Home News భారతీయ మార్క్సిస్టుల మాయమాటలు!

భారతీయ మార్క్సిస్టుల మాయమాటలు!

0
SHARE

చెప్పినదాన్ని ఆచరించేవారు, ముఖ్యంగా రాజకీయాలలో ఎంతమంది ఉంటారు? మాటకు, చేతకు మధ్య అంతరం తీవ్రమయితే వ్యక్తిగత జీవితంలో విషాదం, సంఘ జీవితంలో విపత్కర పరిణామాలు అనివార్యంగా చోటు చేసుకుంటాయి. భగవంతుని సొంత నెలవు అయిన కేరళలో అధికారంలో ఉన్న మార్క్సిస్టులకు, ఇప్పుడు సరిగ్గా ఇదే సంభవిస్తోంది. ప్రజా జీవితంలో నిరాడంబరత ముఖ్యమని పదే పదే ఉద్ఘాటించే మార్క్సిస్టు నాయకుల అవినీతికర వ్యక్తిగత జీవితాల వికృత వాస్తవాలను ఇటీవలి సంఘటనలు బహిర్గతం చేశాయి.

2016 శాసనసభా ఎన్నికల్లో అప్పటి (కాంగ్రెస్‌ నేతృత్వంలోని) యుడిఎఫ్‌ ప్రభుత్వం పరాజయం పాలయింది. అధికారంలో అవినీతికి పాల్పడడం వల్లే యుడిఎఫ్‌ నాయకులను కేరళ ఓటర్లు తిరస్కరించారని మరి చెప్పాలా? ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ స్వయంగా కోట్లాది రూపాయల ముడుపులు తీసుకున్నారని, ఒక మహిళ (ఇప్పుడీమె జైలులో ఉన్నారు) మోహంలో పడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మార్క్సిస్టుల నేతృత్వంలోని ప్రత్యర్థి ఫ్రంట్‌ ఎల్‌డిఎఫ్‌ ఆరోపించింది. ఆ ఆరోపణను ప్రజలు విశ్వసించారు. ఆర్థిక మంత్రి కె.ఎమ్‌. మణి సైతం పదికోట్ల రూపాయల మేరకు లంచం తీసుకొని సంపూర్ణ మద్య నిషేధం చట్టాన్ని సవరించడానికి అంగీకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. యుడిఎఫ్‌ నాయకుల అవినీతి బాగోతాలను మార్క్సిస్టులు ప్రజల ఎదుట ఎండగట్టారు. దిగ్భ్రాంతికి గురైన ఓటర్లు యుడిఎఫ్‌ నేతలను ఇంటికి పంపించారు.

సరే, చెప్పిన మాటను ఆచరించినదెవరు? ఇప్పుడు మార్క్సిస్టుల వంతు వచ్చింది. అవినీతికి తావులేని పాలనను వీరు అందిస్తున్నారా? కరడుగట్టిన కమ్యూనిస్టు అయిన ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు వ్యతిరేకంగా అవినీతి, పక్షపాతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మంత్రిమండలి సభ్యులు ముగ్గురు ఇప్పటికే రాజీనామా చేశారు. మరో మంత్రి భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలలోని కీలక స్థానాల్లో సొంత బంధువులను నియమించారనే ఆరోపణలను ఆ మంత్రి మహాశయుడు ఎదుర్కొంటున్నారు .

కథ ఇంతటితో ముగియలేదు సుమా! కార్మిక వర్గ పార్టీ అయిన సిపిఎమ్‌ ఇటీవల మరింత ఘోరమైన ఆరోపణలకు లోనయింది. కేరళ సిపిఎం కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ (ఇదివరకటి లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో ద్వితీయ స్థానంలో ఉన్నారు) కుమారుడు ఒక అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. దుబాయిలోని ఒక పర్యాటక కంపెనీ నుంచి రూ.13కోట్లు రుణంగా తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో దుబాయి అధికారులు అతనిపై చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇటీవల ఒక ప్రముఖ మళయాళ వార్తా పత్రిక వెల్లడించింది. సదరు కంపెనీలో ఒక భారతీయ పౌరుడూ, ఒక అరబ్‌ భాగస్వాములుగా ఉన్నారని తెలిసింది.

బాలకృష్ణన్‌ కుమారుడు బినోయ్‌ ఇచ్చిన ఒక బ్యాంక్‌ చెక్‌ను దుబాయి బ్యాంకు తిరస్కరించడంతో ఈ సందేహాస్పద వ్యాపార ఒప్పందం బహిర్గతమయింది. ఆ వ్యాపార ఒప్పందం ఒక వ్యక్తికీ, ఒక వ్యాపార సంస్థకు మధ్య కుదిరింది గనుక దానితో తమ పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి విజయన్‌ స్పష్టం చేశారు. సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎస్‌.రామచంద్రన్‌ పిళ్ళై ఈ వ్యవహారంపై ఒక వివరణ ఇస్తూ ఇద్దరు వ్యక్తుల మధ్య విఫల వ్యాపార ఒప్పందానికి తమ పార్టీని తప్పు పట్టడం తగదని అన్నారు. ఆ ఒప్పంద భాగస్వాములలో ఒక వ్యక్తి తమ పార్టీ నాయకుడు ఒకరికి సమీప బంధువు అయినంత మాత్రాన జరిగిన అక్రమానికి తమ పార్టీ ఎలా బాధ్యత వహిస్తుందని ఆయన ప్రశ్నించారు.

