Home News సమిష్టి కృషి తో ఆదర్శ గ్రామంగా గుర్తించబడుతున్న ‘పున్‌సారి’

సమిష్టి కృషి తో ఆదర్శ గ్రామంగా గుర్తించబడుతున్న ‘పున్‌సారి’

0
SHARE

సిసి కెమెరాలు, విద్యుత్‌, వైఫై, తాగునీరు, ఇంటికో మరుగుదొడ్డి, వ్యర్థాలతో పునరుత్పాదక శక్తి, కనీస సౌకర్యాల కల్పనలతో ఓ యువ సర్పంచ్‌ తన గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు.

పున్‌సారి ఇపుడు భారతదేశంలోని అత్యున్నత గ్రామాలలో ఒకటి. నగరాల్లో ఉండే సౌకర్యాలన్నీ అక్కడ కనబడతాయి. ఒకప్పుడు ఈ గ్రామం పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ 2006 నుంచి పున్‌సారి రూపురేఖలే మారిపోయాయి. దానికి కారణం యువ సర్పంచ్‌ హిమాన్షు.

గుజరాత్‌ రాష్ట్రంలోని సబర్‌ కాంత జిల్లా, పున్‌సారి గ్రామంలో హిమాన్షు పటేల్‌ పుట్టి పెరిగాడు. ఉన్నత చదువుల కోసం తన కుటుంబం దగ్గరలోని పట్టణానికి వలస వెళ్ళింది.

సెలవులకు గ్రామానికి వచ్చిన హిమాన్షు పట్టణానికి, గ్రామానికి తేడా గ్రహించాడు. గ్రామంలో విద్యుత్‌, నీటి వసతి లేదు. శాంతి భద్రతలు అదుపులో ఉండేవి కావు. కలహాల కారణంగా నెలకొక పోలీసు కేసయినా నమోదయ్యేది. ఆ యువకుడు పట్టభద్రుడయ్యే నాటికి ఆ గ్రామం పరిస్థితి మరింత క్షీణించింది.

చాలా కుటుంబాలు గ్రామం వదిలి వలస వెళ్ళాయి. గ్రామ పంచాయతి రూ.1.2 లక్షల నష్టంతో ఉంది. 328 కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి.

చదువుకుంటున్న రోజుల్లోనే ప్రభుత్వ పథకాల గురించి హిమాన్షు అధ్యయనం చేసేవాడు. గ్రామ అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా పనిచేస్తూ, ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని సర్పంచ్‌, ఇతర అధికారులను కోరేవాడు. కానీ గ్రామంలో ఏ పదవీ లేని ఆ యువకుడి మాటలు గ్రామస్థులు వినేవారు కాదు. ‘గ్రామం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి నువ్వు చాలా చిన్నవాడివి. గ్రామస్థుల అభిప్రాయాలు మార్చడం సులభం కాదని ఆ అధికారులు తనతో చెప్పేవారని’ హిమాన్షు అన్నాడు.

గ్రామంలో ఆధిపత్యం సంపాదిస్తేనే మార్పు సాధ్యమని భావించి తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయిన తర్వాత 2006లో పున్‌సారి గ్రామ పంచాయతి ఎన్నికలలో పోటీచేసి హిమాన్షు విజయం సాధించి 22 ఏళ్ళ వయసులోనే సర్పంచ్‌ అయిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు.

6000 జనాభా ఉన్న ఆ గ్రామంలో 23 కులాల వారు న్నారు. 98 శాతం గ్రామస్తులు నిరక్షరాస్యులు. వారు వ్యవసాయం, పాడి పరిశ్రమతో జీవిస్తున్నారు. గ్రామ పంచాయతికి అసలు నిధులే లేవు. కొత్త సర్పంచ్‌ను వ్యతిరేకించ డానికి అక్కడి నాయకులు సిద్ధంగా ఉన్నారు.

‘నేను పనిచేయడానికి ఒక బృందం అవసరం. ఒంటరిగా పనులు చేయడం సాధ్యం కాదనిపించింది. అక్కడి ఉపాధ్యాయులు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కేంద్ర సిబ్బంది వంటి 60 మంది ప్రభుత్వోద్యోగులతో ఒక బృందం ఏర్పాటు చేశాను. దశలవారీగా తమ క్షేత్రాల్లో పురోగతి సాధించాలని వారిని కోరాను. దానికి వాళ్ళు పూర్తిగా సహకరించారు.’ అని హిమాన్షు వివరించాడు.

ప్రభుత్వ పథకాల ద్వారా ప్రాథమిక సౌకర్యాలు

హిమాన్షు ముందుగా గ్రామస్థుల్లో విశ్వాసాన్ని నెలకొల్పాలనుకున్నాడు. గ్రామస్థుల కోరికలను, వారి ప్రాథమ్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు.

మొదటి మూడు సంవత్సరాలలో గ్రామంలోని కనీస అవసరాల మీద దృష్టి పెట్టి వాటిని తీర్చాలను కున్నాడు. నిధుల కోసం స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల చుట్టూ తిరిగే బదులు ప్రభుత్వ పథకాల ద్వారా రాబట్టాలనుకున్నాడు.

ప్రభుత్వ పథకాల కోసం సమర్థవంతంగా దరఖాస్తు చేశాడు. రెండు సంవత్సరాల్లోనే ఆ గ్రామానికి విద్యుత్‌ వచ్చింది. వీధి దీపాలు ఏర్పాటు చేశారు. సమర్థవంతమైన రోడ్లు ఏర్పాటయ్యాయి. గ్రామంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించారు.

గ్రామస్థులతో సత్సంబంధాలు

పట్టణాల్లో అందుబాటులో ఉండే అన్ని సౌకర్యాలు పున్‌సారికి కూడా తీసుకురావాలని అభిలషించారు. అయితే గ్రామీణ వాతావరణాన్ని, ఆత్మను అలాగే ఉంచాలని భావించారు.

‘2006లో నేను పని ప్రారంభించినపుడు ఏ విధంగా ముందుకు సాగాలో అర్థం కాలేదు. సంవత్సరాల తరబడి గ్రామస్థులు కోరుతున్న కనీస సౌకర్యాలను వారికి అందించడం ద్వారా వారి విశ్వాసాన్ని పొందాలని నిశ్చయించుకున్నాను. ఆ తరువాత వారు అడగకపోయినప్పటికీ, గ్రామానికి అవసరమైన సౌకర్యాల పట్ల దృష్టిసారించాను’ అని హిమాన్షు తెలిపాడు.

గ్రామస్థులతో సమాచారం పంచుకోవడానికి వీలుగా 2009లో గ్రామంలో 12 స్పీకర్లు ఏర్పాటు చేశాడు. ఈ స్పీకర్లు గ్రామ పంచాయతి కార్యాలయానికి అనుసంధానం చేశాడు. గ్రామస్తులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలను హిమాన్షు పంచాయతి కార్యాలయం నుండి ప్రకటించేవాడు. ఈ విధంగా ఏర్పాటుచేసిన కేంద్రీకృత ప్రకటన వ్యవస్థ ద్వారా, పుట్టినరోజు శుభాకాంక్షలు, మంచి, చెడులను ప్రజలకు తెలియజేసేవారు.

దీంతో గ్రామ పంచాయతికి, గ్రామస్థులకు మధ్య సమాచార అంతరం తొలగిపోయింది. తన చరవాణిని కూడా హిమాన్షు స్పీకర్లకు అనుసంధానించి తాను గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడు.

సుస్థిర ఆదాయ నమూనా

గ్రామంలోని వ్యర్థాలను సేకరించేందుకు హిమాన్షు ఒక వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఈ వాహనం ద్వారా సేకరించిన వ్యర్థాల నుంచి పునరుత్పాదక శక్తిని తయారుచేసే కర్మాగారానికి తరలించి కాంతిని ఉత్పత్తి చేసేవాడు.

‘మా గ్రామం ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే, ఎవరైనా గ్రామంలో ఒక దోమను పట్టుకుంటే వారికి రూ.1 లక్ష బహుమానం ప్రకటించాను’ అని నవ్వుతూ చెప్పాడు హిమాన్షు.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం నమూనా ప్రకారం గ్రామంలో ఒక వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి హిమాన్షు ముగ్గురు యువకులను ప్రోత్సహించాడు. ఈ ప్లాంటు నుండి పున్‌సారి గ్రామ ప్రజలు 2010 నుంచి రూ.4 కే ఐదు లీటర్ల పరిశుద్ధ నీరు పొందు తున్నారు.

సాంకేతికత

గ్రామంలో వైఫై సౌకర్యం కూడా ఉంది. గ్రామ పంచా యతిలో నెలకు రూ.50 చెల్లించి నమోదుచేసుకున్న గ్రామస్తులకు 30 ఎమ్‌బిపిఎస్‌ డేటా ఇస్తున్నారు. గ్రామంలో పాఠశాలలోని అన్ని తరగతి గదులు, ప్రభుత్వ కార్యాలయాల్లో సిసిటివి కెమెరాలు అమర్చారు. ఒక యాప్‌ ద్వారా ఈ కెమెరాలలో నమోదైన దృశ్యాలను చరవాణిలో కూడా వీక్షించవచ్చ న్నారు హిమాన్షు.

‘గ్రామంలో వైఫై సౌకర్యం కల్పించిన కొత్తలో కేవలం ముగ్గురే నమోదు చేసుకున్నారు. కాని ఇప్పుడు 300 మంది ఇంటర్‌నెట్‌ వాడుతున్నారు. ఒక రోజు నీటి సరఫరా ఆగిపోయినా ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. కానీ సర్వర్‌ పని చేయకపోతే వెంటనే ఫిర్యాదు చేస్తున్నారు.’ అన్నాడు హిమాన్షు.

మాతా, శిశుమరణాల రేటు ఆ గ్రామంలో గణనీయంగా తగ్గింది. గ్రామంలో అధిక భాగం పాడి వ్యాపారం చేసేవారు. ప్రతిరోజు రెండు పర్యాయాలు పాలు సేకరించి పాల కేంద్రాలకు తరలించేవారు. దీనికోసం మహిళలు ప్రతిరోజు 2 కి.మి నడిచేవారు. గర్భీణీలకు సైతం ఈ అవస్థలు తప్పేవికావు. కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగు పడింది. గ్రామానికి సొంత రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలో ఏర్పాటు చేసిన మినీబస్సు ప్రస్తుతం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మహిళలను పాలసేకరణ కేంద్రానికి తీసుకువెళ్ళి, తిరిగి గ్రామానికి చేరుస్తోంది. రూ.2 కనీస మొత్తం చెల్లించి గ్రామస్థులు ఆ బస్సులో గ్రామంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు.

2008లో గ్రామంలో 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు వేశారు. తత్ఫలితంగా మాతా, శిశుమరణాల రేటు శూన్యానికి పడిపోయింది. ప్రస్తుతం గ్రామంలో పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు లేరు. గ్రామంలో ప్రసవాలు ఇంట్లో కాక ఆసుపత్రిలో వైద్యులు చేస్తున్నారు.

భవిష్య దృష్టి

హిమాన్షు ఇటీవలే గ్రామ సర్పంచ్‌గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. పున్‌సారిని ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రామంగా తీర్చి దిద్దాలని ఆయన కోరిక. రాబోయే పంచాయతి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న 100 మంది యువతతో తన వారసత్వాన్ని కొనసాగించనున్నాడు.

‘గ్రామంలో వసతులు లేని కారణంగా వలసలు వెళ్ళవద్దు. గ్రామీణ వాతావరణాన్ని కాపాడుకొంటూ పట్టణాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను గ్రామానికే తీసుకురావాలి’ అని యువకులకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

‘నేడు పున్‌సారి గ్రామంలో ఒక్క కుటుంబం కూడా దారిద్య్రరేఖకు దిగువన లేదు.’ అని బెటర్‌ ఇండియాతో హిమాన్షు తన సంతోషాన్ని పంచుకున్నాడు.

( జాగృతి సౌజన్యం తో)