Home News ఎంకౌంటర్లో 17 మంది జవాన్లు మృతి

ఎంకౌంటర్లో 17 మంది జవాన్లు మృతి

0
SHARE

ఛత్తీస్ఘడ్: సుక్మా జిల్లాలో మావోయిస్టులు – జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. మార్చి 21 శనివారం నాడు జిల్లాలోని ఎల్మగూడ అటవీ ప్రాంతంలో  ఈ దాడి చోటుచేసుకుంది. మృతి చెందిన జవాన్లలో అధికంగా జిల్లాకు చెందిన రిజర్వ్ గార్డులతో పాటు గతంలో మావోయిస్టులుగా పనిచేసి లొంగిపోయి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సభ్యులుగా పనిచేస్తున్న యువకులు ఉన్నారు.

ఎన్ కౌంటర్లో మరణించిన 17 మంది జవాన్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్టు ఛత్తీస్ఘడ్ డీజీపీ దుర్గేష్ మాధవ్ తెలిపారు. గాయపడిన మరో 15 మంది జవాన్లను  రాయపూర్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ పోలీస్ అధికారిని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కధనం ప్రకారం.. ఎక్కువ సంఖ్యలో మావోయిస్టుల సంచారంపై అందిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు శనివారం రాత్రి సమయంలో 150 మందితో కూడిన సీఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా దళాలు, స్పెషల్ టాస్క్ ఫోర్సుతో పాటు జిల్లా రిజర్వ్ గార్డ్ సభ్యులు అటవీప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఇది ముందుగానే పసిగట్టిన మావోయిస్టు సభ్యులు జవాన్లు చేరుకునే ప్రదేశంలో ఐఈడీ పేలుడు పదార్ధాలు అమర్చినట్టు తెలుస్తోంది. జవాన్లు సరిగ్గా పేలుడు పదార్ధాలు అమర్చిన ప్రదేశానికి చేరిన వెంటనే  మావోయిస్టులు హఠాత్తుగా కాల్పులు ప్రారంభించారు.

తమపై హఠాత్తుగా జరిగిన ఈ కాల్పుల నుండి తేరుకున్న జవాన్లు వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించారు. సుమారు గంటన్నర పాటు ఈ ఎన్ కౌంటర్ కొనసాగింది. ఈ కాల్పుల అనంతరం 12 మంది జిల్లా రిజర్వ్ గార్డ్ అధికారులతో పాటు 17 మంది జవాన్లు కనిపించకుండా పోయిన విషయాన్ని పోలీసులు కనుగొన్నారు. స్థానిక గిరిజన తెగలకు చెందిన సభ్యులు ఉన్న రిజర్వ్ గార్డ్ అధికారులకు ఈ అటవీ ప్రాంతంలో బలమైన పట్టు ఉన్నందున  తిరిగి  బేస్ క్యాంపునకు చేరుకుంటారని తొలుత భావించినప్పటికీ అది జరగలేదు. దీంతో సీఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా దళాలు ఆదివారం అటవీప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.

 శనివారం నాటి ఘటనను దృష్టిలో ఉంచుకుని అత్యంత కట్టుదిట్టమైన రక్షణ చర్యలతో గాలింపు జరిపిన కోబ్రా దళాలు డ్రోన్ కెమెరాల సహాయం కూడా తీసుకున్నాయి. మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురిసి గాలింపు చర్యలకు కాస్త ఆటంకం ఏర్పడినప్పటికీ.. చివరికి 17 మంది జవాన్ల మృతదేహాలు కనుగొన్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు మరణించిన జవాన్ల నుండి తేలికపాటి మెషిన్ గన్లతో పాటు 14 అస్సాల్ట్ రైఫిళ్లు, మరికొన్ని ఆయుధాలు దొంగలించుకుపోయినట్టు గుర్తించారు.

అటవీ ప్రాంతంలో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు పనిచేస్తున్న జిల్లా రిజర్వ్డ్ గార్డ్ దళానికి ఇది మొదటి భారీ ఎదురుదెబ్బ. ఈ విభాగంలో ఎక్కువగా స్థానిక గిరిజన యువకులు, మావోయిస్టులతో కలిసి పనిచేసిన అనంతరం లొంగిపోయిన వారు ఎక్కువగా ఉంటారు. 2017లో ఛతీస్ఘడ్ చింతగుఫ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనిలో నిమగ్నమైన సీఆర్పీఎఫ్ దళాలపై మావోయిస్టులు జరిపిన మెరుపు దాడి అనంతరం ఇదే పెద్ద ఘటన.