మార్క్సిజం ఒక మాధ్యమం మాత్రమే! కాని గత ఎనిమిది దశాబ్దాలుగా భారతదేశంలో దీన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేయడం వల్ల జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ సూక్ష్మమైన అంశాన్ని పట్టించుకోకుండా ఎందరో ఈ తప్పులో కాలేశారు. తమతోపాటు మరెందరినో ఆ తప్పులోకి లాగారు. ఇంకా లాగుతూ ఉన్నారు. ప్రపంచంలో రెండు వర్గాలు ఎప్పుడూ కనిపించవు. ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణమైన వ్యవస్థలు ఏర్పడటం, లుప్తమవడం కనిపిస్తుంది తప్ప స్థిరంగా రెండు వర్గాలు సమాంతరంగా ప్రయాణించిన దాఖలాలు కనిపించవు. రాచరికం, భూస్వామ్యం, పెట్టుబడిదారి విధానం, ప్రజాస్వామ్యం ఇవన్నీ వ్యవస్థలు మాత్రమే. స్థిరంగా నిలిచేవి కావు. అందులో ఉన్నవారందరూ మనుషులు.. రక్తమాంసాలతో స్పందించే వ్యక్తులు. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా ‘వర్గకసి’ అన్న విషం నూరిపోసి జీవితాలను నరకప్రాయం చేయడం దారుణాతి దారుణం.
ఒకవేళ వర్గాలు బలవత్తరమైనవే అయితే చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రనే అయితే రోమన్ సామ్రాజ్యపు రాజులు, చక్రవర్తులు, భారతదేశంలో గుప్త రాజులు, చక్రవర్తుల వంశాలే, వారి వారసులే 21వ శతాబ్దంలోనూ అధికారంలో కొనసాగాలి! ఎందుకంటే వర్గం బలమైనది అని నిర్వచించుకున్నప్పుడు ఆ బలమైన వర్గం అలాగే కొనసాగేది. రష్యాలో కార్మికవర్గ అధికారం అలానే కొనసాగేది. కాని వర్గం ఒక మిథ్య, ఒక భావన మాత్రమే! ఈ మిథ్యను, భావనను ఆసరా చేసుకుని రక్తకాసారాలను సృష్టించడం దారుణాతి దారుణంగాక ఏమవుతుంది?
మార్క్స్ ఒక మాయను ప్రతిపాదించాడు. దాన్నే వాస్తవమని నమ్మి కోట్లాది మందిని కదిలించి జీవన విధానాన్నే కలుషితం చేశారు. కార్మికవర్గ జ్ఞానశక్తి ఎదగకుండా చేశారు. ఒకరి పెత్తనం, దాష్టీకం నుంచి మరొకరి పెత్తనం, దాష్టీకంలోకి మారడం తప్ప రష్యాలో ఒరిగింది ఏమీ లేదు. ఏదో స్వర్గం, స్వప్నం, సంపద వికేంద్రీకరణ, సౌభాగ్యంలాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పుకోవడం తప్ప అది వాస్తవం కాదని రుజువైంది. రుజువుకాకముందు, రుజువయ్యాక కూడా అదే ముతక ధోరణిలో, మూస ధోరణిలో మార్క్సిజం మాధ్యమంపైనే ప్రాణాలు నిలపడం విడ్డూరంగాక ఏమవుతుంది?
మనిషి.. అతని శక్తి సామర్ధ్యాలు, జ్ఞానబలిమి, నైపుణ్యాలు కొత్తను ఆహ్వానించడం, ముందుకు సాగడం.. ఇదే అనాదిగా కొనసాగుతున్న ప్రక్రియ. ఈ క్రమంలో రకరకాలైన వ్యవస్థలు రూపుదిద్దుకోవడం విచ్ఛిన్నం కావడం, కొత్త వ్యవస్థలు పురుడుపోసుకోవడం ఒక ‘‘సైకిల్’’లా కొనసాగుతున్న అంశం. ఈ భావనకు, మార్క్సిజాన్ని విశ్వసించేవారి భావనకు, అవగాహనకు హస్తిమశకాంతరం కనిపిస్తుంది.
