Home Telugu Articles నిఖా పేరిట ముస్లిం మైనర్ అమ్మాయిల అక్రమ రవాణా

నిఖా పేరిట ముస్లిం మైనర్ అమ్మాయిల అక్రమ రవాణా

0
SHARE

వయసు మీరిన అరబ్‌ షేక్‌లతో ఒప్పంద వివాహాలు జరిపించే అంతర్జాతీయ ముఠా లోగుట్టుమట్లు, వ్యవస్థీకృత నేరగాళ్ల వికృతత్వాన్ని కళ్లకు కడుతున్నాయి. బాల వధువుల విపణిగా పరువు మాసిన పాతబస్తీలో వల వేసి హైదరాబాద్‌ పోలీసులు ఛేదించిన భారీ రాకెట్‌ తాలూకు చీకటి కోణాలు నిర్ఘాంతపరుస్తున్నాయి. నిఖా పేరిట పేదింటి బాలికల్ని పెళ్లాడి, కొన్నాళ్లు ఇక్కడే సంసారం చేసి, ఆపై అరబ్‌ దేశాలకు తరలించి, వారి చేత బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఎనమండుగురు షేక్‌లకు అరదండాలు పడ్డాయి. ముగ్గురు ఖాజీలు, మధ్యవర్తులు సహా మొత్తం ఇరవైమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొందరి కదలికలపైనా నిఘా పెట్టామంటున్నారు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో అడ్డగోలు నిఖాలు జరిపించి, దొంగ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన వివాహ ధ్రువీకరణ పత్రాల్ని ఎడాపెడా జారీచేయడంలో ఆరితేరిన ముంబయి ప్రధాన ఖాజీ ఫరీద్‌ అహ్మద్‌ ఖాన్‌ సైతం పోలీసు చెరలో చిక్కాడు. పేద ముస్లిం తల్లిదండ్రుల్ని ఒప్పించి సంబంధాలు కుదురుస్తున్న దళారుల్లో ఎక్కువ మంది మహిళలే. పాతబస్తీ నుంచి గల్ఫ్‌ దేశాలకు విస్తరించిన వ్యవస్థలో ఎరలువేసే కీలకపాత్రవారిదే. పాతబస్తీలోఏటా వెయ్యికి పైగా నకిలీ నిఖాలు చోటుచేసుకుంటున్నాయని అంచనా. తమకు నచ్చితేనే- అంతవరకు శారీరక అవసరాలు తీర్చిన మైనర్‌ బాలికల్ని, యువతుల్ని వృద్ధవరులు వెంట తీసుకెళ్తున్నారు. పత్రాలపై సక్రమ ప్రయాణంగా పేర్కొన్నా,అది మనుషుల అక్రమ రవాణాగానే లెక్క. అక్కడికి క్షేమంగా చేరి మోజు తీరాక వదిలించుకోవడానికి మార్గాలనేకమని,వెలుగుచూస్తున్నఅభాగినులదీనగాథలు వెల్లడిస్తు న్నాయి. గల్ఫ్‌ చేరాక ఎందరో వ్యభిచార కూపంలో కూరుకుపోతుండటం, ఒప్పంద వివాహాల పైశాచికత్వాన్ని ప్రస్ఫుటీకరిస్తోంది!

సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం హైదరాబాద్‌ నుంచి వృద్ధ దుబాయ్‌ షేక్‌ భార్యగా తరలి వెళ్తూ యాదృచ్ఛికంగా విమాన సిబ్బంది కంటపడిన పదకొండేళ్ల అమీనా ఉదంతం ఎందరినో కదిలించింది. ఆనాడు ఆ బాల వధువుకు జరిగిన అన్యాయాన్ని మత పెద్దలు, ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులు సైతం తీవ్రంగా ఖండించారు. అమీనా లాగా చెర తప్పించుకోలేని ఎందరో మైనర్‌ బాలికలు, నిస్సహాయ యువతులు ఇప్పటికీ గల్ఫ్‌ సంపన్న కాంతులకు శలభాలవుతూనే ఉన్నారు. ఒమన్‌ షేక్‌తో నిఖా దరిమిలా అక్కడికి వెళ్ళి అతగాడి బంధువుల లైంగిక దాడికి గురై ఫోన్‌లో కుటుంబీకులకు ఉప్పందించిన రుక్సా దీనావస్థే- తాజా పోలీసు వేటను ప్రేరేపించింది. అక్రమ పెళ్ళిళ్ల దందాను రచ్చకీడ్చే యత్నంలో, పదుల కొద్దీ పేర్లు బయటకొస్తున్నాయి! తొమ్మిదో దశకంలో ప్రధానంగా ఒమన్‌, సౌదీ అరేబియా, యూఏఈలకు చెందిన సంపన్న అరబ్బులే పాతబస్తీకి పెళ్ళి యాత్ర తలపెట్టేవారు. అనంతర కాలంలో సోమాలియన్లు, నైజీరియన్లు సైతం ఇక్కడికి బారులు తీరుతున్నారు. కోరుకున్న పిల్ల కోసం హోటల్‌ గదుల్లో ఇంటర్వ్యూలు జరిపి ఎంత వెచ్చించడానికైనా షేక్‌లు సంసిద్ధం కావడంతోనే, దళారుల పిలుపందుకొని ఖాజీలు రంగప్రవేశం చేస్తున్నారు! అమీనా ఉదంతం వెలుగు చూశాక, విదేశీయులతో వివాహ సమాచారాన్ని ఖాజీలు రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుకు విధిగా తెలియజేయాల్సిందిగా 1993లో రాష్ట్రప్రభుత్వం నిర్దేశించింది. రెండేళ్లకే దానిపై ‘స్టే’ మంజూరయ్యాక, పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఖాజీపై తప్పుడు వివాహాలు జరిపించినట్లు ఆరోపణలు రుజువైనా కఠిన శిక్ష విధించే అవకాశం లేకపోవడం వల్ల నకిలీ నిఖానామాలు, ఫోర్జరీ ధ్రువపత్రాలు జోరెత్తుతున్నాయి. ఆ కంతలు సత్వరం పూడిస్తేనే షేక్‌లు, బ్రోకర్లు, ఖాజీల ఉమ్మడి ఆగడాల నియంత్రణకు బాట పడేది!

