపంచంలోకి వెళ్తారని, అది నిరంతరం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే వుంటుందని విషదీకరించారు. ఇదంతా అకుంఠిత దీక్ష, నిబద్ధత వల్లే వస్తుందని ఆయన అన్నారు. ఓ వృక్షం ఎంత లోపలికి నాటుకొని వెళ్తే… అంద సుదృఢమవుతుందని, అలాగే స్వయం సేవకులందరూ కార్యంలో నిమగ్నమవుతూ.. దేశానికి సేవ చేయాలన్నారు. సంఘ స్వయం సేవకులు ఏ క్షేత్రంలో ఉన్నా… స్వయం సేవక్ అన్న ముద్ర మాత్రం వేయాలని   జస్టిస్‌ ఏ. వేంకటేశ్వర రెడ్డి ఆకాక్షించారు.