Home Telugu Articles ‘డ్రాగన్‌’కు దీటైన జవాబు! భారత్‌ ముందు బహుముఖ వ్యూహం

‘డ్రాగన్‌’కు దీటైన జవాబు! భారత్‌ ముందు బహుముఖ వ్యూహం

0
SHARE

భారత్‌ ఈ ఏడాది ఎదుర్కొంటున్న అతిపెద్ద విదేశాంగ సంక్షోభమిది. గడచిన కొన్ని వారాలుగా భారత్‌, చైనా మీడియా సంస్థలు పోటా పోటీగా వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. డోక్‌లామ్‌ పీఠభూమిలో అక్రమంగా రహదారి నిర్మాణం చేపట్టిన చైనా ప్రయత్నాలను భారత్‌ గట్టిగా అడ్డుకుని నిలవడంతో సంక్షోభం మొదలైంది. వేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఇరు దేశాల మధ్య అప్పుడప్పుడూ సైనికపరమైన ఉద్రిక్తతలు చెలరేగడం సహజమే. 2010-’17 మధ్యకాలంలో ఉభయ పక్షాల సరిహద్దుల్లో 2,500 చొరబాటు ఘటనలు జరిగాయి. చాలావరకు బయటి ప్రపంచానికి వాటి వివరాలు తెలియదు. ఇటు ఇండియా కాని, అటు చైనా కాని కనీసం వాటి గురించి ఏనాడూ నోరువిప్పలేదు. భారత్‌, భూటాన్‌, చైనాల మధ్య ఉన్న డోక్‌లామ్‌ త్రికూడలి (ట్రైజంక్షన్‌) వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. ఈ ప్రాంతంపై భూటాన్‌, చైనాల మధ్య ఏనాటినుంచో వివాదం కొనసాగుతోంది. భారత్‌కు భూటాన్‌తో సుదీర్ఘకాలంగా రక్షణ ఒప్పందం కొనసాగుతోంది. చైనాతో భారత్‌కు పొడవాటి సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు రేఖ పొడవునా ఒక్క డోక్‌లామ్‌ ప్రాంతంలోనే భౌగోళికంగా చైనాకంటే బాగా భారత్‌ది పైచేయిగా ఉంది. ఈ పీఠభూమి ప్రాంతంలో భూటాన్‌, ఇండియాల మధ్య చైనా ఇరుక్కుపోయి ఉంది. ఇక్కడ గనక చైనా పట్టు సాధిస్తే ఈశాన్య ప్రాంతాన్ని భారత్‌తో కలుపుతున్న ‘కోడి మెడ’ (చికెన్‌ నెక్‌)పై పట్టుసాధించేందుకు బీజింగ్‌ దళాలకు అవకాశం చిక్కుతుంది. డోక్‌లామ్‌లో చైనా దళాలకు భారత్‌ గట్టిగా అడ్డుచెప్పడానికి అసలు కారణమిదే. జీ-20 సమావేశంలో ఇరు దేశాధినేతలు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. దాంతో డోక్‌లామ్‌ సమస్య సద్దుమణుగుతుందని చాలామంది భావించారు. కానీ, వెనకడుగు వేసేందుకు బీజింగ్‌ ససేమిరా అంటోంది. భారత దళాలూ అంతే పట్టుదలగా అడ్డు నిలబడ్డాయి.

