Home News దేశ వ్యతిరేక కార్యక్రమాలకు నిలయాలైన నకిలీ ‘స్వఛ్ఛందం’ సంస్థల పై వేటు

దేశ వ్యతిరేక కార్యక్రమాలకు నిలయాలైన నకిలీ ‘స్వఛ్ఛందం’ సంస్థల పై వేటు

0
SHARE

ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు వివిధ రకాల అక్రమాలకు పాల్పడుతుండడం గురించి ఏళ్ల తరబడి చర్చ జరుగుతోంది! దాదాపు నాలుగువేల తొమ్మిది వందల ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు – నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ – ‘ఎన్‌జిఓ’లు – విదేశీయ నిధులను స్వీకరించకుండా కేంద్రప్రభుత్వం కొత్తగా నిర్ధారించడంతో ఈ ‘అక్రమాల’ పట్ల మరోసారి ప్రజల ధ్యాస పెరిగింది. విదేశాల నుంచి నిధులను పొందదలచిన ‘స్వచ్ఛంద సంస్థలు’ ‘విదేశ ఆర్థిక ప్రదాన నియంత్రణ’ – ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ – ఎఫ్‌సిఆర్‌ఏ – చట్టం ప్రకారం నమోదు చేసుకోవలసి ఉంది! అక్రమాలకు ఒడిగట్టిన వేలాది ‘సంస్థల’ ‘ఎఫ్‌సిఆర్‌ఏ’ గుర్తింపును గత మూడేళ్లుగా కేంద్రప్రభుత్వం రద్దు చేసింది! ఇప్పుడు గుర్తింపు రద్దయిన సంస్థలు ఒడిగట్టిన ‘అక్రమం’ ఆరేళ్లపాటు ఆదాయవ్యయ గణాంకాల వివరాలను ప్రభుత్వానికి సమర్పించకపోవడం.. దేశంలోని దాదాపు పదివేల ‘సంస్థలు’ ఈ అక్రమానికి ఒడిగట్టినట్లు దేశ వ్యవహారాల సహాయమంత్రి కిరణ్ రిజిజు బుధవారం రాజ్యసభలో వెల్లడి చేయడం ఆందోళనకరం. ‘ఎన్‌జిఓ’లలో కొన్ని దేశ వ్యతిరేక కలాపాలకు పాల్పడుతుండడం బహిరంగ రహస్యం! ఇలా జమాఖర్చులు చెప్పని ఈ పదివేల సంస్థలపై చర్య తీసుకొనకుండా ప్రభుత్వం ఆరేళ్లు ఉపేక్షించడం విచిత్రమైన వ్యవహారం! దాదాపు ఆరువేల ‘ఎన్‌జిఓ’లను మాత్రమే ఇప్పటివరకూ సంజాయిషీ చెప్పవలసిందిగా ప్రభుత్వం కోరిందట! సంజాయిషీ చెప్పని దాదాపు నాలుగువేల తొమ్మిది వంద ల సంస్థలకు విదేశీయ విరాళాలు స్వీకరించే అవకాశం రద్దయిపోయింది. ఇలా ‘అక్రమా’నికి ఒడిగట్టి చర్యకుగురైన సంస్థలలో అత్యధికం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి, నాలుగు వందల యాబయి నాలుగు సంస్థల ‘విదేశీయ విరాళాల’ గుర్తింపు రద్దయింది. తెలంగాణకు చెందిన నూట తొంబయి ‘ఎన్‌జిఓ’ల గుర్తింపుకూడ రద్దయింది! లెక్కలు – ఆరేళ్లపాటు – చూపని మిగిలిన ‘ఎన్‌జిఓ’లకు ప్రభుత్వం ఇంకా ‘సంజాయిషీ’ తాకీదులను జారీ చేయవలసి ఉంది! ‘ఎన్‌జిఓ’లకు విదేశాల నుంచి లభిస్తున్న విరాళాల సంఖ్య, నిధుల పరిమాణం క్రమంగా తగ్గుతుండడం శుభపరిణామం. అక్రమ నిధులపై ప్రభుత్వం ‘నిఘా’ పెరగడం ఇందుకు కారణం కావచ్చు!!