రెండువర్గాల ప్రయాణం అనాదిగా ఉంది. అది కొనసాగుతుందని భావించడం, ఆ భావనతోనే కాలం గడపడం పూర్తిగా అజ్ఞానం. ఆ అజ్ఞానమే జ్ఞానముని, మార్క్సిజమని, శాస్ర్తియమని, మానవాళికి విముక్తినందించే వరప్రదాయని అని, అన్ని సమస్యల పరిష్కారానికి మూలకందకమని.. ఇలా సవాలక్ష ఊహల పల్లకిలో ఊరేగడంవల్ల ఒరిగిందేమీలేదు. ఇంతదూరం ప్రయాణం చేసినా ఏ రకమైన ఫలితం లేదని స్పష్టంగా కనిపిస్తున్నా, ఎక్కడో ఏదో ఆశాకిరణం అగుపిస్తుందని, లేని ప్రకాశాన్ని ఊహించుకుని ఎడారి ప్రయాణం చేయడం మూర్ఖత్వమే తప్ప మరొకటి కాదు.
మార్క్సిజం బీజంలోగల అసంబద్ధతను, అమానవీయతను పట్టుకోలేనివారు ఎన్ని శతాబ్దాలు దానిపై మనసుపెట్టినా ఎన్ని సహస్రాలు దానికోసం ఉద్యమించనా ప్రయోజనం ఇసుమంత కూడా కనిపించదు. మనిషి మస్తిష్కాన్ని విస్తరించి కేవలం కర్మజలం గూర్చి కలవరించడం వల్ల ఫలితమేముంటుంది?…
స్ర్తి గర్భాన్ని, పురుషుని – స్ర్తి మస్తిష్కాన్ని, ఆ రసాయనిక చర్యను పట్టుకోవడం, సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అయినా మేం అర్థం చేసుకున్నాం, చరిత్రను ఇంతవరకు వ్యాఖ్యానించినవారే తప్ప మార్క్స్ సమస్యలకు పరిష్కారం చూపిన తొలి మేధావి అని కితాబునివ్వడం తమ భుజాలను తామే చరచుకోవడం తప్ప మరొకటి కాదు. మానవుని సమస్యలకు పరిష్కారం చూపిన 160 సంవత్సరాల అనంతరం ఆ సమస్యలు మరింత జటిలమయ్యాయి తప్ప పరిష్కారం కాలేదని తెలుస్తున్నప్పటికీ, చూస్తున్నప్పటికీ, ఎరుకలోకి వస్తున్నప్పటికీ అదే పాతపాట పాడటంలో ఏమైనా విజ్ఞత కనిపిస్తుందా?
మానవ మస్తిష్కాన్ని, అక్కడ జరిగే రసాయనిక చర్యల్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. దానిపై ఆధారపడి కొనసాగే జీవనాన్ని, వ్యవస్థల్ని మేం సంపూర్ణంగా అర్థం చేసుకుని, ఈ దారిలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం మానవ చరిత్రలో తొలిసారి మార్క్స్ మహానుభావుడు ఆవిష్కరించాడు. ఆ బాటలో నడుద్దాం.. రండి, రారండోయ్.. అని ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించడం వల్ల మానవ మస్తిష్కాన్ని అవమానించడమే జరిగింది తప్ప గౌరవించడం జరగలేదు. సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అసంఖ్యాక కార్మికుల – శ్రామికుల స్వర్గం ఏదీ వాస్తవరూపం దాల్చలేదు. కాని ఆ ఉన్మాదానికి కోట్లాదిమంది బలయ్యారు. ఉన్మత్తతో ఊగిపోయి మానవ మస్తిష్కానికి తలవంపులు తెచ్చారు.
