కేరళలో 1246 దేవాలయాల పాలనా సంస్థ ‘ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్’ ఇటీవల ఐదుగురు దళితులను పూజారులుగా నియమించింది. 22ఏళ్ళ పి.ఆర్. యదుకృష్ణ వారిలో ఒకరు. ఈ యువకుడు పట్టణంతిట్ట జిల్లా తిరువళ్ళలోని మణప్పురం మహదేవ ఆలయంలో అర్చకుడిగా చేరారు. దక్షిణ భారతదేశంలో సంగం యుగం అనంతరం దళితులు దేవాలయ పూజారులుగా నియమితులు కావడం ఇదే మొదటిసారి. దినసరి వేతనకూలీల కుటుంబంలో జన్మించిన యదుకృష్ణ ఆలయ పూజారిగా ఎదిగిన క్రమం ఆయన మాటల్లో…
పది సంవత్సరాల క్రితం, నేను పన్నెండేళ్ళ వయస్సులో వున్నప్పుడు, పౌరోహిత్యంలో శిక్షణకు నన్ను మదప్లాతూరుత్తులోని ‘శ్రీ గురుదేవ వైదిక తంత్ర విద్యాపీఠం’కు తీసుకువచ్చారు. ఇక్కడ బ్రహ్మశ్రీ కె.కె. అనిరుద్ధన్ తంత్రి నాకు దీక్ష ఇచ్చారు. ఆయన గురుత్వంలో నేను క్రమశిక్షణాయుత జీవనశైలిని అలవర్చుకొంటూ సంస్కృతం, పౌరోహిత్య ఆచారాలను బోధించే గ్రంధాలను చదవడం ప్రారంభించాను. ఈ అంశాలలో మాకు ఒక నిర్దిష్ట పాఠ్యప్రణాళిక వుండేది. నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు మా టీచర్ ఫొన్సి మిస్ ఒకసారి మమ్ములను, పెద్దయిన తరువాత మీరు ఏమి కాదలచుకున్నారని అడిగింది. పూజారిని అవదలచుకున్నానని నేను సమాధానమిచ్చాను.
నా ఆకాంక్షను ఇతరులకు చెప్పడం అదే మొదటిసారి. నా జీవిత ఆశయాన్ని, మా టీచర్ తరగతిలోని అందరికీ గట్టిగా వినబడేట్టు చెప్పింది. ప్రతి ఒక్కరూ ఆసక్తి, కుతూహలం ప్రదర్శించారే తప్ప ఏ ఒక్కరూ నవ్వలేదు, ఎగతాళి చేయలేదు. నిజానికి నాకు ఈ విషయంలో ఎంతో ప్రోత్సాహం లభించింది. మన సమాజంలోని సాంప్రదాయాల ప్రకారం బ్రాహ్మణులు మాత్రమే అర్చకులు అవుతారు. పూజారి కావడానికి సంవత్సరాల తరబడి కఠినమైన శిక్షణ, శ్రద్ధాయుత అధ్యయనం చేయవలసివున్నది. నేను నా జీవిత పర్యంతం నేర్చుకోవడాన్ని కొనసాగిస్తాను.
తొలుత నేను వారాంతపు తరగతులకు మాత్రమే హాజరయ్యేవాణ్ణి. ఎందుకంటే అప్పట్లో నేను మా స్వగ్రామం చలకుడీకి సమీపంలో వున్న పిఎస్‌హెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవాణ్ణి. సాధారణ విద్యాభ్యాసం చేస్తుండేవాణ్ణి. పదవ తరగతిలో వుండగా నేను వైదిక తంత్ర విద్యాపీఠానికి వచ్చేసాను. అక్కడే నా బస కూడా. ప్రతిరోజూ తెల్లవారుజామున, సాయంత్రం, వారాంతంలోనూ పౌరోహిత్య విద్యను నేర్చుకునేవాణ్ణి. ప్రతిరోజూ పగలంతా అక్కడికి దగ్గరలో కొడంగల్లూర్‌లోని సాధారణ పాఠశాలకు వెళ్ళి చదవుకునే వాణ్ణి. కొడంగల్లూర్ విద్వత్ పీఠంలోనే నేను సంస్కృత భాషా సాహిత్యాలలో బి.ఏ. చేశాను. ఇప్పుడు ఎమ్. ఏ. చేస్తున్నాను.
