Home Telugu Articles వెంటాడే పీడకలలు, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలు

వెంటాడే పీడకలలు, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలు

0
SHARE

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన హడావుడిలో పడి, 42 ఏళ్ల నాటి ఆత్యయిక స్థితి గురించి దేశం మరచిపోయినట్లు కనిపిస్తోంది. అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే లక్షమందికి పైగా ఎలాంటి విచారణా లేకుండా జైళ్లలో కుక్కారు. అప్పటి అరాచకాలు, అకృత్యాలను బయటపెట్టకుండా మీడియా గొంతు నొక్కారు. ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా చలాయించుకున్నారు. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తనయుడు సంజయ్‌ గాంధీ, సర్వం తానై చక్రం తిప్పారు. అడ్డూఆపూలేని అధికారం చలాయించారు. ఆయన అండ చూసుకొని, ఆయన ఆదేశాలను తలదాల్చి ఉన్నతాధికారులు చెలరేగిపోయారు. మాట కాదన్నవారిని కటకటాల వెనక్కు నెట్టారు. రాజ్యాంగేతర శక్తిగా సంజయ్‌ గాంధీ విశృంఖల విహారం చేసిన ఆనాటి రోజులు, ఈనాటికీ వెన్నాడుతున్న పీడకలలు!

న్యాయవ్యవస్థపై ఒత్తిడి

అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలం న్యాయవ్యవస్థపాలిట పెనుశాపంగా పరిణమించింది. న్యాయమూర్తులే సాగిలపడే రీతిలో ఈ వ్యవస్థను తల్లీకొడుకులు భయభ్రాంతులకు గురిచేశారు. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులను సస్పెండ్‌ చేసే అధికారం పార్లమెంటుకు ఉందని తీర్పు చెప్పే స్థాయిలో ప్రభుత్వం న్యాయవ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చింది. అత్యవసర పరిస్థితి విధించడాన్ని సైతం న్యాయవ్యవస్థ సమర్థించవలసి వచ్చింది. ఒకే ఒక్క న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా మాత్రం భిన్నమైన తీర్పు చెప్పారు. దాంతో ఆయనను ఆనాటి ప్రభుత్వం పక్కన పెట్టింది. న్యాయంగా దక్కాల్సిన పదోన్నతికి మోకాలడ్డింది. ఆయనను అవమానించింది. ఆ తరవాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇందిరాగాంధీని, ఆమె తనయుడు సంజయ్‌ గాంధీని చిత్తుచిత్తుగా ఓడించి, గట్టి గుణపాఠం నేర్పారు! అత్యవసర పరిస్థితిని సమర్థిస్తూ అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పువల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు కొంతవరకు భంగం వాటిల్లింది. న్యాయవ్యవస్థ విమర్శలకూ గురైంది. అందువల్ల అప్పటి ఆ తీర్పు పట్ల విచారం వ్యక్తపరుస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్మానం ఆమోదిస్తే బావుండేదేమో అనిపిస్తోంది. అది కాకపోయినా, కనీసం మరేదైనా దిద్దుబాటు చర్య తీసుకొని ఉండాల్సింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఇప్పుడున్న న్యాయమూర్తులంతా ఉదారవాదులే, గొప్ప న్యాయకోవిదులే. విశాల హృదయం కలిగిన న్యాయమూర్తులు, దీని మీద ఇప్పటికైనా ఆలోచిస్తే మంచిదేమో. చరిత్రగతిలో ఒక పొరపాటు దొర్లిపోయింది. దాన్ని చక్కదిద్దలేకపోయినా, దాని దుష్ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తే తప్పేమీలేదు.

అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలం భారతదేశానికి అంధ యుగం. ఆ చీకటి రోజుల్లో- జీవించే హక్కును సైతం అటకెక్కించారని నాటి అటార్నీ జనరల్‌ నీరెన్‌ డే అప్పట్లోనే న్యాయస్థానంలో వాదించారు. అప్పట్లో దిల్లీలోని న్యాయవాదులు నోరు విప్పాలంటేనే భయపడేవారు. కానీ, ఆ కాలంలోనూ కొంతమంది ధైర్యంగా వ్యవహరించారు. నన్ను నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ నా భార్య హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు వేసినప్పుడు ముంబయికి చెందిన సొలీ సొరాబ్జీ, దిల్లీకి చెందిన వి.ఎం.తార్కుండే వంటి న్యాయవాదులు మా తరఫున వాదించారు. అప్పటికే నేను మూడు నెలలుగా జైలులో ఉన్నాను. జస్టిస్‌ ఎస్‌.రంగరాజన్‌, జస్టిస్‌ ఆర్‌.ఎన్‌.అగర్వాల్‌లతో కూడిన న్యాయపీఠం నా విడుదలకు ఆదేశించింది. ఆ తీర్పు వెలువరించినందుకు న్యాయమూర్తులిద్దరినీ ఆనాటి ప్రభుత్వం శిక్షించింది. జస్టిస్‌ ఎస్‌. రంగరాజన్‌ను గౌహతికి బదిలీ చేశారు. ఆయన అత్యంత నిష్పక్షపాతంగా వ్యవహరించేవారని అక్కడి ప్రజానీకం ఇప్పటికీ గుర్తు చేసుకొంటుంటారు. ఇక, జస్టిస్‌ అగర్వాల్‌ స్థాయిని తగ్గించి, సెషన్స్‌ కోర్టుకు తిప్పిపంపారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్య చేపట్టినప్పటికీ- వారి దీక్షాదక్షతలు చెక్కుచెదరలేదు. భయ పక్షపాతాలకు అతీతంగా వారిరువురూ స్వతంత్రంగా కర్తవ్యపాలన సాగించారు.

