పెద్దనోట్ల రద్దు వల్ల ధరలు తగ్గుతాయి. పన్నుల ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఉగ్రవాదం, తీవ్రవాదం కోరలు పీకినట్లవుతుంది. ఆర్థిక వ్యవస్థపై కొద్దిమంది పెత్తనం సమసిపోతుంది. మోదీ సర్కార్ నిర్ణయం వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్నిమాత్రమే.
భారతదేశంలో అధికార, ప్రజాస్వామ్య వ్యవస్థలకు విఘాతంగా పరిణమించిన నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే ప్రకటించిన యుద్ధం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విప్లవాత్మక నిర్ణయం. అవినీతి, అక్రమాలపై ఆధారపడ్డ వ్యవస్థల్ని, వ్యక్తుల్ని ఈ నిర్ణయం కుప్పకూల్చిందనే చెప్పాలి. చట్ట వ్యతిరేకంగా లక్షల కోట్ల రూపాయలను నిల్వచేస్తూ, అక్రమ మార్గాల్లో తరలిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికీ, ప్రజాస్వామ్యానికే విలువలేకుండా చేస్తున్న నల్లధన బకాసురుల నగ్న స్వరూపం ఈ నిర్ణయంతో బట్టబయలు అయింది. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదానికి మధ్య గత ఏడు దశాబ్దాలుగా ఏర్పడిన అపవిత్ర బంధానికి ఇప్పుడు చాలా వరకు నూకలు చెల్లాయి. మన ఆర్థిక వ్యవస్థనే కాకుండా మన రాజకీయ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఒక దుర్మార్గానికి మోదీ తెర వేశారు. నల్లధనం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక స్వరూపాన్నే దెబ్బతీసేంత భయానకమైన పరిస్థితికి దారితీసిందని ప్రధానమంత్రి స్వయంగా తన ప్రసంగంలో తెలిపారు. దేశం అభివృద్ధి మార్గంలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఒక బలమైన, నిర్ణయాత్మకమైన చర్య తీసుకోవాల్సిన అవసరం అయిందని ఆయన చెప్పారు. ఈ దేశంలో అక్రమ ఆర్థిక కార్యకలాపాలు దేశ వ్యవస్థకు చెదలు పట్టినట్లుగా పట్టాయి. అవినీతి, అక్రమ కార్యకలాపాల వల్ల గుప్పెడుమంది వ్యక్తులు వేలకోట్లకు పడగెత్తుతుంటే నిజాయితీతో బతకాలనుకుంటున్న ప్రజలు పేదరికం, ఆకలి, అణచివేత, అన్యాయాలకు గురికావల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనలు, చట్టాలకు తిలోదకాలిచ్చి, రాయితీలు, పైరవీలు, మినహాయింపులు, దందాల ద్వారా బతుకుతున్న నికృష్ట పెద్దమనుషులదే రాజ్యంగా మారింది.
నల్లధనం ఎన్ని దారుణాలకు దారితీసి మన ప్రజాస్వామ్య వ్యవస్థనే అతలాకుతలం చేసిందని? ఉగ్రవాదం, తీవ్రవాదం, ఉన్నత స్థాయిలో అవినీతి, ఓట్ల బేరసారాలు, ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, అక్రమ మైనింగ్, కిడ్నాపింగ్, బ్లాక్ మెయిలింగ్, మాదక ద్రవ్య వ్యాప్తి, అటవీ ఉత్పత్తుల స్మగ్లింగ్, వ్యభిచారం, ఆడపిల్లల అమ్మకం, హత్యలు, దోపిడులు… వీటన్నిటికీ మూలం అక్రమ సంపాదన, నల్లధనం. ప్రజాస్వామ్యంలో ప్రతి నిర్ణయాన్నీ నల్లధనం ప్రభావితం చేసే పరిస్థితి దాపురించింది.అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ప్రధాని మోదీ నల్లధనంపై తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే నల్లధనంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక పరిశోధక బృందం (ఎస్‌ఐటీ) ఏర్పర్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత మొత్తం బ్యాంకు ఖాతాలను సార్వత్రికం చేసి ప్రజలను బ్యాంకులకు అందుబాటులో తేవాలని ఆయన నిర్ణయించారు. జన ధన యోజన ఉద్దేశం అదే. ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు ఆయన వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఒక ఉద్యమంలా నిర్వహించారు.
