సాధించాలన్న పట్టుదల.. చేసి తీరాలన్న తపన ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగా మారుతుంది అని నిరూపించాడు ఈ వ్యక్తి. తీవ్ర కరవుతో అల్లాడిపోతున్న తన గ్రామ దాహార్తిని తీర్చేందుకు రెండున్నర దశాబ్దాల పాటు ఒంటరి పోరాటం చేశాడు. 27ఏళ్లు శ్రమించి.. చెరువును తవ్వి గ్రామానికి నీటిని అందించాడు. ఆనాడు ఏంటీ పిచ్చి పని అని నవ్వినవాళ్లే.. ఈనాడు అతడిని దేవుడంటున్నారు. అతడే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శ్యామ్‌లాల్.
ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో సాజా పహడ్ అనే గ్రామం ఉంది. ఏళ్లుగా ఈ గ్రామం తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కనీసం పశుపక్ష్యాదులకు సైతం తాగేందుకు నీరు లేని దుర్భర పరిస్థితి. పట్టణాలకు దూరంగా కొండల ప్రాంతంలో ఉన్న ఈ గ్రామ ప్రజలకు తమ సమస్యను ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. అటు ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. అలాంటి పరిస్థితుల్లో శ్యామ్‌లాల్ ఓ రోజు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తమ నీటి సమస్యను పరిష్కరించుకునేందుకు చెరువును తవ్వడమే మార్గమని అందుకు పూనుకున్నాడు. అప్పుడు శ్యామ్‌లాల్ వయసు 15ఏళ్లు మాత్రమే.
అలా తన చేతిపారను తీసుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లాడు శ్యామ్‌లాల్. అక్కడ నీరున్న ప్రదేశాన్ని గుర్తించి చెరువును తవ్వడం ప్రారంభించాడు. ఇది చూసిన గ్రామప్రజలు శ్యామ్‌ను చూసి పిచ్చివాడంటూ నవ్వుకున్నారు. కానీ.. శ్యామ్ మాత్రం తన లక్ష్యాన్ని వదల్లేదు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27ఏళ్ల పాటు శ్రమించి చెరువును తవ్వాడు. అటు గ్రామ ప్రజలు కానీ ఇటు అధికారులు గానీ సాయం చేయకపోయినా ఒంటరిగా పోరాడి తన గ్రామానికి నీరు తీసుకొచ్చాడు. ఛత్తీస్‌గఢ్‌కు మాంఝీ అయ్యాడు.
ఇటీవలే ఈ చెరువు నిర్మాణం పూర్తయింది. ఇది చూసిన గ్రామ ప్రజలు ఇప్పుడు శ్యామ్‌ను ఆదర్శవంతుడని కొనియాడుతున్నారు. ఆనాడు పిచ్చివాడని నవ్వినవారే.. నేడు అతడిని తమ గ్రామాన్ని రక్షించిన దేవుడంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు. అతడి గురించి తెలుసుకున్న మహేంద్రగఢ్ ఎమ్మెల్యే శ్యామ్ బిహారీ జైస్వాల్ సాజా పహడ్ గ్రామాన్ని సందర్శించి శ్యామ్‌లాల్‌ను అభినందించారు. రూ.10వేల ఆర్థికసాయం చేశారు.
(ఈనాడు సౌజన్యం తో)