Home Telugu Articles 1857 స్వతంత్ర్య సంగ్రామం – ఒక దేశవ్యాప్త ఉద్యమం

1857 స్వతంత్ర్య సంగ్రామం – ఒక దేశవ్యాప్త ఉద్యమం

0
SHARE

– శ్రీధర్ పరాండ్కర్

1857 స్వతంత్ర్య సంగ్రామం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన అద్భుతమైన ఘటన. ఒకరకంగా ఇది మొత్తం ప్రపంచాన్ని కదిలించివేసింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయులంతా కలిసికట్టుగా చేసిన పోరాటం అది. ఈ సంగ్రామంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంగ్లేయులు మారణకాండకు మాత్రమేకాక దోపిడీకి కూడా పాల్పడ్డారు. ఏడాదికంటే ఎక్కువకాలం ఈ పోరాటం సాగింది.

ఈ స్వతంత్ర్య సంగ్రామం కేవలం ఉత్తర భారతానికే పరిమితమైందనే అపోహ ప్రచారం చేశారు. నిజానికి దేశమంతా ఈ సంగ్రామంలో పాల్గొంది. సైనికులు, సామంత రాజులు, రైతులు, కార్మికులు, మహిళలు, మేధావులు…ఇలా అన్ని తరగతులు, వర్గాలకు చెందిన ప్రజలు బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. `హిస్టరీ ఆఫ్ అవర్ ఓన్ టైమ్స్’ అనే పుస్తకంలో మెకార్తీ ఇలా వ్రాశాడు – “వాస్తవం ఏమిటంటే హిందూస్థాన్ లోని ఉత్తర, వాయువ్య ప్రాంతాలన్నీ ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి.’’

1857 స్వతంత్ర సంగ్రామం కేవలం కొద్ది మంది రాజులు, సైనికులు చేసిన `తిరుగుబాటు’కాదు. ఆ ప్రయత్నం విఫలమై ఉండవచ్చునుకానీ అది భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపింది. అమానుషమైన దమననీతి, పాశవికత చూపినప్పటికి బ్రిటిష్ పాలకులు భారతీయులలో ఉవ్వెత్తున ఎగసిపడిన స్వాతంత్ర్య జ్వాలను పూర్తిగా ఆర్పలేకపోయారు.

స్వాతంత్ర్యాన్ని పొందేందుకు భారతీయులు చేసిన ప్రయత్నాన్ని ఆంగ్లేయ పాలకులు పూర్తిగా అణచివేయగలిగారని ప్రచారం చేస్తుంటారు. నిజానికి స్వాతంత్ర్య సముపార్జ కోసం భారతీయులు కలిసికట్టుగా చేసిన మొట్టమొదటి ప్రయత్నమే 1857 సంగ్రామం. చివరికి బ్రిటిష్ వారి దేశం వదిలిపోయేవరకు ఆ పోరు సాగుతూనే ఉంది.

ఈ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వారంతా మనకు వందనీయులే.

” పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనే శక్తిసామర్ధ్యాలు లేనివారు ‘ఓ భగవంతుడా నా మాతృభూమి బానిస సంకెళ్ళ నుంచి విముక్తం అయ్యేట్లు చూడు’ అని ప్రార్ధించి ఉంటారు. వాళ్ళు కూడా ఈ సంగ్రామంలో పాల్గొన్నవారే. వారికి కూడా ఇందులో స్థానం ఉంది’’ అని స్వాతంత్ర్య వీర సావర్కర్ అన్నారు.

‘ ఏ సర్వే ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ అనే పుస్తకంలో సర్దార్ పణిక్కర్ ఇలా వ్రాసారు – ” దేశ ప్రజలందరిది ఒకే లక్ష్యం – బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్ళగొట్టి స్వాతంత్ర్యం సముపార్జించడం. కాబట్టి ఆ పోరాటాన్ని `తిరుగుబాటు’ అనలేము. అది ఒక మహా జాతీయోద్యమం.’’