ఇప్పుడు గ్రామాల్లో కూడా బ్యాంకు ఖాతాలు ఉండడం వల్ల పెద్ద నోట్ల రద్దు వల్ల సాధారణ గ్రామీణులకు పెద్దగా బాధ కలగకుండా ఉండేందుకు ఈ చర్య తోడ్పడింది. బ్యాంకు ఖాతాలే లేకపోతే సామాన్యులు ఎన్నో బాధలకు గురయ్యేవారు. జనధన యోజన పథకం ద్వారా ఈ దేశంలో 25.45 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచారు. వీటిలో అత్యధికం గ్రామాల్లోనే ఉన్నాయి. దాదాపు 45,302.48 కోట్లు ఇవాళ బ్యాంకుల్లో చేరాయంటే జనధనయోజన పుణ్యమే. ఇంతటితో ఊరుకోకుండా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ప్రధాని ఎన్నో చర్యలు తీసుకున్నారు. పన్నులను ఎగ్గొట్టి జమ చేసిన లక్షల కోట్ల నల్లధనానికి స్వర్గ ధామాలుగా మారిన మారిషస్, స్విట్జర్లాండ్ వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మారిష్‌సతో ద్వంద్వ పన్నులకు అవకాశం లేకుండా చేసేందుకు ఒడంబడిక కుదుర్చుకుంటే స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. విదేశీ ఖాతాదారుల గురించి సమాచారం ఇచ్చేందుకు ఆర్థిక సహకార, అభివృద్ధి (ఓఇసీడీ) దేశాలు కూడా అంగీకరించాయి.
అంతేకాదు, 2015లో నల్లధనం (వెల్లడించని విదేశీఆదాయం, ఆస్తుల), పన్నువిధింపు చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం క్రింద ప్రకటించిన పథకం సెప్టెంబర్ 2015లో ముగిసింది. వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇది వీలు కల్పించింది. 20వేలకు మించిన నగదుతో చేపట్టిన రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై 20 శాతం పెనాల్టీ విధిస్తూ చర్యలు తీసుకున్నారు. రూ. 2 లక్షలకు మించి నగదు అమ్మకాలపై మూల స్థాయిలోనే పన్నువసూలు చేసేందుకు నిబంధనలు విధించారు. బినామీ వ్యవహారాలను నిషేధిస్తూ చట్టాన్ని ఆమోదించారు. 2016 నవంబర్ నుంచి ఇది అమలులోకి వస్తుంది.
అంతటితో ఆగకుండా నల్లధనాన్ని వెల్లడించి, స్వచ్ఛంగా ముందుకు రావాలని, దానిపై 45 శాతం మేరకు పన్ను, పెనాల్టీ చెల్లించాలని ప్రభుత్వం 2016లో రెండు సార్లు అవకాశాలనిచ్చింది. తాజా అవకాశం సెప్టెంబర్ 30తో ముగిసింది. గత జూన్‌లో చేసిన తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో కూడా నల్లధనాన్ని వెల్లడించడానికి చివరి అవకాశాన్నిస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుని ఇప్పటికే రూ.65,350 కోట్ల మేరకు నల్లధనాన్ని వెల్లడించి పన్నులు, పెనాల్టీ కట్టిన వారు ఉన్నారు. కానీ జరిగిన కొన్ని లక్షల కోట్ల లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే అంచనాలకు అనుగుణంగా వెల్లడైన నల్లధనం తక్కువే. అందుకే ప్రధాని మూడోకన్ను తెరవాల్సి వచ్చింది. ఇవాళ ఆయన ఉన్నట్లుండి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారని ఎవరైనా అంటే వారు ఇప్పటివరకూ నరేంద్రమోదీ ఏదిశన చర్యలు తీసుకుంటున్నారో గ్రహించలేని అమాయకులే కావాలి.
ఈ చర్యలు చూసిన వారెవరైనా ఇంకా ప్రధాని మోదీది సూట్ బూట్ సర్కార్ అని కానీ, సంపన్నుల అనుకూల సర్కార్ అని కానీ విమర్శిస్తే వారిని పగటిపూట వెలుగును చూడలేని దివాంధులుగానే భావించాలి. అంతేకాదు అధికారంలోకి వచ్చిన నాటినుంచీ పేద ప్రజలకు అనుకూలంగా మోదీ ఎన్నెన్ని పథకాలు, చర్యలు ప్రవేశపెట్టారని? ఆర్థిక సేవలను సామాన్యులకు అందుబాటులో తెచ్చే జన ధన యోజనే కాదు, ఆడపిల్లల భవిష్యత్తును సురక్షితం చేసే సుకన్యా సమృద్ధి యోజన, అతి చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించే ముద్రా యోజన, దేశ పౌరులందరికీ జీవిత బీమా ద్వారా ప్రయోజనం చేకూర్చే జీవన జ్యోతి బీమా యోజన, ప్రమాద బీమా కల్పించే సురక్షా బీమా యోజన, ఏ పింఛను పథకం కిందకు రాని అసంఘటిత రంగంలోని కోట్లాదిమందికి ప్రయోజనం చేకూర్చే అటల్ పింఛన్ యోజన, 2022 సంవత్సరం నాటికల్లా పట్టణాల్లో 2 కోట్ల మందికీ, గ్రామాల్లో 3 కోట్ల మందికీ గృహవసతి కల్పించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రజాప్రతినిధుల ద్వారా గ్రామాల్లో సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేసే సంసద్ ఆదర్శ్ గ్రామయోజన, రబీ, ఖరీఫ్ పంటల నష్టాన్ని పూడ్చే ఫసల్ బీమా యోజన, ప్రతి పంటకూ నీరు కల్పించే ప్రధానమంత్రి గ్రామ సింఛాయి యోజన, పేదప్రజల సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలుచేసే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, అతి తక్కువ రేట్లతో ప్రజలకు ఔషధాలు, మందులు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రధానమంత్రి జన ఔషధీ యోజన, చిన్న పెట్టుబడిదారుల భద్రతకోసం కిసాన్ వికాస్ పత్ర, తమ పొలాల్లో పోషక సామర్థ్యం, ఎరువుల అవసరాన్ని నిర్ధారించే నేల ఆరోగ్య కార్డు పథకం (సాయిల్ హెల్త్ కార్డ్), పడిపోతున్న బాలికా శిశు నిష్పత్తిని తగ్గించి మహిళల సంక్షేమానికి పలు చర్యలు తీసుకునే బేటీ పడావో, బేటీ బచావో, పిల్లలకే కాక తల్లులను కూడా రోగాలనుంచి విముక్తి చేసేందుకు ప్రవేశపెట్టిన మిషన్ ఇంద్రధనుష్ టీకాల కార్యక్రమం, గ్రామాల్లో నిరంతరం విద్యుత్ అందజేసేందుకు దీనదయాళ్ గ్రామ జ్యోతి యోజన, గ్రామీణ యువతకు నైపుణ్యాన్ని పెంచే దీనదయాళ్ గ్రామీణ్ కౌశల్య యోజన, కార్మికులకు పారదర్శక, జవాబు దారీ పద్ధతి ద్వారా ఉపాధి కల్పించే శ్రమయేవ జయతే యోజన ఇలా ఎన్ని పథకాల గురించి చెప్పినా తక్కువే అవుతుంది. ఇవన్నీ సామాన్యుల, పేదల, మహిళల, పిల్లల, యువకుల, రైతుల అభ్యున్నతి కోసమే. వీటిగురించి తెలిసిన తర్వాత కూడా ఎవరు అనగలరు నరేంద్రమోదీది పేద ప్రజలకు అనుకూల ప్రభుత్వం కాదని?
తాజాగా పెద్దనోట్ల రద్దు వల్ల ధరలు తగ్గుతాయి. ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగించేందుకు వీలు కలుగుతుంది. గృహ నిర్మాణం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఉగ్రవాదం, తీవ్రవాదం కోరలను పీకినట్లవుతుంది. మన దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం ఆటకట్టినట్లవుతుంది. ఆర్థిక వ్యవస్థపై కొద్దిమంది పెత్తనం సమసిపోతుంది. మోదీ సర్కార్ నిర్ణయం వల్ల ప్రజలకు చేకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే.
నిజానికి నరేంద్రమోదీ గత రెండేళ్లలో తీసుకుంటున్న చర్యల కొనసాగింపుగానే ఈ బృహత్తర నిర్ణయం తీసుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా మొత్తం దేశమంతా నల్లధనం, అవినీతి, అక్రమాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదించి మోదీ సర్కార్‌ను అధికారంలోకి తీసుకువచ్చింది ఆ పాలకులు పాల్పడిన అవినీతి, చేసిన కుంభకోణాల వల్లే. అందుకే లోక్‌సభలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యాబలానికి ఒక జాతీయ పార్టీ దిగజారింది. అయినప్పటికీ ఈ విషయాన్ని విస్మరించి నరేంద్రమోదీ అవినీతిపై చేస్తున్న యుద్దాన్ని ప్రధాన ప్రతిపక్షం వారు విమర్శిస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు చేయడంపై ఒక జాతీయ పార్టీ ప్రతినిధి వ్యాఖ్యానిస్తూ మోదీని ఆధునిక కాలపు తుగ్లక్‌గా అభివర్ణించారు. ఈ విషయంలో కూడా వారు తమ మతతత్వ వైఖరిని ప్రదర్శించారు. ఇంతకంటే దుర్మార్గమైన వ్యాఖ్య ఉండదు. ప్రజలు అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన గత ప్రభుత్వాల్ని చూశారు. ఇప్పుడు నరేంద్రమోదీ అవినీతి రహిత స్వచ్ఛమైన పాలనను చూస్తున్నారు. అవినీతిపై మోదీ యుద్ధం నిజానికి ఇప్పుడే ప్రారంభమైంది. మున్ముందు అవినీతి, అక్రమాలపై మోదీ సర్కార్ ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేసి వాటిని పెంచిపోషించిన వారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పదు. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తాత్కాలికంగా కొంతమందికి కొన్ని అసౌకర్యాలు కలిగినా దేశం కోసం వాటిని భరించి అవినీతిపై ఆయన పోరాటానికి ప్రజలు మనస్ఫూర్తిగా మద్దతునిస్తారనడంలో సందేహం లేదు.
– ముప్పవరపు వెంకయ్యనాయుడు
కేంద్ర సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి మంత్రి
(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో)