Home News మహిళల సారథ్యంలో సేంద్రియ సాగు

మహిళల సారథ్యంలో సేంద్రియ సాగు

0
SHARE
  • 25 మంది మహిళా రైతులు కలిసి క్లస్టర్‌గా ఏర్పాటు
  • రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులే లక్ష్యం
  • వివిధ దేశాలకు ఎగుమతి

ఒక్కటయ్యారు.. అనుకున్నది సాధించారు! శ్రమ తప్ప పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవు.. తరతరాల నుంచి చేస్తున్న పూర్వ వ్యవసాయ పద్ధతులను ఆకలింపు చేసుకున్నారు. సమస్యలను అధిగమించేందుకు సంఘటితమై ఆదర్శ సేంద్రియ మహిళా వ్యవసాయ పరస్పర సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా తమకు చెందిన 110 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వరి, కంది, చిరుధాన్యాలు పండిస్తున్నారు. వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు యదాద్రి జిల్లా మోటకొండూరులోని ఆదర్శ సేంద్రియ మహిళా వ్యవసాయ పరస్పర సహకార సంఘం మహిళలు.

కాలానుగుణంగా వ్యవసాయంలో అనేక మార్పులొచ్చా యి. పూర్వ పద్ధతులు పూర్తిగా కనుమరుగయ్యాయి. సేం ద్రియ ఎరువుల స్థానంలో రసాయన ఎరువుల వినియో గం పెరిగింది. యంత్రాల రాకతో పెట్టుబడులు పెరిగాయి. తీరా పంట చేతికొచ్చాక పెట్టిన పెట్టుబడులకు వచ్చిన దిగుబడులకు పొంతన కుదరకపోవడంతో అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని శ్రమే పెట్టుబడిగా సేంద్రియ ఎరువులు వాడుతూ వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలన్న సంకల్పంతో రంగంలోకి దిగారు మోటకొండూరులోని కొంత మంది మహిళలు.

సహకార సంఘం ఏర్పాటు: వ్యవసాయం చేయాలంటే ఎన్నో సమస్యలు. ప్రస్తుతం పంటలు పండించాలంటే పెట్టుబడులు పెట్టాలి. తెగుళ్ల నివారణకు పురుగు మందులు చల్లాలి. అంత ఖర్చు చేస్తే లాభాలు వస్తాయా అంటే చెప్పలేని పరిస్థితి. ఇది గమనించిన స్థానిక మహిళా రైతులు వ్యవసాయంలో మార్పులు తేవాలనుకున్నారు. పెట్టుబడి లేకుండా పాత పద్ధతిలో పంటల సాగు చేపట్టాలని కంకణం కట్టుకున్నారు. 25 మంది మహిళలు ఒక్కటై ఆదర్శ సేంద్రియ మహిళా వ్యవసాయ పరస్పర సహకార సంఘం ఏర్పాటు చేసుకున్నారు. నెలనెలా రూ.100లు పొదుపు చేసుకొని మొత్తం 110 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. విత్తనం, మార్కెటింగ్ సమస్యను అధిగమిస్తూ లాభాలు గడిస్తున్నారు. అంతేగాక రకరకాల సమస్యల్లో చిక్కుకున్న రైతన్నల దుస్థితిని గమనించి.. వాటిని ఎలా అధిగమించాలో ఎన్‌పీఎం(నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్) చక్రం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఎన్‌ఐఆర్‌డీ, ఇండీవ్ స్వచ్ఛంద సం స్థలు ఇస్తున్న శిక్షణ పొందిన ఈ సంఘం మహిళలు సేంద్రియ ఎరువుల వాడకంతో నూతన ఒరవడులను సృష్టిస్తున్నారు. ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పు దినుసుల పిండితో సేంద్రియ ఎరువును తయారుచేసి వాడుతున్నారు. పంటలకు ఆశిస్తున్న తెగుళ్లు, పురుగులను నాశనం చేసేందుకు ముందుగా వాటి జీవిత చక్రాన్ని అవగతం చేసుకుంటున్నారు. సహజసిద్ధంగా వాటి భరతం పడుతున్నారు. అంతేకాక విత్తనాల నిల్వలోనూ పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. స్వచ్ఛమైన విత్తనాలను సేకరిస్తూ వాటిని కుండల్లో భద్రపరుస్తున్నారు.

రసాయన అవశేషాలు లేని ఉత్పత్తులు: సహకార సంఘం ఏర్పాటు చేసుకొని సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటలన్నీ సహజసిద్ధంగా ఉండేలా చూస్తున్నారు. మార్కెట్‌లో గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా అమ్ముడుపోయేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా తమ సంఘం పండించే పప్పుదినుసులను పప్పుగా మారుస్తున్నారు. ఇందుకోసం ఏకంగా దాతల సహకారంతో సుభద్ర ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేసి ఓ పప్పు మిల్ కేంద్రాన్ని నెలకొల్పారు. వీరి ఉత్పత్తులను ఐఐఎంఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్)రాజేంద్రనగర్, సహజ సమృద్ధి సంఘం బెంగళూర్, సం జీవని ఆర్గానిక్ డెహ్రడూన్ సంస్థలు కొనుగోలు చేస్తున్నా రు. మరో 20 దేశాలకు ఎగుమతులూ చేస్తున్నారు. ఇప్పటికే వీరి సేంద్రియ వ్యవసాయాన్ని గుర్తించిన నాబార్డ్ రూ.2 లక్షలతో జిల్లా కేంద్రంలో స్టాల్‌ను ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నది.

ఎన్నో ప్రశంసలు:

సంఘటితమై సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఈ మహిళలను ఎందరో ప్రశంసిస్తున్నారు. ఎన్‌ఐఆర్డీ ఆధ్వర్యంలో జాతీయ సేంద్రియ వ్యవసాయంపై ఇస్తున్న శిక్షణ తరగతులకు హాజరైన వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రజ్ఞులు దాల్‌మిల్, మహిళా సంఘాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా వీరు చేస్తున్న సేంద్రియ వ్యవసాయాన్ని చూసి ముగ్దులవుతున్నారు. పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయడమే కాకుండా పండించిన పంటలకు విలువ పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబిస్తున్నారు. ప్రస్తుతం కేవలం దాల్ మిల్ మాత్రమే ఉండగా.. భవిష్యత్‌లో మినీ రైస్‌మిల్, ఆయిల్ మిల్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు ఆదర్శ సేంద్రియ మహిళా వ్యవసాయ పరస్పర సహకార సంఘం మహిళలు.

25 మంది కలిసి సంఘం ఏర్పాటు చేశాం

రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి తీవ్రంగా నష్టపోయాం. దీంతో 25 మంది కలిసి సంఘంగా ఏర్పాటై సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నాం. నెలనెలా రూ.100 పొదుపు చేస్తూ పెట్టుబడుల కోసం వినియోగిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న దాల్ మిల్‌తో పాటు రైస్‌మిల్, నూనె మిల్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. ఈ సంఘం సేవలు మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తున్నాం.

గంగాపురం సబిత, అధ్యక్షురాలు, ఆదర్శ సేంద్రియ మహిళా వ్యవసాయ పరస్పర సహకార సంఘం అధ్యక్షురాలు

పెట్టుబడులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం..

గతంలో వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి లేక అప్పులు చేయాల్సి వచ్చేది. సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత సమస్యలు తీరిపోయాయి. సేంద్రియ సాగు ఎంతో బాగుంది. వ్యవసాయ ఉత్పత్తులు నాణ్యంగా ఉంటుండంతో లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం.

ఎగ్గిడి విజయ, సంఘం సభ్యురాలు

సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నాం

రసాయన ఎరువులు వాడుతూ చాలా మంది రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఉత్పత్తులు స్వచ్ఛంగా ఉండటంతో పాటు మార్కెట్‌లో అధికంగా ధర పలుకుతున్నాయి. సహజ సిద్ధమైన ఎరువులు, రైతులు పండించిన పంటకు విలువ పెంచడమే ఈ సంఘం ముఖ్య ఉద్దేశం.

పీసరి తిరుమల్‌రెడ్డి, ఫౌండర్

జహంగీర్, మోటకొండూర్, 9848069992

(నమస్తే తెలంగాణా సౌజన్యం తో)