Home News సామాన్యులకు ఊరట – 2018 బడ్జెట్ బాట

సామాన్యులకు ఊరట – 2018 బడ్జెట్ బాట

0
SHARE

– హనుమత్ ప్రసాద్

2018 ఫిబ్రవరి 1 న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెండు ముఖ్యమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించబడింది. భారత్ వ్యవసాయం ప్రధానంగా గల దేశం. వ్యవసాయదారులకు మేలుచేసేందుకు పంటకు తగ్గ మద్దతుధర కోసం కేంద్రం చేయి అందించింది. రబీ పంటలతోబాటు ఖరీఫ్ పంటలకు కూడా కనీస మద్దతుధరను సాగువ్యయంకన్నా ఒకటిన్నరరెట్లు అధికంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో దాదాపు అన్నిపంటలకు గిట్టుబాటుధర కల్పించినట్లైంది.అలాగే వ్యవసాయ రుణాలను 11 లక్షల కోట్లకు పెంచింది. కౌలురైతులకు కూడా దీన్ని వర్తింపజేస్తోంది.

22వేల గ్రామీణవ్యవసాయ మార్కెట్లను అభివృద్ధిపరుస్తామని, అక్కడ మౌలిక సౌకర్యాల కల్పనకు 2000కోట్లతో నిధి ఏర్పాటుచేస్తామని చెప్పింది. ఇప్పటికే ప్రధానామంత్రి ఫసల్ బీమా యోజన అమలులో ఉంది. రైతును కరవులు, వర్షాభావం వంటి కష్టపరిస్థితుల్లో ఈ బీమా ఆదుకుంటుంది. ఇపుడు ఈ బీమాపై ప్రీమియం ఎత్తివేశారు. ఎక్కువమంది రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకునే వీలుంది.

రెండవది ఆరోగ్యబీమా పథకాన్ని 50కోట్లమంది పేదలకు కల్గించడం. ఆయుష్మాన్ భారత్ కింద కుటుంబానికి ఏడాదికి రూ . 5 లక్షల చొప్పున 10కోట్ల కుటుంబాలకు ఆరోగ్యరక్షణనిచ్చేందుకు కేంద్రం నడుంకట్టింది. ఇందుకోసం దేశమంతా లక్షన్నర ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం సుమారు 2000 కోట్లు కేటాయించారు.

ఈ రెండు పథకాలు బడ్జెట్ లో సామాన్యులకు ఊరట కలిగించేవిగా ఉన్నాయి. వ్యవసాయదారులకు సాగువ్యయాన్ని లెక్కకట్టే విషయంలో వాస్తవికత లోపించింది. దీన్ని సరిచేయాలని కేంద్రం నిర్ణయించింది.

బడ్జెట్ సుమారు 25 లక్షల కోట్ల అంచనాతో రూపొందింది. గ్రామీణ, నగర ప్రాంతాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ కేటాయింపులు జరిపారు.

గ్రామాల్లో రహదారులు, ఇళ్ళు, మరుగుదొడ్లు నిర్మాణానికి, విద్యుత్ సరఫరా కోసం సుమారు 14.34 లక్షల కోట్లు కేటాయించింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకానికి గతసంవత్సరంకంటే ఎక్కువ కేటాయింపులు జరిపింది.

ఉద్యోగాల కల్పన విషయమై ప్రతిపక్షాలు గత మూడేళ్లుగా మోడి ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నాయి. `ఉద్యోగం’ అనగానే అది ప్రభుత్వ ఉద్యోగం అనే భ్రమలో కొందరున్నారు. నిజానికి మోదీ ప్రభుత్వం గత మూడేళ్లుగా చేపట్టిన అనేక అభివృద్ది కార్యక్రమాలవల్ల అనేకమందికి ఉపాధి లభించింది. ఒక సర్వే ప్రకారం సంఘటిత రంగంలో సుమారు 70 లక్షలమందికి ఉద్యోగాలు లభించాయి.

ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఇప్పటివరకు 10కోట్లమందికి లక్షరూపాయల నుంచి 10కోట్ల వరకు ఏ విధమైన షూరిటీ అడగకుండా రుణాలు మంజూరు చేశారు. దీనివల్ల కూడా అనేకమందికి ఉపాధి కల్పించబడింది. మోదీ ప్రభుత్వం 2017-18 బడ్జెట్ లో మైనారిటీ వ్యవహారాల శాఖకు కూడా భారీ కేటాయింపులు జరిపింది.

హజ్ సబ్సిడీని ఎత్తివేయడం సంచలనాత్మక నిర్ణయం. ఆ మొత్తాన్ని మైనారిటీ మహిళా, శిశు సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పింది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లో అందుబాటులో అందరికీ ఇళ్ల పథకానికి గత రెండేళ్లలో సుమారు లక్ష కోట్లు కేటాయించారు. కోటి ఇళ్ల నిర్మాణం అమలులో ఉంది.

అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చెల్లించాల్సిన కార్పొరేట్ పన్నులను 30 శాతం నుండి 25శాతానికి తగ్గించారు. గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్ తో అనుసంధానించడం మోదీ ప్రభుత్వం ఒక పెద్ద లక్ష్యంగా పెట్టుకుంది. 6,25,000 గ్రామాలను 2018 డిసెంబర్ వరకు అనుసంధానించాల్సిఉంది. మొదటిదశలో సుమారు లక్ష గ్రామాల్లో ఈ పని పూర్తయ్యింది. దీంతో 20 కోట్లమందికి  బ్రాడ్ బ్యాండ్ సేవలు సమకురాయి.

రక్షణ రంగంలో ఈసారి కేటాయింపుల విషయమై కొందరు పెదవి విరిచారు. మొత్తం బడ్జెట్ లో ఈ సంవత్సరం 12.1 శాతంగా ఉంది. దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే `తేజస్’ వంటి యుద్దవిమానాల రూపకల్పన జరిగింది.

సీనియర్ సిటిజన్ లకు వర్తించే వరిష్ఠ బీమా పథకానికి 8 శాతం వడ్డీని 10 సంవత్సరాలపాటు అందించనున్నారు. 60-80ఏళ్ల మధ్యవారికి 3 లక్షల వరకు పన్నులేదు. 80ఏళ్ల పైబడినవారికి 5 లక్షలవరకు ఆదాయం పన్ను లేదు. ఉద్యోగులకు ఆదాయపు పన్నులో రూ. 40,0000 ప్రామాణిక తగ్గింపును తిరిగి ప్రవేశపెట్టారు. మొత్తం మీద బడ్జెట్ సంక్షేమం వైపు మళ్లడంతో కార్పొరేట్ ల పాలిటి సెన్సెక్స్ దూకుడు తగ్గింది.