జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నరసింహసాగర్ ప్రాజెక్టు సమీప అడవుల్లో చండ్ర పుల్లారెడ్డి వర్గానికి చెందిన ముగ్గురు నక్సలైట్లను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారివద్ద ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, విప్లవసాహిత్యం, కిట్‌బ్యాగులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లాలో న్యూ డెమొక్రసీకి చెందిన నక్సలైట్ సమ్మయ్య అలియాస్ గోపీని పోలీసులు అరెస్టు చేశారు. చాలాకాలంగా ఇతను అజ్ఞాత జీవితం గడుపుతూ అనేకమంది నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడని పోలీసులు ప్రకటించారు. అతని నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. అనేక కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడని, రెండు హత్య కేసుల్లో ప్రమేయం ఉందని అధికారులు చెప్పారు. ఇది ఇలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోడి ప్రసాద్ అనే గిరిజనుడిని ఇన్ఫార్మర్ పేర మావోయిస్టులు చంపారు. గడ్చిరోలిలో ఏడుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. ఇలా చిన్నచిన్న గ్రూపులు నక్సలైట్లుగా చెలామణి అవుతూ ఆయుధాలతో భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కాలం వెళ్లదీయడం వల్ల సామాజిక మార్పులు జరుగుతాయా? వీరిని చూసి అనేకమంది నకిలీ నక్సలైట్లు ఆవిర్భవిస్తున్నారు. అలాంటివారిని పోలీసులు అరెస్టు చేస్తున్న వార్తలు తరచూ వినిపిస్తూ ఉన్నాయి. ఇది దేనికి సంకేతం?
చారు మజుందార్, కానూ సన్యాల్ నాయకత్వంలో ఏర్పడిన సిపిఐ (ఎంఎల్) అనేక చీలికలు పేలికలయింది. నక్సలైట్లు నలభై గ్రూపులుగా విడిపోయారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే దృశ్యం కనిపిస్తోంది. ఒక పార్టీ నుంచి నలభైకి పైగా గ్రూపులు ఏర్పడి, ప్రతిగ్రూపు తమ ద్వారానే దేశంలో విప్లవం విజయవంతమవుతుందని గొప్పలు చెప్పుకుంటూ, డబ్బు వసూలుచేస్తూ అడపాదడపా పత్రికా ప్రకటనలు జారీ చేయడంతో సమాజంలో గొప్ప మార్పులు వస్తాయని భావించడమంత భావ దారిద్య్రం మరొకటి కనిపించదు.
నక్సలైట్లు, మావోయిస్టులు సమాజాన్ని నిశితంగా అధ్యయనం చేసి తదనుగుణమైన కార్యాచరణ చేపడతారన్న మాట వినిపించేది. కానీ అది ఇప్పుడు పూర్తిగా అవాస్తవమని వివిధ నక్సలైట్ గ్రూపుల కార్యకలాపాలే చెబుతున్నాయి. వారి పోకడలే తెలుపుతున్నాయి. వీరి సిద్ధాంతానికి హేతువైన మార్క్సిజం స్మృతిపథం నుంచి తప్పుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా ఈ సంగతి స్పష్టంగా తెలుస్తోంది.
రష్యా, చైనా తూర్పు యూరప్ దేశాలలోను చోటుచేసుకుంటున్న పరిణామాల అనంతరం, మావోయిజం వెలుగులో దశాబ్దాల పాటు భీకర పోరాటం చేసిన నేపాల్, కొలంబియా తదితర దేశాల మావోయిస్టుల ఉద్యమం ఆరిపోయాక సైతం గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా? అంతెందుకు?.. సిపిఐ, సిపిఐ (ఎం), ఓంకార్ వర్గం.. ఇలా అనేక పార్టీలు ప్రజలకు సరైన దిశా-దశను అందించక చతికిలపడిన వైనం గమనిస్తూనే, ఎంతో నిర్మాణం ఉన్నా, ప్రజాసంఘాలున్నా, పలుకుబడి ఉన్నా వారు చేయగలిగింది ఏమీ లేదు. కారణం వారి దృక్పథానికి కాలం చెల్లింది. సమాజాలు ఆ దృక్పథాన్ని ఎప్పుడో దాటేసి దూసుకుపోతున్నాయి. సమాజంలోని డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. మారిన పరిస్థితులకు ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారు. అటువైపుగా కదులుతున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నా పట్టించుకోకుండా సిపిఐ, సిపిఎం, రివిజనిస్టు పార్టీలు, కాడి వదిలేసినవి అని ఎద్దేవ చేసి నక్సలైట్లు, మావోయిస్టులు ఆత్మ సంతృప్తి పొందడం తప్ప అంతకుమించి చేసింది ఏమీలేదు. పైగా బలవంతపు వసూళ్లతో, ఆయుధాలతో ఆలోచనలను కలుషితం చేస్తున్నారు. పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వట్టిపోయిన మార్క్సిజం వెలుగులో మరో వెయ్యేళ్లు ఇలా ఉద్యమించినా ఒరిగేది ఏమీ ఉండదు. డబ్బులు వసూలు చేస్తూ కాలం గడపడం తప్ప మరో ప్రయోజనం కనిపించదు.