నిజానికి, నాకు ఐదారేళ్ళ వయసులోనే దేవాలయాలతో అనుబంధం మొదలయింది. స్నేహితులతో కలిసి, మా ఇంటికి దగ్గరలో వున్న ధర్మశాల భద్రకాళి ఆలయానికి వెళుతుండేవాణ్ణి. ఆ గుడిలో, సునీల్ షాంతి (పూజారి) మేమంతా వివిధ పనులలో సహకరిస్తుండేవాళ్ళం. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా వుంచడం, పూజకు పూలు తీసుకురావడం మొదలైన పనులను నేను నిష్ఠగా చేస్తుండే వాణ్ణి. మా నాన్న రవి, అమ్మ లీల తాపీ కార్మికులు. ఆ పని లేనప్పుడు దినసరి కూలీలుగా వ్యవసాయ పనులకు వెళ్ళుతుండేవారు. నాన్న ఇప్పటికీ ఆ పనికి పోతారు. నాకు ఒక సోదరుడు వున్నాడు.
నేను రోజూ ఆలయానికి వెళ్ళుతుండడం మా అమ్మకు బాగా నచ్చింది. చాలా సంతోషించేది. ఎందుకంటే అలా ఒక పవిత్రపనిలో నిమగ్నమయి వుండడం వల్ల నేను ఎటువంటి సమస్యల బారినా పడనని లేదా సమస్యలను సృష్టించనని ఆమె నమ్మకం. నేను చాలా అల్లరి పిల్లవాణ్ణి. చెట్లు ఎక్కడం, మర్రి చెట్టు చిటారుకొమ్మకు వెళ్ళడం నాకు ఇష్టమైన అలవాటు. కాలువలో ఈతలకు వెళ్ళుతుండేవాళ్ళం. చీకూ చింత లేని ఆ రోజులను ఎలా మరచిపోగలను? నేను ఒక దీపావళి పర్వదిన వేడుకల సందర్భంగా ఆలయం సమీపంలో పేలకుండా వుండిపోయిన టపాసుతో ఆడుకుంటుండగా అది హఠాత్తుగా పేలడంతో నా చేతులు కాలాయి. ఇది చూసి అమ్మతో పాటు సునీల్ షాంతి కూడా నన్ను గట్టిగా మందలించారు.
తెలిసీ తెలియని ఆ చిన్నతనంలో కుక్కల మీద, కోళ్ళ మీద అదే పనిగా రాళ్ళు విసురుతుండేవాళ్ళం. ఈ జీవ హింస గురించి నేను ఇప్పటికీ చాలా విచారపడుతుంటాను. నేను ఎప్పుడూ ఎటువంటి వివక్షకు గురికాలేదు. దళితులను దేవాలయాలలోకి అడుగపెట్టనివ్వరన్న విషయం గురించి నాకు చిన్నతనంలో తెలియదు. పదేళ్ళ వయసులో వుండగా ఎవరో దీని గురించి నాకు నాకు చెప్పారు. అదేమిటి? అలా ఎలా జరుగుతుంది? నేను అలా జరగనివ్వబోనని గట్టిగా సమాధానమిచ్చినట్టు ఇప్పటికీ బాగా గుర్తు.
విద్యాపీఠంలో ఒకసారి సాబు షాంతి అనే గురువర్యుడు ‘భగవంతుడిని ఎక్కడ చూశావు?’ అని ప్రశ్నించారు. ‘నా గురువుల్లో దేవుణ్ణి చూస్తున్నా’నని నేను సమాధానమిచ్చాను. నా సమాధానం ఆయనకు బాగా సంతృప్తినిచ్చింది. రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు ముందే బ్రాహ్మీ ముహూర్తంలో దైవప్రార్థన చేసేవాణ్ణి. నా మంచంపై కూర్చుని శరీరం, ఆత్మ రెండిటినీ వేద మంత్రాలతో ఆమంత్రించేవాణ్ణి. ఇది పూర్తయిన తరువాత భూమాతకు క్షమాపణచెప్పి నేలపై అడుగుపెట్టేవాణ్ణి.
