Home News డి.ఆర్‌.డి.వో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔష‌దాన్ని విడుద‌ల చేసిన‌ కేంద్ర‌ మంత్రులు

డి.ఆర్‌.డి.వో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔష‌దాన్ని విడుద‌ల చేసిన‌ కేంద్ర‌ మంత్రులు

0
SHARE

కరోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2-డియాక్సీ డి-గ్లూకోజ్‌) అందుబాటులోకి వచ్చింది. ఔషధాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ విడుదల చేశారు.

మొదట రక్షణ మంత్రి డ్రగ్‌ను విడుదల చేసి ఆరోగ్యశాఖ మంత్రికి అందజేయగా డ్రగ్స్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు అందజేశారు. పదివేల డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ… కరోనా కట్టడిలో ఈ ఔషధం ప్రముఖ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి ఓ ఔషధాన్ని ఉత్పత్తి చేయడం ఆరోగ్యవంతమైన భాగస్వామ్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.  కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ… 2డీజీ ఔషధంతో కొవిడ్ రికవరీ తగ్గడంతో పాటు ఆక్సిజన్ అవసరం కూడగా తగ్గుతుందని, కోవిడ్ పై పోరులో డీఆర్డీవో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.

పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే.

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పౌడర్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరి సహకారంతో అభివృద్ధి చేసింది. 2డీజీ డ్రగ్‌ను కరోనా రోగులకు అత్యవసర వినియోగానికి ఇటీవల డీసీజీఐ అనుమతి ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది.

ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని డీఆర్‌డీఓ పేర్కొంది. క‌రోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ డ్రగ్‌ను ఇస్తే వారు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని వివరించింది.