అది రాజ్యాంగ నిర్దేశమే…
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని రాజ్యాంగంలోని 44వ అధికరణ నిర్దేశిస్తోంది. దాన్ని శిరసా వహిస్తూ ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకొంది. మతాలకు అతీతంగా దానిమీద స్పందన తెలియజేయవలసిందిగా పౌరులందరినీ కోరుతోంది. దుర్బల వర్గాలపట్ల విచక్షణను అంతమొందించడంతోపాటు విభిన్న సంప్రదాయాలను ఒకే మాలలో పువ్వులుగా గుదిగుచ్చే ప్రయత్నాల్లో భాగంగా లా కమిషన్ ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకొంది. ఉమ్మడి పౌరస్మృతి సాధ్యాసాధ్యాలు, ఆచరణ యోగ్యతల మీద ఆరోగ్యదాయకమైన చర్చ జరగాలని అది కోరుతోంది. అన్ని మతాలకు చెందిన కుటుంబ చట్టాలను పరిశీలించడం, సామాజిక దురన్యాయాన్ని రూపుమాపడం ఈ కసరత్తు లక్ష్యం. ప్రజాతంత్ర భారతదేశ పౌరులెవరైనా దీన్ని ఎలా కాదంటారు, ఏ విధంగా వ్యతిరేకిస్తారు, అసలు వారికున్న అభ్యంతరమేమిటి?
అహేతుక ఆరోపణలు
మతస్వేచ్ఛ ముసుగులో ముస్లిం మహిళల రాజ్యాంగబద్ధ హక్కులను అడ్డుకోజూస్తున్న కొందరు ముస్లిం మతపెద్దలు, లా కమిషన్ ప్రయత్నాలపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిములను లక్ష్యంగా చేసుకొంటున్నారంటూ లా కమిషన్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. లా కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచీ చేస్తున్న కృషిని నిశితంగా పరిశీలించినప్పుడు ఆ విమర్శలు, ఆరోపణలు అర్థంపర్థం లేనివని స్పష్టమవుతుంది. ముస్లిం వైయక్తిక చట్టం గురించి పెద్దగా చర్చే జరపని కమిషన్- హిందూ, క్రైస్తవ మత చట్టాలను దశాబ్దాలుగా పరిశీలిస్తూనే ఉంది. వాటిమీద తన అభిప్రాయాలు తెలియజేస్తూనే ఉంది. ఈ తరహా అలజడి వెనక ఒక వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. దాని ప్రకారమే అంతా జరుగుతోందని అనిపిస్తోంది. హిందువులు, క్రైస్తవులు తదితరుల మత వ్యవహారాల్లో దేశంలోని ప్రతి సంస్థా, వ్యవస్థా జోక్యం చేసుకోవచ్చు కానీ- ముస్లిములు మాత్రం దీనంతటికీ అతీతులు అని కొద్దిమంది ముస్లిం మతపెద్దలు, వారికి వంతపాడుతున్న కుహనా లౌకికవాదులు భావిస్తున్నారు. ప్రజాప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రార్థన స్థలాల తరలింపు వంటి చర్యలు చేపట్టినప్పుడూ ఇదే ధోరణి ద్యోతకమవుతోంది. ఇలాంటి వ్యవహారాల్లో కొందరు ముస్లిం మతపెద్దల వైఖరి మత సామరస్యాన్ని దెబ్బతీసేదిగా ఉంది. ముస్లిం మహిళలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులకూ వారి కారణంగా దిక్కులేకుండాపోతోంది. షాయరా బానో వంటి ముస్లిం మహిళలు, పలు ముస్లిం మహిళల బృందాలు తమ హక్కులకోసం బహిరంగంగా వీధుల్లోకి రావడం ఈ సందర్భంగా హర్షణీయం. లా కమిషన్ ఈ కసరత్తును ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టిందన్నది కాదు, రాజ్యాంగం అమలులోకి వచ్చి 66 ఏళ్లు గడిచాక కూడా మౌలిక హక్కులు లేకుండా ముస్లిం మహిళలు మగ్గిపోతున్నప్పటికీ, ఈ కీలక జాతీయ కమిషన్ ఇప్పటివరకు ఎందుకు చూస్తూ వూరుకొందన్నదే అసలు ప్రశ్న.
కమిషన్ ముస్లిములనే లక్ష్యంగా చేసుకుంటోందంటూ దుష్ప్రచారం చేస్తున్నవారు, వాస్తవాలేమిటో తెలుసుకోవాలి. హిందూ ఆచార వ్యవహారాలు, చట్ట సంబంధ విషయాల్లో ఎన్నోమార్లు అది జోక్యం చేసుకొన్న సంగతి మరవరాదు. కమిషన్ 59వ నివేదికలో హిందూ వైవాహిక చట్టం, 1955; ప్రత్యేక వైవాహిక చట్టం, 1954లకు సవరణల గురించి ప్రస్తావించారు. కమిషన్ 71వ నివేదికలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వివాహ బంధం తిరిగి అతికించలేనంతగా విచ్ఛిన్నమైపోతే విడాకులు తీసుకోవచ్చునని ఈ సందర్భంగా కమిషన్ అభిప్రాయపడింది. విడాకుల సందర్భంగా భార్యకు న్యాయస్థానం మంజూరుచేసే మనోవర్తిని చెల్లించని భర్త నేరానికి పాల్పడినట్టేనని 73వ నివేదికలో అది స్పష్టం చేసింది. 73వ నివేదికలో హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856ను; 83వ నివేదికలో గార్డియన్స్ అండ్స్ వార్డ్స్ యాక్ట్, 1890తో పాటు హిందూ మైనారిటీ అండ్ గార్డియన్‌షిప్ యాక్ట్, 1956లోని కొన్ని నిబంధనలనూ కమిషన్ సమీక్షించింది. 1980ల్లో వరకట్న మరణాల సంఖ్య బాగా పెరిగింది. తల్లిగారింటి నుంచి తాము కోరినంత వరకట్నం తేనందుకు మహిళను వేధించడంతోపాటు నిప్పంటించడం వంటి కిరాతకాలకు పాల్పడే భర్తకు, ఆయన కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల మీదా గట్టిచర్యల కోసం కఠిన చట్టాలు తీసుకురావాలంటూ దేశవ్యాప్తంగా పెద్దయెత్తున ఉద్యమం బయలుదేరింది. కమిషన్, తన 91వ నివేదికలో ఈ అంశం మీద దృష్టి సారించింది. హిందూ వైవాహిక చట్టం, 1955; భారతీయ శిక్షాస్మృతి, 1860; భారతీయ సాక్షి చట్టం, 1872లకు సవరణలు చేయాలని అది సిఫార్సు చేసింది. అది తన 98వ నివేదికలోనూ హిందూ వైవాహిక చట్ట నిబంధనలను ప్రస్తావించింది. మహిళలకు ఆస్తిహక్కు కల్పన; అందుకు వీలుగా హిందూ చట్టంలో ప్రతిపాదిత సవరణలను తన 174వ నివేదికలో సమీక్షించింది. వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమైతే విడాకులు తీసుకోవచ్చునని తన 217వ నివేదికలోనూ పునరుద్ఘాటించింది. భరణం పొందడానికి హిందూ భార్యకు గల హక్కును 252వ నివేదికలో పరిశీలించింది.
క్రైస్తవ సమాజానికి చెందిన పలు సంప్రదాయాలు, వైయక్తిక చట్టాలనూ కమిషన్ అనేక ఏళ్లుగా ప్రస్తావిస్తోంది, పరిశీలిస్తోంది. 15వ నివేదికలో భారతదేశంలోని క్రైస్తవుల వివాహాలు, విడాకుల గురించి; 90వ నివేదికలో క్రైస్తవుల్లో విడాకులకు గల కారణాలు, భారతీయ విడాకుల చట్టం, 1869లోని 10వ విభాగం గురించి ప్రస్తావించింది. కమిషన్ తన 224వ నివేదికలో విడాకుల చట్టం, 1869ను మరోసారి పరిశీలించింది. విడిగా ఉంటున్న క్రైస్తవ భార్యలకు విడాకులు కోరే అవకాశం కల్పిస్తూ చట్టాన్ని సవరించాలని సిఫార్సు చేసింది. ఈ సాక్ష్యాధారాలన్నీ చూశాక కూడా కమిషన్ కేవలం ముస్లిములనే లక్ష్యంగా చేసుకుంటోందని ఎవరైనా ఎలా అనగలరు? లా కమిషన్ ప్రజాభిప్రాయం సేకరించడాన్ని ఎవరైనా ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నది అంతుపట్టడంలేదు. ఇంతకీ, ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన ప్రశ్నావళి ద్వారా కమిషన్ ఎలాంటి సమాధానాలు రాబట్టదలచింది? రాజ్యాంగంలోని 44వ అధికరణ గురించి మీకు తెలుసా? ఉమ్మడి పౌరస్మృతిలో వివాహం, విడాకులు, దత్తత తీసుకోవడం, సంరక్షణ, శిశురక్షణ, మనోవర్తి, వారసత్వం వంటి అంశాలు ఉంటాయని ఎరుకేనా? వైయక్తిక, సంప్రదాయ విధానాలను క్రోడీకరించి, వాటిని ప్రాథమిక హక్కుల స్థాయికి చేర్చాలని భావిస్తున్నారా… వంటి ప్రశ్నలు అందులో ఉన్నాయి. ప్రత్యేకంగా హిందువులు, క్రైస్తవులకు సంబంధించిన పలు అంశాలపై ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి. హిందువుల్లో ప్రస్తుత సంప్రదాయాల ప్రకారం ఆస్తిహక్కు కుమారులకే సంక్రమిస్తోంది. ఈ దృష్ట్యా హిందూ మహిళలు, తమకు సంక్రమించిన ఆస్తిహక్కును మరింత సమర్థంగా వినియోగించుకొనేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా? క్రైస్తవుల్లో మహిళలు విడాకుల కోసం రెండేళ్లపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. సమానత భావనను ఇది ఉల్లంఘిస్తోందా అన్నవి మరికొన్ని ప్రశ్నలు. బహుభార్యత్వం, బహు భర్తృత్వంతోపాటు మైత్రీ-కరార్ (కాంట్రాక్టు పద్ధతిలో స్త్రీ-పురుషులు స్నేహపూర్వక సహజీవనం సాగించడం) వంటి సంప్రదాయాలను నిషేధించాలా లేదా నియంత్రించాలా అన్నది ఆరో ప్రశ్న. ఒకేసారి ముమ్మార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చే పద్ధతిని రద్దుచేయాలా, కొనసాగించాలా లేదా కొన్ని సవరణలతో కొనసాగనివ్వాలా అన్నది ఏడో ప్రశ్న.
రాజకీయం తగదు
యావత్ ప్రశ్నావళి మీదే విరుచుకుపడుతున్న ముస్లిం మతపెద్దలు, ప్రత్యేకించి చివరి రెండు ప్రశ్నల మీదే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. మూడుసార్లు తలాక్ అన్నది కేవలం ముస్లిములకు సంబంధించిన విషయమే అయినప్పటికీ, బహు భార్యత్వానికి వివిధ కోణాలు ఉన్నాయి. అది కేవలం ముస్లిములకు సంబంధించిన విషయం కాదు. అయినప్పటికీ, బహుభార్యత్వానికి సంబంధించిన ప్రశ్న తలెత్తిన ప్రతిసారీ, అదేదో ముస్లిం మతానుయాయులపై జరుగుతున్న దాడిగా భావించి మతపెద్దలు విమర్శలకు పూనుకొంటున్నారు. వివాహాలు తప్పనిసరిగా నమోదయ్యేలా చూడటం ఎలా, మతాంతర కులాంతర వివాహం చేసుకొనే జంటలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి వంటి ప్రశ్నలూ ఆ ప్రశ్నావళిలో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో అంశాలమీద ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంటే, ఎవరో కొందరు ఈ మొత్తం ప్రక్రియ పట్లే అభ్యంతరాలు ప్రకటించడమేమిటి? రాజ్యాంగ స్ఫూర్తితో సమానత్వం, సౌభ్రాతృత్వం దిశగా సాగిపోదలిచాం. ఈ మార్గంలో అవరోధాలు సృష్టించేందుకు అలాంటివారికి అవకాశం ఎందుకు కల్పించాలి? స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాచేందుకు ముల్లాలకు నెహ్రూవాదులు, వారి అడుగులకు మడుగులొత్తే మరికొందరు రాజకీయవాదులూ స్వేచ్ఛ ఇచ్చారు. ప్రతి విషయానికీ మోకాలడ్డే అవకాశం కల్పించారు. ఈ తరహా ధోరణికి ఇప్పటికైనా అడ్డుకట్ట పడాలి.
-ఎ సూర్య ప్రకాష్
ప్రసార భారతి చైర్మన్