Home News సరస్వతీ నదిని వెలికి తెచ్చిన అపర భగీరథుడు శ్రీ మోరోపంత్‌ పింగళే

సరస్వతీ నదిని వెలికి తెచ్చిన అపర భగీరథుడు శ్రీ మోరోపంత్‌ పింగళే

0
SHARE
Sri Moropant Pingle

భారతదేశంలోనే అనేక పురాణగ్రంథాలలోనూ, వేదాలలోనూ సరస్వతీనది గురించిన ప్రస్తావన ఉంది. దానిని పరిశీలించినప్పుడు భారతీయ సంస్కృతి మౌలికంగా సరస్వతీ దేవి ఒడ్డుననే వర్ధిల్లినదని, వికసించినదని మనకు తెలిసి వస్తుంది. మరి ఆనాడు అంతటి ప్రాధాన్యం వహించిన నది ఎందుకని నామమాత్రావశిష్టమై పోయింది? ఈ ప్రశ్న శతాబ్దాలుగా ఉన్నదే. అయితే ఈ దేశంతో ముడిపడిన ఇలాంటి ప్రశ్నలను ఒకచోట చేర్చి, వాటిని చర్చింపజేసి, వాటిని ముందుకు నడిపించటంలో మార్గదర్శనం చేసిన ఒక అసాధారణ వ్యక్తిత్వం గల వ్యక్తిని మనం చూశాం. ఆయన పేరు ఉమాకాంత్‌ కేశవ ఆప్టే. ఆయనను బాబా సాహెబ్‌ ఆప్టే అని పిలుస్తూ ఉండేవాళ్లం.

ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌లో అఖిలభారత స్థాయి కార్యకర్తగా ఉన్నారు. ఆయన స్వర్గస్థులైన తర్వాత శ్రీ బాబా సాహెబ్‌ ఆప్టే స్మారక సమితి అనే పేరున ఒక ట్రస్ట్‌ ఏర్పడింది. మనకు పూర్వీకుల నుండి మూలధనంగా వస్తూ ఉన్న వారసత్వ సందపను వెలికితీసి, ఈనాటి తరాలకు అర్థమయ్యే రీతిలో ఆధునిక పరిభాషలో వెలియజెప్పటం ఆ సంస్థ యొక్క లక్ష్యం. ఆప్టేజీ తరువాత ఈ పనిని చేపట్టి ముందుకు నడిపించటంలో నిమగ్నమైన వ్యక్తి శ్రీ మోరోపంత్‌ పింగళే.

శ్రీ మోరోపంత్‌జీ ప్రేరణతో, ఆయన నేతృత్వంలో ఇప్పటి వరకు సాధింపబడిన కార్యాలను వరుసగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పుస్తకాలనే వ్రాయవలసి ఉంటుంది. అయితే సరస్వతీ నదిని వెలికి తీసికొని వచ్చే కృషికి మాత్రమే ఈ వ్యాసం పరిమితం.

సుమారు 17 సం||ల క్రిందటి సంగతి. ఒకరోజు రాత్రి మంచి గాఢమైన నిద్రలో ఉండగా మోరోపంత్‌కి హఠాత్తుగా ‘సరస్వతీ నదిని వెదికి బయటకు తీయాలి’ అని స్ఫురించింది. అంతే. ఆ మరుసటి రోజు నుండి దానిని గూర్చి ఆలోచించ నారంభించారు.

వారు మొట్టమొదటగా ఈ విషయాన్ని ఉజ్జయినిలో నివసించే మిత్రుడు, పురాతత్వవేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన డా||విష్ణు శ్రీధర్‌ వాకణ్‌కర్‌ (హరిభావు)తో ప్రస్తావించారు. ఇది జరిగే పని కాదన్నా రాయన. అయితే మోరోపంత్‌ కూలబడిపోలేదు. దేశవ్యాప్తమైన తన పర్యటనలో అనేకమంది విద్వాంసులను, పరిశోధకులను కలుస్తూ ఉండేవారు. ఉత్తరభారతదేశంలోని అనేక చోట్లకు పోయి స్వయంగా పరిశీలిస్తూ ఉండేవారు.

వేదాలలో, పురాణాలలో ఎక్కడెక్కడైతే సరస్వతీ నది గురించిన వర్ణనలు ఉన్నవో, దానినిబట్టి ఆ నది యొక్క భౌగోళిక రూపాన్ని గురించి వివరాలు ఒకచోట క్రోడీకరించే పనిని కొందరు విద్వాంసులకు అప్పగించారు. వైదిక సరస్వతీ నది శోధ కార్యమనే పేరుతో విశ్వవిద్యాలయంలో ఒక పీఠాన్ని హరిభావు వాకణ్‌కర్‌ ఏర్పరచి, దానిని నిర్వహించే పనిని తన భుజాలపైనే వేసుకున్నారు. మోరోపంత్‌జీ వారికి కావలసిన సహాయమందిస్తూ ఉండేవారు. 1985లో ఈ పనిని అధికారికంగా చేపట్టబడింది. క్రమక్రమంగా విజయ వంతమైంది.

సరస్వతీ నది ఉద్గమస్థానం – ప్రవాహ మార్గం

హిమాలయాలలోని శివాలిక పర్వతశ్రేణిలో ఆదిబద్రీ అనే చోట సరస్వతీకి ఉద్గమస్థానమై ఉండాలని పురాతత్వవేత్తలు, భూగోళ శాస్త్రజ్ఞులు సూచించారు. అక్కడి నుండి ఆ నది హర్యానా, రాజస్థాన్‌, గుజరాత్‌ల మీదుగా కచ్‌బావడ మీదుగా ఈనాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించుతూ ఉండాలని పరిశోధనల ద్వారా నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలనన్నింటినీ ఆ దారిలో వచ్చే గ్రామాలన్నింటికీ శాస్త్రజ్ఞుల బృందాలను వెంటబెట్టుకొని తిరిగారు. శతాబ్దాల తర్వాత కూడా ఈ బృహత్తరమైన నది యొక్క ఒడ్లు రెండు వైపులా ఇప్పటికీ కొన్నిచోట్ల కనిపించుతూనే ఉన్నాయని అప్పుడు తెలియ వచ్చింది. శుష్కించి పోయిన ఆ నది యొక్క ప్రవాహ మార్గమూ కొన్నిచోట్ల కనుగొనబడింది. కొన్ని చోట్ల ఆ నదిని అనుకొని కొన్ని మందిరాలు ఉన్నాయి. కొన్ని చోట్ల మంచి పచ్చికబయళ్లు, మాగాణాలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తించిన తర్వాత నదీ ప్రవాహ మార్గంగా గుర్తించిన చోట్ల గొట్టపుబావులు దించి వాటి ద్వారా లభించిన నీటిని పరీక్ష కోసం ప్రయోగశాలలకు పంపించారు.

ఉద్గమస్థానం నుండి మొదలుకొని పాకిస్థాన్‌ సరిహధ్దు వరకూ గల ఈ నీటి శాంపిల్స్‌ అన్నీ ఒకేరకమైన గుణధర్మాలు కల్గినవిగా పరీక్షల్లో స్పష్టమైంది. దానిని బట్టి భూగర్భంలో ఇప్పటికీ నదీ ప్రవహించూతూనే ఉండి ఉంటుందని అవగాహనకు వచ్చారు. అప్పుడు కొంత విశేష ప్రయత్నం చేసి అమెరికాలోని ‘నాసా’ సహాయంతో ఈ ప్రవాహ ప్రాంతంలో ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీయించారు. వాటిలో ఉపరితలాన ఎండిపోయిన ప్రవాహమార్గం గుర్తించడానికి వీలుగా కనబడసాగింది.

కొన్ని సంవత్సరాల క్రిందట ‘సరస్వతీ నదీ శోధ సంస్థాన్‌, హర్యానా’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. కురుక్షేత్రానికి చెందిన దర్శన్‌లాల్‌జైన్‌ ఈ సంస్థకు అధ్యక్షులు. చారిత్రక పరిశోధకులైన ఠాకూర్‌ రామసింగ్‌ (న్యూఢిల్లీ) ఈ పనిని చూస్తూ ఉండగా, మోరోపంత్‌జీ ఈ పనికి మార్గదర్శకులుగా ఉంటూ వచ్చారు. వారణాసిలో ఉండే డా||టి.పి.శర్మ,  జియలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడైన డా||బి.పి.రాధాకృష్ణ (బెంగుళూరు), డా|| విజయమోహన్‌ కుమార్‌ పురీ (లక్నో) భాగస్వాములను చేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌కి సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేసిన డా||ఎస్‌.కళ్యాణరామన్‌ (చెన్నై) తను మన ధన పూర్వకంగా ఈ పనికి అంకితమై పనిచేయడానికి ముందుకు వచ్చారు. విచిత్రమేమంటే 17 సంవత్సరాల క్రిందట సరస్వతీ నదిని వెలికితీయాలనే ప్రేరణ మోరోపంత్‌కి కలిగిన తీరులోనే, కల్యాణరామ్‌గారికి కూడా బలమైన ప్రేరణ లభించింది. ఈ సంస్థ కార్య భారాన్ని ఆయనే ప్రధానంగా వహిస్తున్నారు.

సరస్వతీ కుండ్‌

శివాలిక్‌ పర్వతశ్రేణులు సంవత్సరమంతా కూడా హిమ నదులతో నిండి ఉంటాయి. మంచు కరుగుతూ ప్రవహించుతూ ఉంటుంది. ఆ జల ప్రవాహంలో రాళ్లు కూడా దొర్లుతూ వస్తూ ఉంటాయి. ఏటేటా శతాబ్దాల తరబడి ఇలా దొర్లుకుంటూ వస్తూ ఉన్న రాళ్ల గుట్టలే ప్రవాహ మార్గానికి అడ్డుకట్టగా మారి, ప్రవాహం భూగర్భంలో దారిని వెతుక్కోవటం జరిగింది. కొంత ప్రవాహం యమునా నదిలోకి మళ్లింది. ఈ కారణంగానే ప్రయాగ మూడు నదుల సంగమ స్థానంగా చెప్పబడుతూ ఉంది. భూగర్భంలోని ప్రవాహం సహజంగా దిగిపోయిన కారణంగా, పూర్వపు సరస్వతీ నదీ మార్గంలో అది అదృశ్యమై పోయిందని వైజ్ఞానికులు ఒక అంచనాకు వచ్చారు. కొన్నాళ్ల క్రిందట ఈ సంస్థ ఆధ్వర్యంలో అదిబద్రీలో ఒక పెద్ద కుండాన్ని నిర్మింపజేశారు. దానికి సరస్వతీ కుండమని పేరు పెట్టారు. దానికి సమీపంలోనే పురాతనమైన ఆది బద్రీ మందిరముంది. సరస్వతీ కుండం నుండి భూగర్భంలో ఒక సొరంగ మార్గం ద్వారా నీటి ప్రవాహమార్గం (సరస్వతీ క్రీక్‌) ఏర్పరచాలని అలా ఆ నీటిని సరస్వతీనగర్‌ (ముస్తఫాబాద్‌) వరకు తీసికొని రావాలని సంకల్పించారు.

2001 జనవరి 26న సరస్వతీ క్రీక్‌ను హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా ప్రారంభించారు. హర్యానా గవర్నర్‌ బాబూ పరమానంద్‌, కేంద్ర సాంస్కృతిక పర్యటన శాఖామంత్రి అనంతకుమార్‌, కేంద్ర జలవనరుల శాఖామంత్రి అర్జున్‌సింగ్‌ సేఠీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం పూర్తయినప్పుడు పురాణాలలోని సరస్వతీనది పాతాళం నుండి మరల భూతలం మీదికి వచ్చినట్లవుతుంది. పూర్వపు మార్గంలో ప్రవహిస్తూ ఉంటుంది. దేశంలో నీటి సమస్య ఒక మేరకు పరిష్కారమవుతుంది. 26 జనవరి నాడు జరిగిన సరస్వతీ దర్శన్‌ కార్యక్రమంలో డా||కల్యాణరామన్‌ ”ఈ పథకం ద్వారా సరస్వతీనదిని పునర్జీవింపజేయటం జరుగుతోంది” అని అన్నారు.