చరిత్రలో అలాంటివారు అప్పుడప్పుడు అగుపిస్తారు. అందులోకి మార్క్స్ బోధనలు, రచనలు కూడా వస్తాయి. ఆ అసంబద్ధ బోధనలు, రచనలను మరింత మెరుగు పరిచామని ఆయన వీరాభిమానులు మరింత మొరటుగా ప్రవర్తించి, మానవీయతను పూర్తిగా విస్మరించి వీరంగం వేయడంవల్ల ఒరిగింది ఏమీ లేదు. మరింత అజ్ఞానాన్ని మూటగట్టుకోవడం, మస్తిష్కాలకు తాళాలు ఎలా వేయాలో తెలుసుకోవడం తప్ప! మార్క్సిజం ఒక మాద్యమం అన్నమాటను పూర్తిగా మానవాళి మరిచిపోయేలా చేయడానికి, అదే లక్ష్యంగా కత్తులు దూయడానికి తర్ఫీదు ఇవ్వడంలో ఆరితేరారు. అదే అత్యద్భుతమని, గొప్ప పరిణామమని భావించి గొప్పగా నటిస్తున్నారు. ఎవరైనా ఎంతకాలం నటిస్తారు? నటన, కృత్రిమత్వం చాలా తేలిగ్గా బయటపడుతుంది. మార్క్సిజంలోని డొల్లతనం సైతం చాలా సులువుగా తేటతెల్లమైంది, అవుతోంది.
మానవ మస్తిష్కం గొప్పదనం, విశ్వరూపం నాల్గవ పారిశ్రామిక విప్లవంలో కొంతమేర దర్శించవచ్చు. అనేక శ్ర్తాల కలయికతో, సాంకేతిక పరిజ్ఞానంతో, మానవుని ఆకాంక్షలు, అభిలాషలో నెరవేరే సందర్భంలో ఉన్నాం. కృత్రిమ మేధ సైతం ఈ మస్తిష్క ఆవిష్కరణ. దీన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలో తెలిసి ఉండాలి తప్ప తప్పుడు సూత్రీకరణలతో ఇది పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాద తొత్తులకు ఉపకరించే సాంకేతిక పరిజ్ఞానం, ఇది దోపిడీ స్వభావం గల విధానం, ఇది పూర్తిదా అమానవీయం అని ఎంత గగ్గోలు పెట్టినా దానికి మాన్యత లేదు. సాంకేతిక, శాస్త్ర అభివృద్ధి పరిణామాల్ని సైతం వర్గ దృక్పథంతో అంచనా వేసేవారిని ఎవరూ కాపాడలేరు. ప్రపంచంలో ప్రజలంతా ఆ దిశను ఆహ్వానిస్తున్నప్పుడు, మెజారిటీ ప్రజల నూతన ఆవిష్కరణలకు ఓటు వేస్తున్నప్పుడు, ప్రత్యామ్నాయం, ప్రత్యామ్నాయం అని పలవరించడంవల్ల ఒరిగేది ఏమీ లేదు. అంతిమంగా మార్క్సిజం వారి జ్ఞాన చక్షువులు విప్పారుతాయి. శ్రామికులకు, ప్రజలకు మేలు జరుగుతుంది! విఫల మాధ్యమాన్ని మార్చుకోవడం వల్ల మేలే తప్ప నష్టం కలగదు. దీన్ని విస్మరించి మార్క్సిజమే లక్ష్యమని భావించి కోటలు, పేటలు, బాటలు నడిచినా నవ్వులపాలు కావడం తప్ప మరొకటి జరగదు. వాస్తవాల్ని వాస్తవాలుగా చూడ్డం ముఖ్యం! అందుకు సన్నద్ధమవుదాం!
-వుప్పల నరసింహం.. 9985781799
(ఆంధ్రభూమి సౌజన్యం తో)