ఈ వాదన హేతుబద్ధంగా ఉన్నదని చాలా మంది భావించారు. అయితే ఒక మంత్రి కుమారుడు పొందిన రుణంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేనిపక్షంలో రుణదాత ఎందుకు ముఖ్యమంత్రిని ఆశ్రయించారు? ఆ రుణాన్ని ఇస్తున్నందుకు గాను రుణదాతకు ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రయోజనం సమకూరుస్తామనే హామీ ఏదైనా ఇచ్చారా? అధికారంలో ఉన్న వ్యక్తులతో బంధుత్వాలను అడ్డు పెట్టుకుని రుణాన్ని పొందడానికి ప్రయత్నించే వారికి ఇచ్చే రుణాలకు రుణదాతలే బాధ్యత వహించాలని పిళ్ళై స్పష్టం చేశారు. బినోయ్‌కు రుణం ఇచ్చిన అరబ్‌ వ్యాపారి పర్యాటక రంగ వ్యాపారి అని వెల్లడయింది. ఆ రుణ లావాదేవీ చోటుచేసుకున్నప్పుడు బాలకృష్ణన్‌ కేరళ పర్యాటక మంత్రిగా ఉన్నారనేది గమనార్హం.

తాను ఇస్తున్న రుణానికి ప్రతిఫలంగా కేరళ మంత్రి తనకు ఏదైనా ప్రయోజనం సమకూరుస్తారని ఆ అరబ్‌ వ్యాపారి ఆశించి వుంటాడని భావించవచ్చు. ఏదైనా ఒక గల్ఫ్‌ దేశపు వర్క్‌వీసాకు చాలాపెద్ద మొత్తంలో చెల్లించుకోవల్సి వస్తుంది. ఆ వీసాకు ప్రయత్నిస్తున్న వారి నుంచి పర్యాటక వ్యాపారరంగంలో వున్న వారు చాలా పెద్ద మొత్తంలో వసూలు చేయడం కద్దు.

నిరాడంబర జీవనశైలి గురించి ఉపదేశించే మార్క్సిస్టు నాయకులు నిజానికి చాలా విలాసవంతంగా జీవిస్తున్నారని కేరళ వార్తా పత్రికలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి విజయన్‌ ఒక పార్టీ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రభుత్వ సొమ్ముతో ఒక హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారని ఒక పత్రిక పేర్కొంది. మరో మార్క్సిస్టు మంత్రి ఎనిమిది లక్షల రూపాయలు తమ పార్టీకి పెద్ద మొత్తమేమీ కాదని, త్వరలోనే ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తామని వ్యాఖ్యానించినట్టు కూడా ఆ పత్రిక పేర్కొంది.

మార్క్సిస్టుల సిరి సంపదల కథ కేరళకు మాత్రమే పరిమితం కాదు. పశ్చిమ బెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల పాటు ఈ కథ పునరావృతమవుతూనే ఉన్నది. చివరకు ప్రజలు వారిని అధికారం నుంచి తొలగించేంతవరకు అది కొనసాగింది. నిజానికి కమ్యూనిస్టు నాయకులు సిరిసంపదలను పోగుచేసుకొని రాజకీయ మద్దతును కొనుక్కోవడమనేది ఇప్పుడు ఒక అంతర్జాతీయ పరిణామంగా వర్ధిల్లుతున్నది.

చైనా అధ్యక్షుడు క్సిజిన్‌పింగ్‌ అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. మధ్య చైనాలోని ఒక నగరంలో బ్రిటిష్‌ వ్యాపారి ఒకరు తన హోటల్ గదిలో హత్యకు గురయ్యాడు. ఆ హత్యకు కారకులు కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఒక శక్తిమంతమైన నాయకుడు, అతని భార్య అని వెల్లడయింది. గత ఐదేళ్ళుగా ఈ ఇరువురూ జైలులో ఉన్నారు.

అక్రమార్జనలకు, కమ్యూనిజానికి మధ్య ఒక సహజ సంబంధమున్నది. చైనాలో దయాదాక్షిణ్యాలులేని కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వ పాలనలో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ వర్ధిల్లుతోంది. స్వతంత్ర న్యాయవ్యవస్థ, పత్రికా స్వాతంత్ర్యం కొరవడిన ఆ ‘సామ్యవాద’ దేశంలో అక్రమ సంపాదనా మార్గాలకు కొదవేమీ లేదు. జన చైనా వ్యవస్థాపకుడు, చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయక గణంలో అత్యంత ప్రముఖుడైన మావో విషయలంపటుడు. ఉత్తర కొరియాలో కిమ్‌ జోంగ్‌–ఉన్‌ కుటంబ నియంతృత్వ పాలన గురించి మరి చెప్పనవసరం లేదు.

కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు కేరళను 1958 నుంచీ తమ అధికారంలో ఉంచుకోవడంలో సఫలమవుతున్నాయి. ఇపుడు ఆ రెండు పార్టీల నాయకుల అవినీతి పూర్తిగా బహిర్గతమయింది. తమ పాలకులను నిర్ణయించుకోవడంలో కేరళ ఓటర్లకు ఆ రెండు పార్టీలు లేదా వాటి నేతృత్వంలోని ఫ్రంట్‌లే గత్యంతరమా? మీ ఊహ నా అంచనాతో కచ్చితంగా ఏకీభవిస్తుందని నిశ్చితంగా చెప్పగలను.

బల్బీర్‌ పుంజ్‌

(వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు)

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)