ముస్లిం మెజారిటీ దేశమైన తజకిస్తాన్‌‌లో హిజాబ్‌ నిషేధం

    0
    SHARE

    ముస్లిం మెజారిటీ దేశమైన తజకిస్తాన్‌ హిజాబ్‌ ఫై  నిషేధం విధించింది. ఇదో వింత ఆచారమంటూ అక్కడి పార్లమెంట్‌ పేర్కొంటూ.. నిషేధం విధించింది.  స్థానిక సంప్రదాయాలకు పెద్దపీట వేయడానికి ఈ మత ఛాందస నిర్ణయాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈద్‌ పండుగ సందర్భంగా పెద్దవారు పిల్లలకి ఇచ్చే ‘ఈదీ’ సంప్రదాయాన్ని కూడా నిషేధించింది. అంటే.. ఈద్‌ సందర్భంగా పెద్దవారు చిన్న పిల్లలకి డబ్బులు, కానుకలు రూపేణా ఇచ్చే సంస్కృతి అని అర్థం. వీటిని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా అక్కడి ప్రభుత్వం విధించనుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 8,000 నుంచి 65,000 సొమోనీల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

    అంతేకాకుండా ఈ చట్టాలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వ అధికారులకు, మత గురువులకు కూడా జరిమానా విధిస్తామని, 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. హిజాబ్‌ ను రద్దు చేయడం ద్వారా తాము లౌకిక రాజ్య పద్ధతిని అనుసరిస్తున్నామన్న సంకేతాలను తజకిస్తాన్‌ ఇచ్చినట్లవుతుందని అక్కడి వారు అంటున్నారు. ఈ సందర్భంగా తజకిస్తాన్‌ అధ్యక్షుడు రహ్మాన్‌ ఎమోమాలి మాట్లాడుతూ.. అనాదిగా వస్తున్న విలువలు, సంస్కృతిని కాపాడుకోవడానికే ఇలాంటి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. గతంలో ఈయన హిజాబ్‌ను‘‘విదేశీ దుస్తులు’’ అంటూ అభివర్ణించారు. అంతేకాకుండా స్త్రీలు కేవలం తెలుపు రంగునే ధరించాలని, నలుపు రంగును ధరించవద్దని హెచ్చరించారు కూడా. ఎందుకంటే సాధారణంగా నలుపు రంగు బురఖాతో ముడిపడి వుంటుంది కాబట్టి.

    హిజాబ్‌ను నిషేధించే బిల్లును ఈ నెల 19న అక్కడి పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ మధ్య కాలంలో మతతత్వం, ఛాందస విషయాలను అరికట్టడానికి అనేక కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. అక్కడి సంప్రదాయాలను అనుసరించేలా చూడడం, స్థానిక ఆచారాలను ప్రోత్సహించడానికే ఎక్కువ ప్రాధాన్యతను కల్పిస్తోంది. ఈ ఛాందసాలకు వ్యతిరేకంగా 2016 లో అక్కడి ప్రభుత్వం 13,000 మంది పురుషులకు గడ్డం తీయించారు. గడ్డం పెంచుకోవడాన్ని తీవ్రమైన నేరంగా అక్కడి ప్రభుత్వం పరిగణిస్తోంది. అంతేకాకుండా హిజాబ్‌ను విక్రయించే 160 దుకాణాలను మూసేయించారు. అంతేకాకుండా స్థానిక సంప్రదాయలు, ఆచారాలను పాటించని వారికి జైలుశిక్ష కూడా విధించారు.

    వీటితో పాటు 2005 లో అక్కడి విద్యాశాఖ మంత్రి కొన్ని కీలక ఆదేశాలిచ్చారు. పాఠశాలల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. లౌకిక వ్యవస్థలో హిజాబ్‌ ధరించడం రాజ్యాంగానికి విరుద్ధమని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా చదువు పేరుతో పిల్లలు ఎక్కువ సమయం మసీదుల్లో గడపడంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం మసీదుల్లోనే వుంటున్నారని, హోంవర్కులు చేయడం లేదని కూడా వ్యాఖ్యానించారు.