మీడియా జాగరూకత కారణంగా ఈమధ్య కాలంలో న్యాయమూర్తులమీద ఒత్తిడి కొంతవరకు తగ్గింది. అయినా- అధికారంలో ఎవరున్నాసరే, న్యాయమూర్తులు స్వేచ్ఛగా పనిచేయగలిగే పరిస్థితులు ఉండాలి. అప్పుడే న్యాయసేవల్ని చక్కగా అందించగలుగుతారు. ఇందిరాగాంధీ హయాములో, ముఖ్యంగా ఆత్యయిక పరిస్థితి అమలులో ఉన్న కాలంలో అలాంటి వాతావరణం ఉండేది కాదు. తనకు ఇష్టమైన న్యాయమూర్తుల్ని పైకి లేవనెత్తడం, ఇష్టంలేనివారిని పాతాళానికి అణగదొక్కడమనే ప్రక్రియను ఆమే ప్రారంభించారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ పదవికి జస్టిస్‌ ఎ.ఎన్‌.రేను ఎంపిక చేయాలనుకొన్న ఆమె, జస్టిస్‌ జె.ఎం.షెలత్‌, జస్టిస్‌ కె.ఎస్‌.హెగ్డే, జస్టిస్‌ ఎ.ఎన్‌.గ్రోవర్ల వంటి సీనియర్లను కాదని, తన పంతం నెగ్గించుకొన్నారు. ఎలక్షన్‌ అక్రమాలకు పాల్పడినందుకు న్యాయస్థానం ఆమెను పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించడమే కాకుండా, ఎన్నికల్లో పాల్గొనకుండా ఆరేళ్లపాటు నిషేధం విధించింది. ఆ తీర్పును జీర్ణించుకోలేకే ఆమె అత్యవసర పరిస్థితి విధించి, చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకొన్నారు. న్యాయవ్యవస్థ పట్ల, ప్రజాస్వామిక హక్కుల పట్ల ఆమె చులకన భావానికి నిదర్శనమిది.

జోక్యం అనర్థదాయకం

ఆత్యయిక స్థితి అమలులో ఉన్న కాలంలో ఇందిరాగాంధీ, ఆమె తనయుడు సంజయ్‌ గాంధీల అరాచకాలు ప్రజాస్వామ్య హితైషులందర్నీ తీవ్రంగా బాధించాయి. ఆమెను ఓడించి, అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ఇకమీదట ఎమర్జెన్సీ విధించే అవకాశమే లేకుండా రాజ్యాంగాన్ని సవరించింది. అంతేకాదు, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదంటూ జస్టిస్‌ ఖన్నా వెలువరించిన భిన్నమైన తీర్పునే సంవిధానంగా అంగీకరించింది. పార్లమెంటరీ పరిపాలన వ్యవస్థ సజావుగా పనిచేయడానికి, న్యాయవ్యవస్థను ఎవ్వరూ కించపరచకుండా ఉండటానికి దీంతో అవకాశం ఏర్పడింది. ఆ మాటకొస్తే న్యాయవ్యవస్థ విషయంలో ఏ ప్రభుత్వమూ, ఏ స్థాయిలోనూ జోక్యం చేసుకోరాదు. అప్పుడే న్యాయపాలిక స్వేచ్ఛగా, సజావుగా పనిచేయగలుగుతుంది. అధికారంలో ఎవరున్నా దీన్ని మరవరాదు. స్వతంత్రంగా పనిచేసే వాతావరణం ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించగలదన్న వాస్తవాన్ని విస్మరించరాదు. అత్యవసర పరిస్థితినాటి అనుభవాల నుంచి నేర్చుకోదగిన అతి ముఖ్యమైన పాఠమిది!

-కులదీప్ నయ్యర్

రచయిత ప్రముఖ పాత్రికేయులు,బ్రిటన్ లో భారత మాజీ హై కమిషనర్

ఈనాడు సౌజన్యం తో