పురాణకాలంలో భగీరథుడు నిర్విరామమైన కృషి చేసి, స్వర్గంలో ఉన్న గంగను భువిపై అవతరింపజేశాడు. అందుకని సుదీర్ఘమైన, నిర్విరామ ప్రయత్నాన్ని మనం భగీరథ ప్రయత్నంగా వర్ణిస్తూ ఉంటాం. వర్తమానంలో మోరోపంత్‌జీ కూడా. గత 17 సం||లుగా అటువంటి భగీరథ ప్రయత్నమే చేస్తూ చ్చారు. ఈ ప్రయత్నాల ఫలితంగా విఖ్యాతమైన సరస్వతీ నది కోట్లాది భారతీయులకు కనువిందు చేసే సుదినం ఇప్పుడు ఎంతో దూరంలో లేదు. యుగాబ్ది 5102 వసంత పంచమి (2001 జనవరి 26) మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో వ్రాయదగిన రోజుగా నిలిచిపోతుంది.

దీనితో పాటుగానే చరిత్రలో నమోదు చేసుకోవలసిన మరో విషయమూ ఉంది. 2001 జనవరి 26న సంభవించిన గుజరాత్‌ భూకంపం ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టినా, వాటితోపాటుగానే మానవాళికి మేలు చేకూర్చే చమత్కారాలనూ చేసింది. జనవరి 26 సరస్వతీ క్రీక్‌ పనులకు ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్న సమయంలోనే ఇండియన్‌ స్సేస్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌ (ఇస్రో) వారి ఉపగ్రహం భూకంపానికి గురియైన  ప్రాంతాల ఛాయచిత్రాలను తీసింది. ఆ ఫోటోల ద్వారా కచ్‌బాడవలో 80 మీటర్ల వెడల్పున 100కి.మీ. జలప్రవాహం కఛ్‌లోని మరూద్‌టక్కర్‌ గ్రామం నుండి పాకిస్తాన్‌లోని నబీసర్‌ వరకు ప్రవహిస్తున్నట్లుగా తెలియ వచ్చింది.

అంతకు ముందు జనవరి 4న తీసిన ఫోటోలతో పోల్చి చూసిన శాస్త్రవేత్త పి.ఎస్‌.టక్కర్‌ ఆసక్తిదాయకమైన విషయాలు చెప్పారు. ఇప్పుడు కచ్‌ బాడవలో అసంఖ్యాకమైన భౌగోళిక పరివర్తనలు సంభవించుతూ ఉన్నాయి. ముఖ్యంగా రెండు రకాల మార్పులు. భూగర్భంలో ఉన్న నది భూమి ఉపరితలం మీదకు రావటం జరుగుతోంది. మొత్తం ఆ పరిసరాలను కుదిపివేసిన భూకంపం కారణంగా అనేక నదులు, ఉపనదులు నూతన మార్గాలలో ప్రవహిస్తూ ఉన్నాయి.

భచావు తాలూకాలోని చౌబరీ గ్రామానికి ఉత్తరంగా ఏకలమా మందిరం వరకు, అలాగే భోజరధో, ఉదయ, లఖబా గ్రామాలతో సహా 24 కి.మీ. పొడవున 600 మీ.ల వెడల్పున మోతీబానీ క్షేత్రంలో ఈ నదుల నీరు వ్యాపించుతూ ఉంది. అలాగే మరో జలప్రవాహం కుంవరబెట్‌, పచ్ఛమబెట్‌ల నుండి మొదలుకొని ఖవదా క్షేత్రం వరకు ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు ఉప్పునీరు మాత్రమే ప్రవహించే ఈ ప్రాంతంలో ఇప్పుడు మంచినీటిని అందిస్తున్న ఈ క్రొత్తనదులు ఆనాడు కనుమరుగై పోయిన సరస్వతీలోని ఒక భాగమే అయి ఉండాలి. అలాగే 15వ శతాబ్దంలో అంతర్ధామమైన హక్రానది కూడా సరస్వతీ నది ఉపనదిగా రూపుదాల్చబోతున్న ఆశ్చర్యకరమైన విషయాలు తెలియవచ్చాయి. అతి త్వరలోనే ఆదిబద్రీ నుండి పాకిస్తాన్‌ సరిహద్దు వరకు కూడా భవ్యమైన సరస్వతీ నది ప్రవహిస్తున్న దృశ్యాన్ని చూడగలం. భారతదేశంలోని పశ్చిమభాగంలోని మరుభూమి కూడా సుజల, సస్యపూర్ణ కాగలదు. అపర భగీరథుడైన శ్రీ మోరోపంత్‌జీ కలలు సార్థకం కాగలవు.

– ప.పిపలంకర్‌

(స్ఫూర్తి సౌజన్యం తో)