ఒకసారి మంత్రపఠన పరీక్షలో నేను మా తరగతిలోనే ప్రపథమస్థానంలో నిలవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్నీ, ఏదో అనిర్వచనీయమైన ఆనందానుభూతిని కలిగించింది. మేము మా శిక్షణను పరిపూర్ణంగా పొందిన తరువాత మాత్రమే మమ్ములను గర్భగుడిలోకి అనుమతిస్తామని మా గురువుగారు చెప్పారు. అప్పటివరకు మా విధి సీనియర్ పూజారులకు సహకరించడమే. నిర్దిష్ట వేద మంత్రాలను 51 లక్షల సార్లు ఉచ్ఛరించమని మా గురువు గారు ఆదేశించారు. పౌరోహిత్య పాఠశాలలో నేను మొత్తం పది సంవత్పరాలు గడిపాను. పూజారిగా గురువుగారి ఆమోదం పొందడానికి నాకు మూడేళ్ళు పట్టింది.
మా గురువుగారు యళవ కులస్తులు. పూజారిగా తొలినాళ్ళలో తాను ఎన్ని బాధలు పడిందీ మాకు చెప్పారు. తొలుత ఏ దేవాలయంలోనూ పూజాదికాలు నిర్వహించడానికి ఆయన్ని అనుమతించలేదట. తన గురువర్యులు వెంకిటరామన్ స్వామి సహకారంతో ఆయన ఈ అవరోధాలు, ఆటంకాలను అధిగమించగలిగారు. పాలక్కాడ్ సమూహమఠానికి చెందిన ముగ్గురు బ్రాహ్మణులు మా గురువు గారిని ప్రభావితం చేశారు. ఆయన వ్యక్తిత్వాన్ని సమున్నతంగా తీర్చిదిద్దారు.
కులాంతరాలను ఏ మాత్రం పాటించని విజ్ఞులు, ద్రష్టలు అయిన గురువర్యుల నుంచి మేమందరమూ స్ఫూర్తి పొందాము. మా గురువుగారు కేరళ వ్యాప్తంగా ఉన్న 60 దేవాలయాలకు ప్రధానపూజారి. విద్యా పీఠంలోని నా సహపాఠులు నన్ను తమ సోదరుడుగా ఆదరించారు. గత ఏడాది మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో కష్టాలుపడింది. మరింత మెరుగైన ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగమేదైనా చూసుకుంటే బాగుంటుందేమోనని కూడా నేను ఆలోచించాను. అయితే నా తల్లిదండ్రులు పూజారిగా కొనసాగమన్నారు. నా స్నేహితులే నన్ను ఆర్థికంగా ఆదుకున్నారు.
వలియకులంగార భగవతీ క్షేత్రంలో నేను పూజారిగా సేవలందిస్తున్న తరుణంలోనే పూజారుల నియామకానికి పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ప్రకటన వెలువడింది. నా గురువర్యులు, స్నేహితులూ ఆ పరీక్షకు హాజరుకమ్మని నన్ను ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతోనే ఆ పరీక్ష రాశాను. ప్రధాన అభ్యర్థుల జాబితాలో 42వ స్థానంలో వున్నాను. సామాజిక వర్గాల ప్రాతిపదికన రూపొందించిన జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచాను. నేను ఆనందభరితుడినయ్యాను. మదప్లాతూరుత్తులోనే నేను ఈ బాధ్యతలు నిర్వహిస్తే చూడాలన్నది అమ్మ కోరిక.
మరో విషయం ఏమంటే, నేను 2012లోనే ఫేస్‌బుక్ ఎకౌంట్ తెరిచినా, ప్రభుత్వం కేటాయించిన లాప్‌టాప్ అందిన తరువాతే దానిని చూడడం ప్రారంభించాను. నాకు 250 మంది ఫేస్‌బుక్ స్నేహితులు వున్నారు. నేను నా ప్రొఫైల్ పిక్‌ను మార్చినప్పుడు కేవలం 11 లైక్‌లు మాత్రమే వచ్చాయి. ఎంతో నిరాశ కలిగింది. ఇప్పుడు నా స్నేహితుడు ఒకరు నా ఫోటోను తన గ్రూప్‌లో పోస్టు చేయగానే 3200 లైక్‌లు వచ్చాయి. ఈ వింతను అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే వున్నాను.
(ఆంధ్రజ్య్తోతి సౌజన్యం తో)