కొత్త నీరొచ్చి పాత నీటిని పారదోలుతుంది. ఇది అతి సూక్ష్మమైన అంశం. దీన్ని సైతం పట్టించుకోకుండా 150 సంవత్సరాల క్రితం యూరప్‌లో మొగ్గతొడిగిన మార్క్సిజం అజరామరమని భారతదేశంలో అమలు జరుపుతామని, అడవుల్లో తిరగడం వల్ల అశేష ప్రజానీకానికి ఏ రకమైన మేలు జరుగుతోంది?.. అన్న ప్రశ్న వారు వేసుకున్నట్లు కనిపించడం లేదు.
21వ శతాబ్దాంలో జనాభా నగరాలల్లో కేంద్రీకృతమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ దృశ్యం కనిపిస్తోంది. నగరజీవనం ఎంత వైవిధ్యభరితమో అందరికీ తెలుసు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా జీవనం ఉన్నతీకరించుకునే ఆలోచనలతో పౌరులున్నారు. అటువైపుగా దృష్టి సారించి తమ శక్తియుక్తిని ధారపోస్తున్నారు. ఆధునికతను అందుకోకపోతే వెనకబడిపోతామన్న భావన కనిపిస్తోంది. తమ పిల్లలను సైతం అందుకు అనుగుణమైన వాతావరణం గల పాఠశాలల్లో చదివిస్తున్నారు. జ్ఞానవంతులై, ఉన్నత స్థాయికి ఎదిగి మేలైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నారు. ఆ చట్రంలో పూర్తిగా ఒదిగిపోతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అడుగు ముందుకువేస్తున్నారు.
ఈ వైఖరికి నక్సలైట్లు – మావోయిస్టులు చెబుతున్న వైఖరికి ఎక్కడైనా పొంతన కనిపిస్తుందా? వర్తమాన సమాజం కొనసాగుతున్న ధోరణికి పూర్తి భిన్నంగా మార్కెట్ రహిత ఎకానమీ, సమష్ఠి కార్యక్షేత్రాలకు, కార్ఖానాలకు తాము ప్రజల్ని తరలిస్తామని పనిచేస్తున్నారు. ప్రజలు అటు మళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రపంచంలో మరోచోటైనా అలా జరుగుతోందా?,, వారి ఊహల ప్రపంచం రష్యా, చైనా, తూర్పు యూరప్‌లో పేకమేడల్లా కూలిపోయాక, ఆయా సమాజాలు ప్రపంచంతో కలసి నడుస్తుండగా అదికాదని కాలం చెల్లిన మార్గంవైపు కదలిస్తామని కత్తులు దూస్తే అది విజ్ఞత అవుతుందా? నక్సలైట్లు మావోయిస్టులు విజ్ఞత, వివేచన, అన్నీ మరచి విమోచన, విముక్తి పదాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విధానం పేదప్రజలకు ఏ రకంగా ఉపయుక్తంగా ఉంటుందన్న మాటను కూడా పట్టించుకోవడం లేదు.
మనకు ఇష్టమున్నా లేకున్నా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రాచుర్యం పొందింది. ఆ వ్యవస్థలోనే మనం ఉన్నాం. రాచరికంలోనో, నియంతృత్వ పాలనలోనో ప్రజలు లేనప్పుడు, ప్రజలు తమ విజ్ఞత మేరకు ప్రతినిధులను ఎన్నుకుని అధికారి వారికి అప్పగిస్తున్నప్పుడు అందులో చేయాల్సిన సంస్కరణల గూర్చి, మార్పుల గూర్చి, మేలుగూర్చి చింతన చేయాలి తప్ప సాయుధపోరాటం, గెరిల్లా పోరాటం, విముక్తి ప్రాంతాలు, రెడ్ కారిడార్లు అంటూ కలవరిస్తే కాలం కరిగిపోతుంది తప్ప ప్రజలకు ఇసుమంతైనా మేలు జరగదు.
ప్రజలపై అపారమైన ప్రేమగలవారు రాజ్యాధికారం కోసం గాక వారి సాధికారత, ఆర్థిక ఎదుగుదల కోసం పాటుపడితే, ప్రణాళికలు రచించి ఆచరణలో పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి పూర్తి వ్యతిరేక దిశలో దశాబ్దాలు ఆయుధాలు పట్టుకుని పచ్చని అడవిలో తిరిగితే వెచ్చని నెత్తురు భూమిపాలు కావడం తప్ప ప్రజల జ్ఞానస్థాయి పెరగదు. సాధికారతను సాధించలేదు. ఇప్పటికైనా నక్సలైట్లు, మావోయిస్టులు మార్క్సిజం, మావోయిజం కన్నా ప్రజలు చాలా ముఖ్యం. వారి సాధికారత కీలకమని విధానాలు మార్చుకుంటే వారి కలలు కొంతమేర నెరవేరుతాయి. అలాకాదని ఇదే పోకడను అనుసరిస్తే డిజిటల్ విప్లవం సునామీలో జాడ కనిపించకుండా పోవడం ఖాయం.
(ఆంధ్రభూమి సౌజన్యం తో)