సిరియా శరణార్థ బాలికల్లో సగంమందికి పైగా పద్దెనిమిదేళ్ల లోపే పెళ్ళిళ్లయిపోతున్నాయి. ఆ దృష్ట్యా, రకరకాల సంక్షోభాల కారణంగా వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్తున్న కుటుంబాల్లోనే బాల్య వివాహాలు అధికమని తీర్మానించే వీల్లేదు. ఇటీవలి భారత జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే, దేశంలో 47 శాతం బాలికలు పద్దెనిమిదేళ్లు నిండకుండానే వధువులవుతున్నట్లు ధ్రువీకరించింది! బిహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ్‌ బంగ ప్రభృత రాష్ట్రాల్లో బాల్యం ఎలా ఛిద్రమవుతోందో మానవ అక్రమరవాణాపై ఇటీవలి గణాంకాలూ చాటుతున్నాయి. మైనర్‌ పిల్లల లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికమేనంటున్న ‘నోబెల్‌’ గ్రహీత కైలాస్‌ సత్యార్థి చెప్పినట్లు- ఈ అవ్యవస్థపై యుద్ధంలో ప్రభుత్వాలు, ప్రజాసమూహాలు గెలుపొందాలి! మనవరాలి వయసున్న బాలికల్ని కాంట్రాక్ట్‌ పద్ధతిలో పెళ్ళాడి, వేధింపులకు చిత్రహింసలకు గురిచేసే అరబ్బుల దాష్టీకాలకు తెరదించేందుకంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ ప్రతిపాదిస్తోంది. అరబ్‌ షేక్‌లతో వివాహాల్లో మోసాలు అరికట్టి, వధువులకు న్యాయపరమైన రక్షణ కల్పించే ప్రతిపాదనలతో త్వరలోనే అది పట్టాలకు ఎక్కనుందంటున్నారు. నిబంధనలు కూర్చి శాసనాలు వండివార్చడంతోనే సమస్యల పరిష్కరణ సాధ్యపడదు. పర్యాటక వీసాపై వచ్చే అన్య దేశస్థులు ఇక్కడి అమ్మాయిల్ని వివాహమాడేందుకు ముందుగా విదేశీ మంత్రిత్వ కార్యాలయం, రాయబార కార్యాలయాల అనుమతి పొందడాన్ని తప్పనిసరి చేస్తామంటున్నారు. షేక్‌ల ఒప్పంద వివాహాల నియంత్రణలో మైనారిటీ శాఖ చిత్తశుద్ధితో వ్యవహరించాలి. గాడి తప్పిన ఖాజీలపై తక్షణ కఠిన చర్యలు చేపట్టాలి. పేదరికం, నిరక్షరాస్యతల భల్లూకం పట్టులో చిక్కిన కుటుంబాల నిస్సహాయతను పరిమార్చి, సొంత కాళ్లపై నిలదొక్కుకునేలా ‘బేటీ బచావో-బేటీ పఢావో’ తరహా పథకాలను ప్రభుత్వాలు చురుగ్గా అమలు పరచాలి. మానవీయ దృక్పథంతో సమర్థ బహుముఖ కార్యాచరణే- నిఖా పేరిట కన్నపేగును తనఖా పెట్టాల్సిన దౌర్భాగ్యానికి విరుగుడు కాగలిగేది!

(ఈనాడు సౌజన్యం తో)