కొద్దిమంది ప్రచారం చేస్తున్నట్లుగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న గిరిజన, ఆదివాసీ సంస్కృతి `ప్రత్యేకమైనది’, `హిందూత్వం’ తో సంబంధంలేనిది కాదని, అక్కడ హిందూ సంస్కృతే ఉన్నదని పురాతత్వ పరిశోధనల్లో తేలింది. ఈ రాష్ట్రపు పురాతన చరిత్రను గురించి పూర్తి సమాచారాన్ని వెలుగులోకి తీసుకురావడం చాలా అవసరం.
సూర్యోపాసనకు పేరుపొందిన అరుణాచల్ ప్రదేశ్ చుట్టూ వివిధ దేశాలు ఉన్నాయి. పడమర భూటాన్, ఉత్తరాన, వాయవ్యం వైపు చైనా, ఆగ్నేయం వైపు మయన్మార్ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఈ చరిత్రను పూర్తిగా వెలికితీయడానికి తగిన ప్రయత్నాలు జరగలేదు.
ఆధునిక కాలం కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్ చరిత్ర గురించి వివరాలు తక్కువగా లభిస్తున్నాయి. ఇక్కడి గిరిజన మతం, కొంతవరకు బౌధ్ధం గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. అయితే రామాయణ, మహాభారత కాలం (క్రీ.పూ. 500 – 400) నాటినుండే ఇక్కడ హిందూ సంస్కృతి, మతం ఉన్నాయని చరిత్రకారులు అంటున్నారు. పౌరాణిక సాహిత్యం కూడా ఈ విషయాన్ని బలపరుస్తోంది. పరశురామకుండంలోకి పడే లోహిత నదిని పురాణకాలంలో లౌహిత్య అనేవారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని వివిధ ప్రదేశాల గురించి ఇతిహాసాలలో ప్రస్తావన ఉంది. లోహిత లోయను ప్రభు కుతర్ మరియు ప్రభు పరభత్ అని కాళికా పురాణం వర్ణిస్తుంది. భాగవతంలోని రాజా భీష్మకుని ప్రదేశమే నేటి సడియాకి దగ్గరలో ఉన్న భీష్మక్ నగర్. ఇక్కడి రాగి దేవాలయం నుండి సంస్కృత భాషలో ఉన్న రెండు రాగి శాసనాలు బయటపడ్డాయి.
అరుణాచల్ లోని ‘కర్బి’ మొదలైన గిరిజన జాతులవారు తాము రామాయణంలోని వాలి, సుగ్రీవుల వంశానికి చెందినవారమని భావిస్తారు. ‘తివ’ జాతివారు తాము సీతాదేవి వంశజులమని చెప్పుకుంటారు. అలాగే ‘మిష్మిస్’ జాతివారు భీష్మకుని ద్వారా ఆయన కుమార్తె అయిన రుక్మిణితో, అల్లుడైన శ్రీకృష్ణునితో సంబంధం కలుపుకుంటారు. బ్రహ్మపుత్ర లోయలోని మారుమూల ప్రాంతాలైన తవాంగ్ లో శైవమత ప్రభావం బాగా కనిపిస్తుంది.
19వ శతాబ్దంలో బ్రిటిష్ అధికారులు, రచయితలు అరుణాచల్ ప్రదేశ్ లోని వివిధ గిరిజన జాతుల మౌఖిక చరిత్రను నమోదుచేశారు. వాళ్ళు భీష్మక్ నగర్, తామేశ్వరి దేవాలయం, భాలుక్ పాంగ్, రుక్మిణీ నగర్, ఇటా కోట ల గురించి జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు, గాథలను నమోదుచేశారు.
20వ శతాబ్దం, 21వ శతాబ్దం ప్రారంభంలో రాష్ట్రానికి చెందిన పురాతత్వ పరిశోధకులు వివిధ ప్రాంతాలలో త్రవ్వకాలు జరిపారు. 1965-67 త్రవ్వకాలలో లోహిత్ జిల్లాలో ఒక పెద్ద శివలింగం బయటపడింది. ఆ తరువాత భీష్మకనగర్, మాలినీథాన్, విజయనగర్, రుక్మిణినాగర్, నక్సా పరభాత్ మొదలైన చోట్ల కూడా త్రవ్వకాలు జరిపారు.
తామ్రేసరి దేవాలయం, భీమకనగర్ కోటల్లో లభించిన శాసనాలు సంస్కృత, అస్సామీ, బెంగాలీ భాషల్లో ఉన్నాయి. ఒక శాసనాన్ని `శ్రీ శ్రీ లక్ష్మి నారాయణ్ జప‘ కు అనువదించారు. లోహిత్ జిల్లా తేజు దగ్గరలో ఉన్న పరశురామ కుండాన్ని చాలామంది హిందూ భక్తులు సందర్శించారు. మాతృహత్యా పాతకం నుండి విముక్తుడు కావడానికి పరశురాముడు ఇక్కడే నదిలో స్నానం చేశాడని కాళికా పురాణం చెపుతోంది.
శ్రీకృష్ణుని భార్య అయిన రుక్మిణీ దేవి రాజ్యం భీష్మకనగర్ నేటి దిబాంగ్ లోయ జిల్లాలో రోయింగ్ దగ్గర ఉంది. దీని పాలకుడు భీష్మకుడు. ఇతని గురించి కూడా కాళికా పురాణంలో ప్రస్తావన ఉంది. సియాంగ్ జిల్లాలోని పర్వతసానువుల్లో మాలినితన్ దగ్గర ఒక దేవాలయ సముదాయపు శిధిలాలు బయటపడ్డాయి. అక్కడ నాలుగు వేరువేరు దేవాలయాలు ఉండేవని తేలింది. పెద్ద సంఖ్యలో హిందూ దేవిదేవతా విగ్రహాలు అక్కడ కనుగొన్నారు. చక్కగా చెక్కిన విగ్రహాలు, రాతి స్తంభాలు ఆనాటి చరిత్రను తెలియజేస్తాయి. భీష్మకనగర్ కు తిరిగివెళుతున్నప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య అయిన రుక్మిణితో ఈ ప్రదేశంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడని ప్రతీతి. వారికి పరమశివుడు, పార్వతి పూలమాలలతో స్వాగతం చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పార్వతీదేవిని `మాలిని’ అని సంబోధించి, ఇదే పేరుతో ఇక్కడ పూజాలందుకుంటుందని చెప్పాడు. అప్పటినుంచి ఆ ప్రదేశానికి `మాలినితన్’ లేదా `మాలిని నివాసం’ అనే పేరు వచ్చింది.
ఈ దేవాలయ సముదాయం క్రీ.శ. 9 నుండి 13 శతాబ్దానికి చెందినదని, క్రీ.శ. 700 నుండి 950 దాకా పాలించిన అస్సామ్ పాలకుల ప్రభావం అక్కడ కనిపిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఋషులు, గంధర్వులు, అప్సరసలు, మానవులు, జంతువుల బొమ్మలు అక్కడ లభించిన రాతిస్తంభాలపై కనిపిస్తాయి. అక్కడి ప్రధాన దేవత దుర్గ (మాలిని). త్రవ్వకాలలో బయటపడ్డ విగ్రహపు ముక్కల ఆధారంగా ప్రధాన దేవత విగ్రహాన్ని తయారుచేశారు. దుర్గాదేవితోపాటు నంది, ఇంద్ర, సూర్య, బ్రహ్మ, గణేశ, లక్ష్మి, సరస్వతి, వరాహ, రాధ, కృష్ణ, శివలింగ మొదలైన అనేక దేవతా విగ్రహాలు లభ్యమయ్యాయి. మాలినితన్ దగ్గర ఉన్న ఆకాశిగంగ 51 శక్తి పీఠాలలో ఒకటని చెపుతారు. సతీదేవి తల ఇక్కడ పడిందని పురాణగాథ. మాలినితన్ , ఆకాశిగంగ లను దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం వేలాదిమంది దేశం మొత్తం నుంచి వస్తారు.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని సుబాన్సిరి జిల్లాలోని జైరో వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం బయటపడింది. 2004 సంవత్సరం శ్రావణమాసంలో దట్టమైన అడవి మధ్యలో ఈ శివలింగం బయటపడింది. ఈ శివలింగం గురించి శివపురాణంలోని రుద్రకాండం 17 అధ్యాయంలో ఉంది. 25 అడుగుల ఎత్తు, 22 అడుగుల చుట్టుకొలత ఉన్న ఈ సహజసిద్దమైన రాయి క్రింద నిరంతరం ప్రవహించే జలాధార ఉంది. ఆ లింగం చుట్టూ పరమశివుని పరివారమైన పార్వతీదేవి, గణేశుడు మొదలైనవారి విగ్రహాలు లింగరూపంలోనే ఉన్నాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో లభించిన దేవతా విగ్రహాలను ఆయా ప్రదేశాల్లోనే పునర్ ప్రతిష్టించడంగాని, పురావస్తు ప్రదర్శనశాలకు తరలించడంగాని చేస్తున్నారు. వందలాది సంవత్సరాలుగా ఈ ప్రదేశాలలో ప్రచారంలో ఉన్న పురాణగాథలు, విశ్వాసాలకు బలం చేకూర్చేవిధంగానే ఈ విగ్రహాలు లభ్యమవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు.
స్థానిక గిరిజన జాతులు తమ సాంస్కృతిక మూలాలను మరచిపోయే విధంగా స్వాతంత్ర్యం తరువాత ప్రభుత్వాలు వ్యవహరించాయి. `నెహ్రూ విధానమే’ ఇందుకు కారణం. దీనితో అనేకమంది చరిత్రకారులు, సాహిత్యకారులు అరుణాచల్ ప్రదేశ్ లోని గిరిజన మతం, సంప్రదాయం ప్రత్యేకమైనవని ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ పురాతత్వ పరిశోధనలు మాత్రం ఇందుకు భిన్నమైన విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని మత సంప్రదాయాలు శతాబ్దాల నాటివని చెపుతున్నాయి. రాష్ట్రపు ప్రాచీన చరిత్రను వెలుగులోకి తెచ్చేందుకు ఇవి ఎంతైనా ఉపయోగపడతాయి.
– జగదీష్ కౌర్
(రచయిత ` అరుణాచల్ ప్రదేశ్ – రీడిస్కవరింగ్ హిందూయిజం ఇన్ ద హిమాలయాస్’ అనే పుస్తకం రాశారు.)
డైలీ పయనీర్ సౌజన్యంతో …