Home News ‘సుప్రీం కోర్ట్’ వెబ్‌సైట్‌లో కొలీజియం నిర్ణయాలు, ఇకపై న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతుల వివరాలు ఆన్...

‘సుప్రీం కోర్ట్’ వెబ్‌సైట్‌లో కొలీజియం నిర్ణయాలు, ఇకపై న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతుల వివరాలు ఆన్ లైన్ లో లభ్యం

0
SHARE
  • బదిలీల సమాచారం వెబ్‌సైట్‌లో నమోదు
  • చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కొలీజియం
  • పారదర్శకత సాధనకేనని వెల్లడి

సుప్రీంకోర్టు కొలీజియం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొలీజియం వ్యవహారాల్లో పారదర్శకతను సాధించాలనే లక్ష్యంలో భాగంగా తాము తీసుకునే నిర్ణయాలను ఇకపై సర్వోన్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యాయమూర్తుల పదోన్నతులు, బదిలీలు తదితర అంశాలు వెబ్‌సైట్‌కు ఎక్కనున్నాయి. న్యాయ నియామకాలు, బదిలీలు, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు పదోన్నతులపై సిఫార్సులు, తిరస్కరణలకు సంబంధించిన కారణాల్నీ పేర్కొంటారు. ముందుగా మద్రాస్‌ హైకోర్టు, కేరళ హైకోర్టులకు సంబంధించిన నియామకాల వివరాల్ని ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. కొలీజియం సమావేశ మినిట్స్‌ను కూడా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం వల్ల నిర్ణయాల్లో పారదర్శకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత’ పేరుతో ఉన్న పత్రంపై కొలీజియంలోని ఐదుగురు సభ్యులూ సంతకం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర నేతృత్వంలో జస్టిస్‌ జె.చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌గొగోయి, జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ కొలీజియం సభ్యులుగా ఉన్నారు. ఇకమీదట కొలీజియం తీసుకునే నిర్ణయాలు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో నమోదు చేయడం జరుగుతుందనీ, హైకోర్టు ధర్మాసనానికి ప్రాథమిక పదోన్నతి, హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా నిర్ధరణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు, సుప్రీకోర్టుకు పదోన్నతి కల్పించేటప్పుడు ప్రభుత్వానికి పంపించే సదరు సమాచారాన్ని వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని నిర్ణయించినట్లు కొలీజియం తీర్మానం పేర్కొంది. కొలీజియం వ్యవస్థలో పారదర్శకత సాధనతోపాటు, నిగూఢతను కొనసాగించాలని తీర్మానం ఆమోదించినట్లు వివరించింది. అక్టోబర్‌ 3న తీర్మానాన్ని ఆమోదించారు. తొలిగా నమోదు చేసిన తీర్మానంలో కేరళ హైకోర్టు న్యాయమూర్తులుగా అశోక్‌ మెనన్‌, అన్నీ జాన్‌, నారాయణ పిశారదిల నియామకానికి సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు. 2017, ఫిబ్రవరి 2న కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సీనియర్‌ సహచరులతో సంప్రదింపులు జరిపి.. తమ హైకోర్టుకు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయాధికారులకు పదోన్నతి కల్పిస్తూ చేసిన సిఫార్సుల వివరాలను తీర్మానం వెల్లడించింది. సదరు పేర్లపై కేరళ గవర్నర్‌, ముఖ్యమంత్రి తమ సమ్మతి వ్యక్తం చేసినట్లు వివరించింది. అదేవిధంగా ఎస్‌.రామతిలగం, ఆర్‌.థరణి, పి.రాజమాణికంలను మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం జరిపేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. టి.కృష్ణవల్లి, ఆర్‌.పొంగియప్పన్‌, ఆర్‌.హేమలతలను మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. కేరళకు సంబంధించి ముగ్గురి పేర్లకు ఆమోదం తెలిపిన కొలీజియం..హైకోర్టు కొలీజియం నుంచిగానీ, నిఘా విభాగం నివేదికల నుంచిగానీ వారిపై ప్రతికూలతలేమీ గుర్తించలేదని పేర్కొంది. మద్రాస్‌ హైకోర్టు నియామకాల విషయంలో.. పది పేర్లను సిఫార్సు చేయగా, ఆరుగురి పేర్లు హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి కొలీజియం విధివిధానాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది.

నేపథ్యం ఏమిటి?

మనుగడలోకి వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత కొలీజియం వ్యవస్థలో భారీ నిర్ణయం జరిగింది. న్యాయనియామకాల కోసం సిఫార్సులు చేసేటప్పుడు నిగూఢత పాటించడంపై పలు విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయంత్‌పటేల్‌ను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయగా ఆయన రాజీనామా అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడటం గమనార్హం. కొలీజియం నిగూఢంగా నిర్ణయాలు తీసుకోవడంపై సీనియర్‌ న్యాయవాదులు, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌, గుజరాత్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా విమర్శించాయి. కొలీజియం వ్యవస్థ పనితీరుపై జస్టిస్‌ చలమేశ్వర్‌ రూపంలో కొలీజియంలో తొలిసారిగా అంతర్గతంగానే విమర్శలు తలెత్తాయి. అత్యున్నత స్థాయి రాజ్యాంగ న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల తీరులో పారదర్శకత లేకపోవడంపై ఎన్‌జేఏసీ కేసులో జస్టిస్‌ చలమేశ్వర్‌ తప్పుపట్టారు. గతంలో ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ టీఎస్‌ ఠాకుర్‌, జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ల హయాంలో నిర్ణయం రాకపోగా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్ర కొలీజియంలో మార్పులకు ముందు నిలిచినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కొలీజియం సిఫార్సుల కారణాలను వెబ్‌సైట్‌లో ఉంచాలన్న జస్టిస్‌ మిశ్ర ప్రతిపాదనకు న్యాయవర్గాల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. సీనియర్‌ న్యాయవాదులు, ప్రస్తుత న్యాయమూర్తులు, న్యాయాధికారుల పేర్లను సిఫార్సు చేసినప్పుడు.. వారిపేర్లకు తిరస్కరణ ఎదురైతే తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్లు సమాచారం.

(ఈనాడు సౌజన్యం తో)