చైనా దూకుడు

మునుపటిలా చైనా ఇప్పుడు ఎగుమతులకోసం పూర్తిగా ఆసియా దేశాలమీద ఆధారపడి లేదు. మధ్యధరా, హిందూ మహా సముద్రాల మీదుగా 18 లక్షలకోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను ఐరోపా మార్కెట్లకు చేరవేయడం చైనాకు సులభంగా మారింది. మిగిలిన దేశాలకు ఎప్పటిలాగే చైనా రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఎగుమతులు కొనసాగిస్తోంది. కాబట్టి ఆసియా దేశాలను బుజ్జగించాల్సిన అనివార్యత ఇప్పుడు చైనామీద లేదు. అందుకేనేమో చైనాకు చుట్టుపక్కలున్న 18 దేశాలతో సరిహద్దు సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్‌ నాయకత్వం మితిమీరిన దూకుడు ప్రదర్శిస్తోంది. మరోవంక జమ్ము కశ్మీర్‌కు సంబంధించి పాకిస్థాన్‌కు మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోంది. భూటాన్‌ను కవ్విస్తోంది. ‘ఏసియాన్‌’ దేశాలతో అతిగా రాజకీయాలు ఆడుతోంది. వివిధ దేశాల్లో రేవులు, రోడ్లు నిర్మిస్తూ గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ఏ ఒక్క దేశంమీదో ఆధారపడాల్సిన అవసరం లేని పరిస్థితి, ఆర్థిక బలిమి, అమేయ సైనిక శక్తి కారణంగా చైనా నాయకత్వం అవధుల్లేని ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తోంది. ఆసియా దేశాలపై ఆధిపత్యం చలాయించడం తన హక్కుగా భావిస్తోంది. సరైన అవకాశం దొరికితే ప్రపంచాన్నే పుక్కిట పట్టగల శక్తి చైనాకు ఉందని బీజింగ్‌ నాయకులు నమ్ముతున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరవాత అంతర్జాతీయంగా అమెరికా ప్రాధాన్యం, అవసరం మునుపటితో పోలిస్తే కొంత తగ్గడం కూడా చైనాకు కలిసివచ్చిన అంశం. అనేక రకాల విభేదాలతో ఐరోపా దేశాలు నిట్టనిలువునా చీలిపోయి ఉన్నాయి. మరోవంక మితిమీరిన రక్షణాత్మక ధోరణితో బ్రిటన్‌ ముడుచుకుపోతోంది. అంతర్జాతీయంగా చైనా ప్రాబల్య విస్తరణకు కలిసివస్తున్న అంశాలివి. అందుకే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) వంటి కొత్త ప్రతిపాదనలతో చైనా దూకుడుగా ముందుకు వెళ్తొంది. ప్రపంచ దేశాలపై ఆధిపత్యానికి వేగంగా పావులు కదుపుతోంది.

ఈ క్రమంలో చైనా ఓ కీలక అంశాన్ని విస్మరిస్తోంది. 19వ శతాబ్దంనాటి భారత్‌కూ ఇప్పటికీ ఎంతో తేడా ఉందన్న విషయాన్ని బీజింగ్‌ నాయకత్వం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆసియాలో ప్రబలశక్తిగా భారత్‌ ఆవిర్భవించింది. బీఆర్‌ఐ వంటి కార్యక్రమాలను చేపట్టి ఆసియా దేశాలను అందులో భాగస్వాములుగా మార్చడం ద్వారా, వాటిని తీవ్రమైన రుణ వూబిలోకి నెట్టేందుకు బీజింగ్‌ రంగం సిద్ధం చేసిందని భారత్‌ బలంగా విశ్వసిస్తోంది. అందుకే బీఆర్‌ఐకి భారత్‌ ఏ దశలోనూ మద్దతు తెలుపలేదు. చైతన్యశీల ప్రజాస్వామ్య వ్యవస్థల తోడ్పాటుతో గడచిన రెండు దశాబ్దాలుగా భారత్‌ ఆర్థిక మహాశక్తిగా ఎదుగుతున్న తీరుతెన్నులను చైనా సునిశితంగా గమనిస్తోంది. భారత్‌ ఆర్థిక ఎదుగుదలను భరించలేని చైనా, వీలు దొరికినప్పుడల్లా అడ్డంకులు సృష్టిస్తోంది. పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాదానికీ పరోక్ష మద్దతుగా నిలుస్తోంది. ఉగ్రవాదానికి అవసరార్థపు నిర్వచనాలు చెప్పుకొంటూ అణు సరఫరా దేశాల బృందంలో భారత్‌ చేరికను ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తోంది. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా ద్వారా భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. గడచిన కొంతకాలంగా చైనా సృష్టిస్తున్న సమస్యల్లో భాగంగానే డోక్‌లామ్‌ ప్రతిష్ఠంభనను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్న తరుణంలో భారత్‌ ముందున్న మార్గాలేమిటన్న చర్చ వూపందుకుంది. యుద్ధరంగంలోకి దూకి చైనాతో ప్రత్యక్షయుద్ధం చేయాలని కొందరు, భారత్‌లోకి దిగుమతి కాకుండా చైనా వస్తువులపై పూర్తి నిషేధం విధించాలనే వారు ఇంకొందరు! ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాల్లో లెక్కకు మిక్కిలిగా విపరీత వాదనలు వినిపిస్తున్నాయి.

