రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంఘ శిక్షవర్గ సమారోప్ (ముగింపు) కార్యక్రమం హైదరబాద్ అన్నోజీగూడ లోని శ్రీ విద్యా విహార్ స్కూల్ లో వైభవోపేతంగా జరిగింది. 21 రోజుల శిక్షా వర్గ లో 380 ప్రదేశాల నుంచి మొత్తం 580 మండి శిక్షణ పొందారు. ఇటువంటి శిక్షావర్గలు ప్రతి సంవత్సరం దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో జరుగుతాయి.
సమారోప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన CYIENT ఎగ్జిక్యూటివ్ చైర్మన్, Dr. బివిఆర్. మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాను హిందువునని చెప్పుకునేందుకు గర్విస్తానని అన్నారు. వ్యక్తులు, అలాగే జాతి అభివృద్ధి చెందాలంటే విద్య, విలువలు, సమాజం గురించి జాగ్రత్త పడాలని ఆయన అభిప్రాయపడ్డారు. శిక్షణ పొందిన శిక్షార్థుల క్రమశిక్షణ, వారికి శిక్షణ ఇచ్చేందుకు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చిన శిక్షకులను ఆయన అభినందించారు.
ప్రధాన వక్తగా పాల్గొన్నదక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ , శ్రీ . ఆలె శ్యామ్ కుమార్ గారు శతాబ్దాలుగా హిందూ సమాజం వివిధ సవాళ్లను ఎలా ఎదుర్కొంటూ వచ్చిందో వివరించారు. 8 శతాబ్దాల పాటు ఇస్లామిక్ దాడులు, యూరోపియన్ దురాక్రమణను తట్టుకుని నిలబడిందని అన్నారు. హిందూ సమాజంలో అంతర్గతంగా ఉన్న శక్తే దీనికి కారణమన్నారు. సమాజం లోని ఈ శక్తిని వ్యక్తి నిర్మాణం, దేశభక్తి భావనల ద్వారా పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యమని శ్యామ్ కుమార్ అన్నారు.
సంఘ స్వయంసేవకులు సమాజంలో ఉన్న వివక్షను తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. మన శాస్త్రాలు ఏకత్వాన్ని బోధిస్తే, మన పూర్వులు మానవ విలువలతో కూడిన జీవనాన్ని గడిపారు. కానీ కొన్ని శతాబ్దాల క్రితం వివక్ష తో కూడిన ఆచారాలు, పద్దతులు మన సమాజంలో చొరబడ్డాయి. సమాజంలో అందరికీ దేవాలయ ప్రవేశం, అందరికీ ఒకే స్మశానం, ఒకే నీటి వనరు ఉండేట్లుగా చూసేందుకు స్వయంసేవకులు ప్రయత్నిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో హిందూ సమాజం పై జరుగుతున్న దాడులను కూడా శ్యామ్ కుమార్ ప్రస్తావించారు. తెలంగాణా లో ముస్లిం లకు 12 శాతం మతపరమైన రిజర్వేషన్ లు ఇవ్వాలని ప్రయత్నించడం రాజ్యాంగ విరుధ్ధమని ఆయన అన్నారు. చైనా వస్తువులను బహిష్కరించడం ద్వారా ప్రతి ఒక్కరూ చైనా దురాక్రమణ ను అడ్డుకోవాలని, జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన తన ఉపన్యాసాన్ని ముగించారు.
హిందుత్వ భావన సంపూర్ణమైనది. సమాజం మొత్తంలో హిందూత్వం పట్ల విశ్వాసం, గర్వం కలిగి , ప్రతి వ్యక్తి సకారాత్మక అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించ గలిగితే స్వామి వివేకానందుడు ఆశించిన ఉజ్వల భారతం సాకారమౌతుంది .