నలంద అనేది పేరు కాదు; మన గుర్తింపు, గౌరవం: ప్రధాని మోదీ

    0
    SHARE

    బిహార్‌లోని చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్‌గిర్‌లో ప్రారంభించారు. 1600 సంవత్సరాల క్రితం భారతీయ విద్యకు ప్రధాన వేదికగా నిలిచిన నాటి అసలు విశ్వవిద్యాలయం ఖిల్జీ కర్కశ దాడుల అగ్నికీలల్లో విధ్వంసానికి గురికాగా, జ్ఞానానికి, పాండిత్యానికి దీపమై ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాచీన అధ్యయన కేంద్రం పునరుద్ధరణకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది. 2016లో యునెస్కో ప్రపంచవారసత్వ సంపదగా ప్రకటించిన నలంద శిధిలాలు ఈ విశ్వవిద్యాలయ గత వైభవానికి ప్రతిబింబాలుగా నిలిచాయి.

    ప్రపంచంలో తొలి ఆవాస విశ్వవిద్యాలయమైన పురాతన నలంద విశ్వవిద్యాలయం 1600 సంవత్సరాల క్రితం ఐదో శతాబ్దంలో స్థాపించబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆసియాలోని విఖ్యాత పండితులెందరినో ఆకర్షించి ప్రపంచంలోనే గొప్ప అధ్యయన కేంద్రంగా భాసిల్లింది. అయితే… భక్తియార్‌ ఖిల్జీ చేసిన ఘోర దాడిలో నలంద విశ్వవిద్యాలయం అగ్నికి ఆహుతయి ధ్వంసమైంది. ఖిల్జీ కిరాతక చర్య వల్ల ఇక్కడి గ్రంథాలయంలోని 90 లక్షల గ్రంథాలు, తాళపత్రాలు అగ్నికీలల్లో కాలిపోతూ ఎగసిన మంటలు 3 నెలల పాటు ప్రజ్వరిల్లాయని చరిత్ర చెబుతోంది.

    ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకోగానే మొదట విశ్వవిద్యాలయం శిధిలాలను పరిశీలించి, నలంద వారసత్వానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి కొత్త క్యాంపస్‌కి చేరుకొని.. అక్కడ బోధి వృక్షాన్ని నాటారు. అనంతరం నూతన క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. భారత ఘనకీర్తిలో నలంద విశ్వవిద్యాలయం విశిష్టమైన పాత్రను, లోతైన చారిత్రక మూలాలు కలిగి ఉందంటూ… దేశ విద్యారంగానికి ఇది ఎంతో ప్రత్యేకమైన దినమని అభివర్ణించారు. నలంద అనేది పేరు కాదని, మన గుర్తింపు, గౌరవం అన్నారు. అగ్నికీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు గానీ, జ్ఞానం కాదన్నారు. భారత ప్రజలు ఈ విశ్వవిద్యాలయంతో ఎంతో అనుబంధం కలిగి వున్నారని, యువత విద్యా అవసరాలను తీర్చడంలో ఈ యూనివర్శిటీ కచ్చితంగా మరెంతో ముందుకు సాగుతుందని తన ‘ఎక్స్’ అకౌంట్‌లో పేర్కొన్నారు.

    ‘‘నెట్‌ జీరో గ్రీన్‌ క్యాంపస్‌’’గా కొత్త క్యాంపస్‌

    నలందా కొత్త క్యాంపస్‌‌ను నెట్‌ జీరో క్యాంపస్‌గా రూపొందించారు. అంటే పర్యావరణ అనుకూలంగా రూపుదిద్దబడిందని అర్థం. ఈ కొత్త క్యాంపస్‌లో 40 తరగతి గదులున్న రెండు అకడమిక్‌ బ్లాకులున్నాయి. ఇక్కడ మొత్తం 1900 మంది విద్యార్థులకు సామర్థ్యం ఉంది. 300 సీట్లున్న రెండు సభామందిరాలు కూడా వున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ కేంద్రం, యాంఫీ థియేటర్‌ కూడా వుంది. ఇందులో 2 వేల మంది కూర్చునే సామర్థ్యం వుంది. ఇవి మాత్రమే కాకుండా విద్యార్థులకు ఫ్యాకల్టీ క్లబ్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌తో సహా అనేక ఇతర సౌకర్యాలున్నాయి.

    ఇప్పుడు కొత్తగా పునరుద్ధరించిన నలందా విశ్వవిద్యాలయం విద్యా సంబంధాల మెరుగుదల, చారిత్రక సంబంధాల పరిరక్షణ లక్ష్యంగా భారత్, ఈస్ట్ ఏషియా సమిట్ (ఈఏఎస్) దేశాల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంది. సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థ, తాగునీటి శుద్ధి వ్యవస్థ, వ్యర్థజలాల పునర్వినియోగ వ్యవస్థలు, 100 ఎకరాలలో నీటి వనరులతో పాటు అనేక పర్యావరణ అనుకూలమైన సదుపాయాలున్నాయి.

    కొత్త అధ్యయనానికి తెరతీసిన ఈ నూతన నలంద విశ్వవిద్యాలయం… అలనాటి నలంద స్ఫూర్తిని అందిపుచ్చుకుని, అధ్యయనం – ఆవిష్కరణల కీలక కేంద్రంగా నిలుస్తూ విద్యారంగంలో ఉత్కృష్ట సంప్రదాయాలను నిలబెట్టేందుకు కృషి చేసే దిశగా ఆశలను రేకెత్తిస్తోంది.

    నలంద నూతన క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ దేశాల రాయబారులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, బిహార్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, సీఎం నితీశ్‌, నలంద యూనివర్శిటీ ఛాన్సలర్‌ అరవింద్‌ పనగారియా ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, భూటాన్‌, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్‌, మారిషస్‌, మయన్మార్‌, న్యూజిలాండ్‌, పోర్చుగల్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, శ్రీలంక మరియు వియత్నంతో సహా మొత్తం 17 దేశాల నుంచి విదేశీ రాయబారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.