దౌత్యానికి పదును

హేతుబద్ధతను గాలికి వదిలి కేవలం ఉద్వేగాలను పట్టుకుని వేలాడటంవల్ల ఉపయోగం లేదు. చైనానుంచి దిగుమతులను పూర్తిగా నిషేధించడం సాధ్యమయ్యే పనికాదు. ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత్‌, చైనాలు సభ్యరాజ్యాలు కాబట్టి- ఇష్టానుసారం ఏ దేశమూ మరోదానిపై ఏకపక్షంగా ఆంక్షలు విధించడం కుదిరేపని కాదు. మరోవంక డోక్‌లామ్‌లో భూటాన్‌, చైనాల మధ్య తలెత్తిన ప్రతిష్ఠంభనలో థింపూ నాయకత్వం తరఫున భారత్‌ జోక్యం చేసుకుంటోంది. ఈ విషయంలో దిల్లీ పాలకులు ఆచితూచి వ్యవహరించాలి. బీజింగ్‌ బెదిరింపులకు, హెచ్చరికలకు ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచబోమన్న స్పష్టతనూ భారత నాయకత్వం ఇవ్వక తప్పదు. సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే భారత్‌ దౌత్యపరమైన పరిష్కారాలు అన్వేషిస్తోంది. ఈ విషయంలో దిల్లీ నాయకత్వం మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా భారత్‌ ఇప్పుడున్న దానికంటే బలమైన ఆర్థిక, సైనిక శక్తిగా రూపాంతరం చెందాల్సి ఉంది. భవిష్యత్తులో మనవైపు చూడాలంటేనే చైనా వంటి దేశాలు బెంబేలెత్తిపోయేలా భారత్‌ రాటుతేలాలి. ఒకవేళ చైనా యుద్ధానికే తెగబడితే, దానివల్ల ఆ దేశానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పొరుగుదేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకునే దేశంగా చైనాకు చెడ్డపేరు ఉంది. భారత్‌తో సమరానికి దిగితే బీజింగ్‌ ప్రతిష్ఠ పాతాళాన్ని అంటుతుంది. ఏదిఏమైనా అణ్వస్త్ర బలానికీ భారత్‌ పదునుపెట్టుకోక తప్పదు. ఆ భయంతోనైనా చైనా వంటి దేశాలు భారత్‌లో చొరబాట్లకు స్వస్తిపలికే అవకాశం ఉంది. భారత్‌లో ఏడు అణ్వస్త్ర ప్రయోగ కేంద్రాలున్నాయి. సముద్ర కేంద్రంగా ఒకటి, భూమి మీదనుంచి నాలుగు, మరో రెండింటిని ఎయిర్‌క్రాఫ్ట్‌ల సాయంతో ప్రయోగించడానికి అనువుగా ఉన్నాయి. మరోవంక భారత అమ్ములపొదిలోని అగ్ని-4ను ఈశాన్య రాష్ట్రాలనుంచి ప్రయోగిస్తే బీజింగ్‌, షాంఘైల దాకా చేరగల సామర్థ్యం ఉంది. అగ్ని-5 ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే అయిదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను సైతం ఛేదించవచ్చు. అణ్వస్త్ర సంపన్నమైన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఉభయపక్షాలూ ఓడిపోతాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన సందర్భమిది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలను నివారించి, ఆసియాలో శాంతి సౌభ్రాతృత్వాలను పాదుకొల్పడంపై ఇరు దేశాలూ కృషి చేయాలి.

– మహేంద్రబాబు కురువ

(ఈనాడు సౌజన్యం తో)