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ‘ఎన్‌జిఓ’లకు పదమూడు వేల ఏడు వందల యాబయి కోట్ల రూపాయల విదేశీయ విరాళాలు లభించాయట! అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పదిహేడు వేల ఏడువందల డెబ్బయి మూడు వేల కోట్ల రూపాయల విదేశీయ నిధులు ఈ ‘సంస్థల’కు ముట్టాయి. అంటే సంవత్సరం వ్యవధిలో నాలుగువేల కోట్ల రూపాయల విదేశీయ విరాళాలు తగ్గిపోయాయి! ‘ఎఫ్‌సిఆర్‌ఏ’ నిబంధనలను ప్రభుత్వం నిర్దిష్టంగా అమలు జరుపడం ఇందుకు కారణం! విదేశీయ విరాళాలను పొందుతున్న ‘సంస్థల’లో కొన్ని దేశంలో పుట్టి పెరిగిన మతాలకు చెందినవారిని విదేశాల నుంచి వ్యాపించిన మతాలలోకి మార్చుతున్నట్టు దశాబ్దులుగా ప్రచారవౌతోంది. ఈ మతం మార్పిడి ముఠాలు ‘స్వచ్ఛందం’ ముసుగేసుకొని ‘సేవ’ పేరుతో చెలామణి అవుతున్నాయి! మరికొన్ని ‘ఎన్‌జిఓ’లు స్వచ్ఛంద సేవ పేరుతో పరిశోధన పేరుతో పాకిస్తాన్ ప్రేరిత ‘జిహాదీ’ బీభత్సకాండను ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రోత్సహిస్తున్నాయి. ‘స్వచ్ఛందం’ మాటున మరికొన్ని సంస్థలు వివిధ దేశాల తరఫున గూఢచర్యం సాగిస్తూ మనదేశాన్ని బలహీన పరచడానికి యత్నిస్తున్నాయి! మాదకద్రవ్యాల దొంగ రవాణా, అటవీసంపదను అక్రమంగా తరలించడం వంటి కలాపాలకు సైతం కొన్ని ‘ఎన్‌జిఓ’లు పాల్పడుతున్నాయి. స్వదేశంలోను విదేశాలలోను సేకరించిన నిధులను సమాజ అభ్యుదయానికికాక ‘స్వాభ్యుదయ’ కార్యక్రమాలకు వినియోగిస్తున్న ‘ఎన్‌జిఓ’ల నిర్వాహకులు కోకొల్లలు… ‘ఎన్‌జిఓ’ను నడుపుతున్నాడంటే ‘‘చట్టబద్ధం’’గా సమాజాన్ని కొల్లగొడుతున్నాడన్నది వాస్తవాన్ని ప్రతిబింబించిన ‘చతురోక్తి’.. నిస్వార్థంగా సమాజసేవ చేసిన చేస్తున్న ‘ఎన్‌జిఓ’లు కూడ చాలా ఉన్నాయి. కానీ వాటికి ప్రచారం తక్కువ..!

దేశంలో వెలసి ఉన్న ముప్పయి లక్షల ‘ఎన్‌జిఓ’ల ఆర్థిక కలాపాలను ‘సమీక్ష’ – ఆడిటింగ్ – చేయాలని గత ఏడాది జనవరి పదవ తేదీన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం ‘నకిలీ సంస్థల’ను పసికట్టడానికి, కట్టడి చేయడానికి దోహదం చేసిన పరిణామం! ప్రభుత్వ నిధులను పొందుతున్న ‘ఎన్‌జిఓ’లు నియమావళికి అనుగుణంగా లక్ష్యాల సాధన కోసం ఆ నిధులను ఖర్చుపెట్టాలి! అలా ఖర్చు చేయడంలో విఫలమైన ‘ఎన్‌జిఓ’లు ఆ సొమ్మును ప్రభుత్వానికి – రాష్టప్రతికి – తిరిగి చెల్లించాలని నిర్దేశిస్తూ కేంద్రప్రభుత్వం నియమావళిని సవరించింది కూడ! జాతివ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అభియోగంపై కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి దశలవారీగా అనేక ‘ఎన్‌జిఓ’ల ‘విదేశీయ నిధులు పొందే’ అనుమతులను రద్దు చేసింది! 2016 నవంబర్‌లో దాదాపు పాతిక సంస్థల అనుమతులు ఒకేసారి రద్దు కావడంతో ‘ఎన్‌జిఓ’ల ముసుగులో జరుగుతున్న దేశద్రోహ కలాపాలు బట్టబయలయ్యాయి! ‘ఎవాంజలిస్ట్’ అంటే ఇతర మతాలవారిని క్రైస్తవ మతంలోకి మార్చేవాడన్నది రూఢీపడిన వాస్తవం! మన ఎవాంజిలికల్ – క్రైస్తవంలోకి మతం మార్పిడి చేసే – ఎన్‌జిఓలు 2015-16లో దాదాపు మూడువేల కోట్ల రూపాయల విదేశీయ నిధులు స్వీకరించినట్టు గత ఏడాది మార్చిలో ధ్రువపడింది. ‘అయన’ అన్న కేరళలోని ‘ఎవాంజలిస్ట్’ సంస్థకు దేశంలోనే అత్యధికంగా ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు విదేశాల నుంచి లభించాయట! ‘గోస్పెల్ ఫర్ ఆసియా’ పేరుతో వెలసిన ‘ఎన్‌జిఓ’ అనేక దేశాలలో అభిశంసనకు గురి అయింది, బహిష్కరణకు గురి అయింది. ఈ సంస్థ పేరు మార్చుకొని ‘అయన’ సేవా సంస్థగా వెలసిందట! మతం మార్పిడులకు విదేశాల నుంచి లభిస్తున్న ఆర్థిక సహాయానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే!!

బంగ్లాదేశ్‌లోను మనదేశంలోను జరిగిన అనేక బీభత్స జిహాదీ హత్యాకాండలకు జాకిర్ నాయక్ అన్న ప్రచ్ఛన్న బీభత్సకారుడు సూత్రధారుడు! ముంబయి కేంద్రంగా ఇతగాడు నడిపిన ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్’ అన్న స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి భారీగా విరాళాలు లభించాయి. నేరస్థుడుగా ధ్రువపడిన జాకిర్ నాయక్ సౌదీ అరేబియాకు పారిపోయాడు…!! నిజమైన సేవకు ‘నకిలీ’ గ్రహణం పట్టి ఉండడం నడుస్తున్న చరిత్ర..

(ఆంధ్రభూమి సౌజన్యం తో )