Home News క్రైస్తవ మత మార్పిడి కారణంగా పక్కదారి పడుతున్న రిజర్వేషన్లు

క్రైస్తవ మత మార్పిడి కారణంగా పక్కదారి పడుతున్న రిజర్వేషన్లు

0
SHARE
Representative image

స్వాతంత్ర్యానంతరం ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వం కోసం రిజర్వేషన్ల విధానం అమలులోకి వచ్చింది. అయితే ఈ రిజర్వేషన్ల అమలు వివిధ ఆటంకాల మధ్య సత్ఫలితాలు సాధించలేకపోతోంది. రాజ్యాంగం నిర్దేశించిన దళిత, గిరిజన రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాకపోయేందుకు నియంత్రణ లేని మాతమార్పిడులే కారణం. దళిత, గిరిజన రిజర్వేషన్ విధానాన్ని నియమ నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకత పాటించకపోవడంతో విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. నిజమైన దళిత, గిరిజన వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్లను మతం మారిన వారు అక్రమంగా దక్కించుకొంటున్నారు. ఇందులో మిషనరీల పాత్ర కీలకంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విచారణ జరపకుండానే రెవిన్యూ అధికారులు దళిత, గిరిజన కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా మతంమారిన వారు దళిత, గిరిజన కుల దృవీకరణ పత్రాలతో ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ రిజర్వుడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, తాను క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తినని తన పెళ్లి క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం జరిగిందని ఓ బహిరంగ సభలో చెప్పుకొన్నారు. చట్టసభల ఎన్నిలలోనే పరిస్థితి ఇలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఉహించవచ్చు. రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మతంమారిన క్రైస్తవులకు దక్కేలా జి.ఓ.25 జారీ చేసి నిజమైన దళిత, గిరిజనులను మోసం చేస్తోంది.

మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలంలో కొండ నరేష్ అనే సామాజిక కార్యకర్త, ఆ మండలంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారు లబ్ధిదారులుగా ఉన్నారా? అని రెవిన్యూ అధికారులకు సమాచార హక్కు చట్టం కింద సమాధానం కోసం దరఖాస్తు చేశారు. దానికి సంబంధిత అధికారులు.. మండలంలో 19 చర్చిలు, 8మంది క్రైస్తవులు ఉన్నారని సమాధానమిచ్చారు. ఒక గ్రామంలో చర్చి నిర్మాణం జరగాలంటే కనీసం 30 కుటుంబాలు క్రైస్తవులగా ఉండాలి. మరి, ఇక్కడ 19 చర్చిలకు గాను 8 మంది క్రైస్తవులు ఎలా ఉంటారు? ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద క్రైస్తవ జనాభా ఎంతో లెక్కలు లేవు. చర్చిలకు పాలకమండళ్లు లేవు. చర్చిల నిర్వహణ, చట్టబద్ధతపై మైనారిటీ శాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదు. మతంమారిన క్రైస్తవులను గురించే ప్రయత్నం ప్రభుత్వం చేయడంలేదు. నిజమైన దళిత, గిరిజనులకు దక్కాల్సిన రిజర్వేషన్లను ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించి వారి భవిష్యత్తుతో చెలగాటం అడుతున్నాయి.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ద్వారా జీవం పోసుకున్న రిజర్వేషన్ల విధానం ఎన్నో కోట్లమంది జీవితాలకు దశా దిశా చూపింది. నిజానికి 1935 లోనే షెడ్యూల్డ్ కులాలు–తెగల జాబితా తయారై 1936లో రిజర్వేషన్లను బ్రిటీష్ పార్లమెంటు ఆమోదించింది. అప్పుడు కూడా ఆంగ్లేయులు క్రైస్తవులుగా మారిన వారికి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ కల్పించలేదు. మతం మారిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి షెడ్యూల్డ్ కులాల వ్యక్తిగా పరిగణింపబడజాలడని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ 1977లో తీర్పునిచ్చింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్డ్ కులాలవారు షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను పొందజాలరని సుప్రీంకోర్టు 1986లో తీర్పునిచ్చింది. అలాగే విద్యాశాఖ ఉత్తర్వు జి.ఓ.యం.ఎస్ 1973 ప్రకారం.. క్రైస్తవ మతం పుచ్చుకున్న ఎస్సీలు బిసి-(సి)గాను, ముస్లిం మతం పుచ్చుకున్న ఎస్సీలు ఎస్సీలు ఓసీలుగా, క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ఎస్టీలు ఓసీలుగా పరిగణింపబడతారు.

రంగారెడ్డిజిల్లా శంషాబాద్‌కి చెందిన గంటీల జాన్ అలియాస్ జానయ్య అనే వ్యక్తి క్రైస్తవుడుగా మతం మారిన తరువాత కూడా షెడ్యులు కులస్తుడుగా చలామణి అవుతున్నట్టు ఫిర్యాదురాగా ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపి ఎస్సీ సర్టిఫికెట్ తొలగించి బీసీ(సి)సెర్టిఫికెట్ ఇచ్చింది. ఇది చాలా చిన్న విషయంలా కనిపించినప్పటికీ దీనివెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉంది. మతమార్పిడి వల్ల కూడా హిందూ జనాభా తగ్గిపోతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తరువాత ఈ విదేశీ దురాక్రమణ స్వరూపం మారింది. నేరుగా దాడి చేయడానికి అవకాశంలేక పరోక్షపద్ధతులు ఎంచుకుంటున్నారు. హిందువులను క్రైస్తవంలోకి మార్చడం ద్వారా తమ జనసంఖ్యను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల, తెగల రిజర్వేషన్లతో అనుభవించాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్ మెంట్, బ్యాంక్ రుణాలు, ఉద్యోగాలు, కార్పొరేషన్ రుణాలు, రిజర్వుడ్ స్థానాలలో పోటీ, దళిత, గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర చేపడుతున్న పథకాలలో రిజర్వేషన్లను హిందూ ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వర్తింపచేయాలి. లేనిపక్షంలో రాబోయేరోజుల్లో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

కొట్టె మురళీకృష్ణ

బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో )