Home Telugu త్రిపురలో వనవాసుల అభివుద్దికై బాటలు వేస్తున్నహిందూ ధార్మిక సంస్థలు

త్రిపురలో వనవాసుల అభివుద్దికై బాటలు వేస్తున్నహిందూ ధార్మిక సంస్థలు

0
SHARE
  •     విశ్వహిందూ పరిషత్‌, అక్షయపాత్ర ఫౌండేషన్‌ కృషి
  •     ప్రతిజ్ఞను నెరవేర్చుకున్న మధుపండిత దాస్‌
  •     దేవాలయం, విద్యాలయం, భోజనాలయం నిర్మాణం
  •     కలశయజ్ఞం, భోజన వితరణ

కాశీరాం పడా రియాంగ్‌ జాతికి చెందిన వనవాసులు నివసించే ప్రాంతం అది త్రిపురలోని కంచన్‌పూర్‌ సబ్‌ డివిజన్‌లో ఉంది.

అక్కడ నివసిస్తున్న వనవాసులకు సరైన తిండి, నీడ, కనీసం కట్టుకోడానికి సరైన గుడ్డ కూడా లభ్యం కాదు. వారి పోషణకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చి మనిషికి రోజుకు 2 రూపాయలు, 400 గ్రాముల బియ్యం ఇస్తుంది. అదే వారికి ఉదర పోషణ. ఇక వీరికి విద్య ఎక్కడ నుండి వస్తుంది ? ఒకవిధంగా వారిది దుర్భర జీవితమే.

వాస్తవానికి వీరంతా మిజోరాం రాష్ట్రానికి చెందినవారు. రియాంగ్‌ జాతికి చెందిన వనవాసులు. వీరిని క్రైస్తవులుగా మార్చేందుకు అక్కడి మిషనరీలు ప్రభుత్వ అండతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంత ప్రయత్నించినా ఈ రియాంగులు క్రైస్తవులుగా మతం మారకపోవడంతో మిజోరాం ప్రభుత్వం 18 సంవత్సరాల క్రితం వీరిని అక్కడి నుండి తరిమేసింది. దానితో ఈ రియాంగులు త్రిపురకు వచ్చి తమ బతుకులు వెళ్లదీస్తున్నారు.

వారి దీనగాథను విని, ప్రత్యక్షంగా చూశారు విశ్వహిందూ పరిషత్‌ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వై.రాఘవులు. వీరి బతుకులలో వెలుగు నింపాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఆయన ఒకే ఒక్క పని చేశారు. తను విని, ప్రత్యక్షంగా చూసిన రియాంగ్‌ వనవాసుల దుర్భర జీవితాలను పూజ్య మధు పండిత దాస్‌కు కూడా చూపించారు. అంతే.

విద్య, వైద్యం, సరైన తిండి కూడా లేని ఆ వనవాసుల దుర్భర జీవితాలను చూసి పూజ్య మధు పండిత దాస్‌ చలించిపోయారు. కన్నీరు కార్చారు. వారి జీవితాలలో వెలుగులు నింపే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. వీరికి భోజనశాల, విద్యాలయం, దేవాలయం నిర్మిస్తాననీ; యువతీ యువకులకు పని కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ విధంగా రాఘవులుకు మాట ఇచ్చారు. ఇది 2014 ఏప్రిల్‌ 25 న జరిగింది.

పూజ్య మధుపండిత దాస్‌ ఇస్కాన్‌ అంతర్జాతీయ చైర్మన్‌, అక్షయ పాత్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ కూడ. దీనుల, దుఃఖితుల పాలిట దైవం వారి తలరాతలు మార్చే కల్పవృక్షం.

2014 ఏప్రిల్‌ 25న రియాంగ్‌ ప్రజల విషయంలో తను చేసిన ప్రతిజ్ఞను ఆయన మరచిపోలేదు.

ప్రతిజ్ఞను నెరవేర్చారు

2017 మార్చి 29 (ఉగాది పర్వదినం)

కాశీరాం పడా-రియాంగ్‌ జాతికి చెందిన వనవాసులు నివసించే ప్రాంతం.

అక్కడ దివ్యమైన దేవాలయం వెలసింది.

100 * 50 గజాల పెద్దహాలు..అందులో విద్యాలయం, భోజనాలయం నిర్మాణమయ్యాయి.

విద్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు జరిగాయి. ఆ ప్రాంతం మొత్తం రియాంగ్‌ జాతి వనవాసుల ఆనందాలతో కోలాహలంగా ఉంది. విద్యాలయం ప్రారంభించటానికి త్రిపుర రాష్ట్ర గవర్నర్‌ తథాగత రాయ్‌ వచ్చేవారే. కాని వాతావరణం అనుకూలించక రాలేకపపోయారు. ఎంతో పెద్ద వేదిక నిర్మాణమైంది. పాఠశాలను ప్రారంభించారు.

స్థానికంగా సేవాప్రకల్పం నిర్వహిస్తున్న శ్రీ రతనమణి సేవాసమితి, అక్షయపాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

350మంది విద్యార్థులతో పాఠశాల ఆరంభమైంది. ఈ ఆనంద సమయంలో సుమారు 5 వేలమంది భోజనం చేశారు.

అక్షయపాత్ర ఫౌండేషన్‌ చైర్మన్‌ మధు పండిత దాస్‌ తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు.

వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి అక్షయ పాత్ర ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ చంచల ప్రభుదాస్‌, గౌహతి క్షేత్ర చైర్మన్‌ జనార్ధన దాస్‌ తదితర 20 మంది దాసాలు; బొంబాయి, కలకత్తా, దిల్లీ, గౌహతి నుండి వందలాది మంది భక్తులు విచ్చేశారు. విశ్వహిందూ పరిషత్‌ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వై.రాఘవులు, ఆ క్షేత్ర సంఘటనా కార్యదర్శి అజయ్‌ పారికర్‌, క్షేత్ర కార్యదర్శి అజిత్‌ జానా, ప్రాంత సంఘటనా కార్యదర్శి పూర్ణ మండల్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆ రోజున (ఉగాది నాడు) అక్కడ నర్సింహ మహాయజ్ఞం జరిగింది. కలశ యాత్ర జరిగింది. శ్రీ కృష్ణుని లాకెట్ల వితరణ జరిగింది. గొప్ప సభ జరిగింది. అందులో చుట్టుపక్కల 60 కిలోమీటర్ల దూరంలో గల గ్రామాల నుండి జమాతియా, చక్మా తదితర అనేక జనజాతులకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

చుట్టుపక్కల ఉన్న అన్ని మతాలవారు, కుల, వర్గ, వర్ణ భేదాలకు అతీతంగా అందరూ వచ్చి మందిర దర్శనం చేసుకున్నారు.

మందిరంలో శ్రీరామ, కృష్ణ, చైతన్య మహాప్రభు వారిని ఒకే విగ్రహంలో చిత్రీకరించిన మూర్తిని ప్రతిష్ఠ చేశారు. త్రిపుర రాజధాని అగర్తలకు 280 కి.మీ. దూరంలో కీకారణ్యంలో బంగ్లాదేశ్‌ సరిహద్దులు, మిజోరాం సరిహద్దులలో ఇంతటి దివ్య మందిర నిర్మాణం అందరినీ ఆకర్షించింది.

(జాగృతి సౌజన్యంతో)