Home News 2.24 లక్షల డొల్ల కంపెనీలపై వేటు

2.24 లక్షల డొల్ల కంపెనీలపై వేటు

0
SHARE

నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దాదాపు 99% నోట్లు ఆర్థిక వ్యవస్థలోకి వచ్చాయిగానీ.. చాలావరకూ అనుమానాస్పద లావాదేవీలేవీ ఆర్థిక నిఘా సంస్థల దృష్టి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాయి. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ (మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌-ఎంసీఏ) ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో గణాంకాలే ఇందుకు నిదర్శనం. పేరుకు కంపెనీగా రిజిస్టర్‌ అయినప్పటికీ.. ఎలాంటి లావాదేవీలూ రెండేళ్లు, అంతకుమించి కాలంపాటు నిష్ర్కియగా ఉన్న 2.24 లక్షల కంపెనీలను రద్దు చేసినట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాల లావాదేవీలపైనా, స్థిర, చరాస్తుల అమ్మకం, బదిలీలపైనా నియంత్రణలు విధించింది. అలాంటి లావాదేవీల రిజిస్ట్రేషన్‌లను ఆమోదించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అలాగే.. నోట్ల రద్దు తర్వాత.. 56 బ్యాంకుల్లో 35 వేల కంపెనీలకు చెందిన 58 వేల ఖాతాల్లో 17 వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయని, కొన్నాళ్లకే ఆ సొమ్ము మొత్తాన్నీ ఉపసంహరించారని ఆ శాఖ తన ప్రకటనలో వివరించింది.

ప్రత్యేకించి.. ఒక కంపెనీ ఖాతాలో 2016 నవంబరు 8 నాటికి నెగెటివ్‌ బ్యాలెన్స్‌ ఉందని, నోట్ల రద్దు తర్వాత ఆ ఖాతాలో రూ.2,484 కోట్లను జమ చేసి, విత్‌డ్రా చేశారని వెల్లడించింది. మరో కంపెనీకి ఏకంగా 2,134 అకౌంట్లు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. తదుపరి చర్యల నిమిత్తం ఈ తరహా కంపెనీల సమాచారాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, ఆర్థి నిఘా విభాగం, ఆర్థిక సేవల విభాగం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీలకు ఎంసీఏ అందజేసింది. అలాగే.. కంపెనీల చట్టం, 2013 ప్రకారం విచారణ/తనిఖీ/దర్యాప్తు చేయాల్సిన కంపెనీలను గుర్తించి తగినచర్యలు తీసుకుంటోంది. కంపెనీలపైనే కాక.. అనుమానాస్పద కంపెనీల డైరెక్టర్లపైనా కేంద్రం చర్యలు తీసుకుంది. వరుసగా 2013-14, 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆర్థిక నివేదికలను, వార్షిక రాబడుల వివరాలను దాఖలు చేయని 3.09 లక్షల మంది డైరెక్టర్లపై వేటు వేసింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వీరిలో 3000 మందికిపైగా డైరెక్టర్లు చట్టవిరుద్ధంగా 20కి పైగా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నట్టు తేలింది.

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

నల్లధనంపై పోరులో భాగంగా ఈ తరహా డొల్ల కంపెనీల గుట్టు రట్టు చేసేందుకు ప్రధాని కార్యాలయం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికి రెవెన్యూ కార్యదర్శి, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉమ్మడిగా నేతృత్వం వహిస్తారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ ఇప్పటికి ఐదుసార్లు సమావేశమై.. పలు డొల్ల కంపెనీలపై చర్యలు చేపట్టింది.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)