Home News గుజరాత్‌లోని గ్రామస్థుల సమిష్టి సేద్యఫలం

గుజరాత్‌లోని గ్రామస్థుల సమిష్టి సేద్యఫలం

0
SHARE
  • -సొంతంగా సంస్థను ప్రారంభించిన రైతులు
  • -లబ్ధిపొందుతున్న 17 గ్రామాలు
  • -రెట్టింపైన పంట దిగుబడి, ఆదాయం

ఒకప్పుడు వ్యవసాయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వేలాది పల్లెల్లో ఒకటిగా ఉన్న ఆ కుగ్రామం ఇప్పుడు ఆగ్రోవిప్లవంతో అందరిదృష్టినీ ఆకర్షిస్తున్నది. కొంత సాంకేతిక పరిజ్ఞానం, మరికొంత సమిష్టి ప్రయత్నం.. గుజరాత్‌లోని మారుమూల గ్రామంలో అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది. గాంధీనగర్‌కు 266 కిలోమీటర్ల దూరంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న వకియాలో గ్రామస్థుల సమిష్టి కృషి ఫలితంగా తక్కువ కాలంలోనే పంట ఉత్పత్తి, రైతుల ఆదాయం రెట్టింపైంది. మొదట్లో గ్రామంలో ఎకరానికి 500 కిలోల దిగుబడి వచ్చేది. ప్రస్తుతం అక్కడ 1200కిలోలకు తక్కువకాకుండా రైతులు దిగుబడి సాధిస్తుండటం విశేషం. దీనికంతటికీ కారణం వకియా గ్రామస్తులు తమకోసం సౌరాష్ట్ర స్వనిర్భర్ ఖేదత్ ప్రొడ్యూసర్స్ కంపెనీ (ఎస్‌ఎస్‌కేపీసీ) అనే ఓ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడమే.

ధాన్యాన్ని కొనే రైతుల సంస్థ

ఎస్‌ఎస్‌కేపీసీ సహకార పద్ధతిలో పనిచేస్తుంది. ఆరుగురు సభ్యుల బోర్డు పరిశ్రమ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటుంది. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉంటారు. కంపెనీల చట్టం-2015 కింద వకియా గ్రామస్తులు ఈ పరిశ్రమను రిజిస్టర్ చేయించుకున్నారు. దీని ద్వారా అప్పటివరకు స్థానిక మార్కెట్లలో అమ్ముకున్న పంట ఉత్పత్తులను క్రమంగా నాఫెడ్‌కు మాత్రమే విక్రయించడం ప్రారంభించారు. సీజన్ పొడవునా ఒకే ధర దక్కేలా ఎస్‌ఎస్‌కేపీసీ చూస్తుంది. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, నాఫెడ్‌కు విక్రయిస్తుంది. రైతు తన పంట వివరాలను అందిస్తే, ఆయన పంట ఉత్పత్తుల్ని ఏ రోజు విక్రయానికి తీసుకురావాలో తెలుపుతారు. కేటాయించిన తేదీలో ఏదైనా మార్పులుంటే సదరు రైతుకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. ఎక్కడా ధర తగ్గడం కానీ, ఒకేసారి ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తడం కానీ ఉండదు. అలాగే సాగుకు సంబంధించి కూడా రైతులను సెల్‌ఫోన్ మెసేజ్‌ల రూపంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. రిలయన్స్ ఫౌండేషన్ మాలో స్ఫూర్తిని నింపడంతో సొంతంగా పరిశ్రమ పెట్టుకోగలిగాం. ఎప్పుడైతే సగటు పంట దిగుబడి రెట్టింపు అయ్యిందో అప్పటినుంచి రైతుల ఆదాయమూ పెరుగుతూ వచ్చింది. మొదట్లో క్వింటాలుకు రూ.3,500 దక్కుతుండగా, ఇప్పుడు రూ.4,500 ధర పలుకుతున్నది అని ఎస్‌ఎస్‌కేపీసీ బోర్డు సభ్యుడు బావుజీ సగతియా చెప్పారు.

17 గ్రామాలకు విస్తరణ

వకియా రైతుల ప్రయత్నం ఆ ఊరికే పరిమితం కాలేదు. క్రమంగా అమ్రేలీ ప్రాంతంలోని 17 గ్రామాల రైతులు ఎస్‌ఎస్‌కేపీసీలో చేరారు. ఇప్పుడు 1600మంది రైతులు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. పంట ఉత్పత్తుల అమ్మకాలేకాదు, సాగు తరగతులనూ ఎస్‌ఎస్ కేపీసీ నిర్వహిస్తుంది. ఎస్‌ఎస్‌కేపీసీకి సొంతగా ప్రయోగశాల కూడా ఉంది. భూపరీక్షలు, తెగుళ్ల నివారణ వంటివాటిపై రైతులు సలహాలు తీసుకుంటుంటారు. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసి కంపెనీయే రైతులకు అందజేస్తుంది. సాగునీటి ఏర్పాట్లు కూడా ఎస్‌ఎస్‌కేపీసీయే చూసుకుంటుంది. సంస్థ ఇప్పటివరకు 70వరకు చెక్‌డ్యాములను నిర్మించడం విశేషం.

(నమస్తే తెలంగాణా సౌజన్యం తో)