శివపురిలో న్యాయమూర్తి ముందు తాంత్యా తోపే ఇలా గర్జించారు –  ” విదేశిపాలకులకు వ్యతిరేకంగా పోరాడితే ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తుందని నాకు తెలుసు. నాకు ఏ న్యాయస్థానం అవసరం లేదు. ఎక్కడా నా వాదనలు వినిపించే అవసరం అంతకంటే లేదు.’’

వాసుదేవ బల్వంత ఫడ్కే – ” ఓ భారతీయులారా! నేను కూడా దధీచి మహర్షిలా శరీరాన్ని ఎందుకు అర్పించకూడదు? నా ఆత్మసమర్పణ ద్వారా మీ దుఃఖాన్ని, బానిసత్వాన్ని తొలగించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? మీ అందరికీ ఇవే నా అంతిమ ప్రణామాలు.’’

1879 నవంబర్ సంచికలో ” అమృత్ బజార్ పత్రిక ” వాసుదేవ బల్వంత ఫడ్కే గురించి ఇలా వ్రాసింది –  “ఈ ప్రపంచంలో మహత్తర కార్యాలు నెరవేర్చడానికి భగవంతుడు పంపే వ్యక్తులలో ఉండే అధ్భుతమైన గుణాలన్నీ ఆయన ఉన్నాయి. ఆయన దేవ దూత.’’

భారతదేశపు క్రైస్తవీకరణ

భారతదేశాన్ని పూర్తిగా క్రైస్తవ దేశంగా మార్చాలని ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది. సైనిక స్థావరాల్లో క్రైస్తవ మిషనరీలు రాముడు, కృష్ణుడు, వేదాలతోపాటు ఖురాన్, మహమ్మద్ గురించి దుర్భాషలు ఆడేవారు. వీరి మాటలకు నిరసన వ్యక్తం చేసిన సైనికులను శిక్షించేవారు. ఈ క్రైస్తవీకరణ, మతమార్పిడి పద్దతుల పట్ల సైనికుల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి పెరిగాయి. ప్రభుత్వ సహకారంతో క్రైస్తవ మిషనరీలు విచ్చలవిడిగా తమ కార్యకలాపాలు సాగించేవారు.

భారతదేశంలో క్రైస్తవ కార్యకలాపాల గురించి ఈస్ట్ ఇండియా కంపెనీ అధ్యక్షుడు లండన్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో ఇలా చెప్పాడు – ” భగవంతుడు దయతో విశాల భారతదేశాన్ని ఇంగ్లండ్ కు అప్పచెప్పాడు. హిందూస్థాన్ లో ఈ మూలనుంచి ఆ మూలకు క్రైస్తవ ధ్వజం ఎగరాలని అలా చేశాడు. కాబట్టి మనలో ప్రతిఒక్కరు హిందూస్థాన్ ను క్రైస్తవ దేశంగా మార్చే పవిత్ర కార్యంలో శాయశక్తులా కృషి చేయాలి. ఆ కార్యాన్ని పూర్తి చేయాలి.’’

సైనిక స్థావరాలను మతమార్పిడి కేంద్రాలుగా మార్చేశారు. బెంగాల్ కు చెందిన ఒక సైనికాధికారి తన నివేదికలో ఇలా వ్రాశాడు – ” నేను గత 28 ఏళ్లుగా సైనికులను మతం మార్చే పని చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈ సైనికులను సైతాను పంజా నుంచి విడిపించి ఏసు రక్షణలోకి తీసుకురావడం నా సైనిక కర్తవ్యంగా భావిస్తున్నాను.’’

దక్షిణ భారతంలో స్వతంత్ర సంగ్రామం

ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం మొత్తం దేశంలో ఒకే మాదిరిగా సాగింది. కేవలం ఉత్తర భారతానికే పరిమితం కాలేదు. దక్షిణ భారతంలో జరిగిన పోరాటంలో ముఖ్య ఘట్టాలు :

డిసెంబర్, 1856 సతారాలో రంగోజీ బాపు సాయుధ పోరాటం
మే, 1857లో పూనాలో సాయుధ విప్లవం
మే, 1857 ముంబై సైనిక స్థావరంలో తిరుగుబాటు
ఖానాదేశ్ లో భీమా నాయక్ నేతృత్వంలో సిర్పూర్ పై దాడి
జులై, 1857 కొల్హాపూర్ 27 పల్టన్ తిరుగుబాటు
ఆగస్ట్, నవంబర్ 1858లో కార్గుండ్ పై తాంత్యా తోపే దాడి
అక్టోబర్, నవంబర్, 1858 నాసిక్ లో భాగోజీ నాయక్ నేతృత్వంలో దాడి
డిసెంబర్, 1857లో త్ర్యయంబకేశ్వర్ లో జోగ్లెకర్ నాయకత్వంలో బ్రిటిష్ సేనపై దాడి
మార్చ్, 1858 బీఢ్ లో ఆంగ్లేయ సేనలను తరిమికొట్టిన భారతీయులు
1858-59లో సావంత్ వాడిలో తిరుగుబాటు
ఫిబ్రవరి, 1857లో పర్లాకిమిడి (ఆంధ్ర)లో రాధాకృష్ణ దండసేన్ నాయకత్వంలో సాయుధ పోరు
జూన్, 1857 కడప (ఆంధ్ర)లో 30 వ పల్టన్ తిరుగుబాటు
జూన్ లో హైదారాబాద్ లో మొదటి ఆశ్వికదళ తిరుగుబాటు
జులై, 1857లో మచిలీపట్నంలో స్వతంత్ర ధ్వజం ఆవిష్కరణ. రాజమండ్రిలో విప్లవం
జగ్గయ్యపేటపై దాడి
జమాఖిండి, బీజాపూర్ లలో ఉద్యమం
1859-60 లో ఔరంగాబాద్, బీజాపూర్ లలో బ్రిటిష్ సేనపై దాడి
ఫిబ్రవరి, 1857 హోరాపూర్ లో బ్రిటిష్ సైన్యంపై భారతీయుల దాడి
1859లో నిజాం సభలోనే డేవిడ్సన్ పై దాడి
1867 సతారాలో ఛత్రపతి సాహు మేనల్లుడు రామారావు నేతృత్వంలో బ్రిటిష్ సైన్యంపై దాడి
నవంబర్, 1857 ముఘోల్ లో బ్రిటిష్ సేనపై దాడి
1858 మైసూర్ రాజ్యంలో బ్రిటిష్ వ్యతిరేక ప్రదర్శన
జులై 1858 బెంగళూర్ లో మద్రాస్ 8 వ పల్టన్ తిరుగుబాటు
1857 బెల్గావ్ కు చెందిన 29వ పల్టన్ తిరుగుబాటు
1858 కార్వార్ లో ఆంగ్లేయులపై దాడి
మే, 1858 సురేబాన్ లో బ్రిటిష్ ప్రతినిధి మాన్సన్ శిరచ్ఛేదం, ఆంగ్లేయులతో నర్గుంద్ రాజు యుద్ధం
1858 ముందర్గికి చెందిన భీమ్ రావ్ నాయకత్వంలో ఆంగ్లేయులపై దాడి
1858 గోవాలో దీపూజి రాణె తిరుగుబాటు
వెల్లూరు (మద్రాస్)కు చెందిన 18వ పల్టన్ తిరుగుబాటు
1858 చెంగల్పట్ (మద్రాస్)లో విప్లవకారుల తిరుగుబాటు
జులై, 1857 క్విక్కలోన్ (కేరళ)కు చెందిన 25, 45వ పల్టన్ ల తిరుగుబాటు

1857 సంగ్రామం తరువాత ముఖ్య పరిణామాలు

స్వాతంత్ర్యం సాధించడం కోసం వివిధ సంస్థలు, వ్యక్తులు ప్రయత్నించారు. పరాయిపాలపై తిరుగుబాటు చేశారు.

అనేకమంది విదేశాలకు వెళ్ళి అక్కడ భారతీయుల స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు కూడగట్టారు.

దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహాలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి.