అత్యధిక సంఖ్యాకులకు చెందిన ధార్మిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం ప్రపంచంలో ఒక్క భారత్‌లోనే ఉంది. అల్పసంఖ్యాక వర్గాలవారు మ రే దేశంలోనూ అత్యధిక సంఖ్యాకుల ఆరాధనా పద్ధతులను, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడరు. అల్పసంఖ్యాకులు న్యాయస్థానాలను ధిక్కరిస్తూ, తమ పౌరస్మృతి జోలికి వస్తే ఊరుకోమని ఏ దేశంలోనూ బెదిరించరు. రాజకీయ నేతలు అల్పసంఖ్యాకులను ప్రలోభపెట్టేందుకు భారత్‌లో తప్ప మరెక్కడా బరితెగించి వ్యవహరించరు.
అమెరికాలో, ఐరోపాలో రాజ్యానికి, మతానికి మధ్య అడ్డగోడలు కట్టారు. అయినా అక్కడి ప్రభుత్వాలు క్రైస్తవ ధార్మిక సంస్థలను పోషిస్తున్నాయి, నిధులు సమకూర్చుతున్నాయి. అమెరికాలో క్రైస్తవ సంస్థలకు ఏటా 100 బిలియన్ డాలర్ల రూపంలో పన్ను మినహాయింపులు ఇస్తున్నారు. డెన్మార్కు, స్వీడన్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫిన్‌లాండ్ వంటి దేశాల్లో ప్రభుత్వమే నేరుగా క్రైస్తవ సంస్థలకు నిధులు సమకూర్చుతున్నాయి.
ముస్లిం దేశాల్లో ఇతర మతాలవారు మనగలగటం కష్టం. తమ మతంలోని అల్పసంఖ్యాక వర్గాల వారిపైనే ముస్లింలు దాడిచేస్తుంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువుల సంఖ్య నామమాత్రం. వారికి మత ప్రచారం చేసుకొనే అవకాశమే కాదు, మత సాంప్రదాయాలను అవలంబించే స్వేచ్ఛ కూడా ఉండదు. గల్ఫ్ దేశాల్లో అన్యమత అనుసరణ ప్రాణ సంకటమే. కాని మన దేశంలో అటువంటి దురవస్థ లేదు. ఇక్కడ ముస్లింలు, క్రైస్తవులు మత ప్రచారం చేసుకొనే స్వేచ్ఛను కూడా రాజ్యాంగం ఇచ్చింది. హిందువుల సంఖ్యను చూసి వారు ఎప్పుడూ భయపడరు. ఎందుకంటే హిందువులు ఎప్పుడూ సంఘటితంగా ఉండరు.
మన దేశంలో న్యాయస్థానాలు హిందువులకు పండుగలు ఎలా నిర్వహించుకోవాలో ఆదేశాలు జారీచేస్తాయి. దేవాలయాల్లోకి ఎవర్ని అనుమతించాలో, అనుమతించకూడదో న్యాయాధికారులే నిర్ణయిస్తారు. కానీ క్రైస్తవ, ముస్లిం సంస్థల విషయంలో న్యాయస్థానాలు పరిమితంగానే జోక్యం చేసుకుంటాయి. ప్రభుత్వాలు నియమించిన దేవాలయ పాలక వర్గాలలో నాస్తికులు, హైందవేతరులు ఉంటారు. భక్తులు ఇచ్చిన విరాళాలను, కానుకలను పాలకమండళ్ల నేతలు దుర్వినియోగం చేస్తుంటారు. ధార్మికేతర కార్యక్రమాలకు నిధులను మళ్ళిస్తారు. దేవాలయ సిబ్బంది అవినీతికి మారుపేరుగా ఉంటారు. ఆలయాలు ప్రభుత్వంలో ఒక భాగమైతే ఇంతకంటే ఏమి జరుగుతుంది?
మన దేశంలో క్రైస్తవం, ఇస్లాం వంటివి మైనారిటీ మతాలు. కానీ ప్రపంచంలోనే అవి పెద్ద మతాలు. ఆ సంస్థలకు విదేశాల నుంచి భారీగా మత ప్రచారానికి నిధులు వస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల ముసుగులో, సేవాసంస్థల రూపంలో మరికొన్ని నిధులు వస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలపై ప్రభుత్వ పెత్తనం వల్ల ధూపదీప నైవేద్యాదులకే నిధులు అందక దేవాలయాలు ధర్మప్రచారం చెయ్యలేకపోతున్నాయి. మతమార్పిడులే ధ్యేయంగా క్రైస్తవ మిషనరీలు ఏటా వేలాది మందిని తమ మతంలోకి మార్చుకోగల్గుతున్నాయి.
బ్రిటిష్ పాలకులు పాటించిన దుష్ట సాంప్రదాయాన్ని స్వాతంత్య్రానంతరం కూడా భారత్‌లో కొనసాగించటం ఆశ్చర్యకరం. హిందువుల ప్రయోజనాలు కాపాడేందుకు మన ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నం శూన్యం. సెక్యులరిజం, సామ్యవాదం ఇక్కడ కలిసి పనిచేస్తున్నాయి. మన సెక్యులర్ సామ్యవాదం అధిక సంఖ్యాకుల మతం నుండి అన్య మతాల్లోకి ప్రజలను, అధికారాన్ని, సంపదను పంపిణీ చేస్తున్నాయి. ఇక్కడ మీడియాలో హిందూ వ్యతిరేక వార్తలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. హిందువులను ఛాందస్సులుగా, మతతత్వ శక్తులుగా చిత్రీకరిస్తుంటారు. క్రైస్తవ సభలలో, స్వస్థత కూటములలో, మిషనరీల్లో జరుగుతున్న మోసాలను మీడియా పట్టించుకోదు. ఇస్లామిక్ తీవ్రవాదం ఎంత ప్రమాదకరమో హెచ్చరించటం మానివేసి హిందూ తీవ్రవాదం అంటూ వ్యాఖ్యానాలు చేస్తారు. హిందూ సంఘంలోని బలహీనతలను, దురాచారాలను మాటిమాటికీ ఎత్తిచూపుతారు. కాని క్రైస్తవ, ముస్లిం మతాల్లో మూఢ నమ్మకాలను, అసమానతలను, మతమార్పిడుల వెనుక ఉద్దేశాలను బహిరంగ పర్చరు. కాశ్మీర్‌లో మతోన్మాద శక్తులకు పౌరహక్కులు మృగ్యమవుతున్నట్టు వార్తాకథనాలు వస్తుంటాయి. కాశ్మీర్ లోయనుండి హిందువులను వేధించి తరిమేస్తున్నా ఆ విషయాలపై చర్చలే ఉండవు. కాశ్మీర్ నుండి వేలాది మంది హిందువులు కట్టుబట్టలతో ఢిల్లీ తదితర ప్రాంతాలకు వలస వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా వారి సమస్యలు ప్రపంచానికి పట్టవు.
భారత్‌లో హిందువుల మాదిరి ప్రపంచంలో ఏ పెద్ద మతవర్గమూ వివక్షకు, అవమానానికి గురై ఉండదు. ప్రభుత్వాల మీతిమీరిన జోక్యం, న్యాయస్థానాల నియంత్రణ, ప్రచార మాధ్యమాల చిన్నచూపుతో హిందువులు సొంతగడ్డపైనే పరాయివారై పోతున్నారు. ఇస్లామిక్ దేశాల్లో అన్నివర్గాల ప్రజలకూ ఇస్లామిక్ చట్టాలను వర్తింపచేస్తారు. సౌదీ అరేబియా వంటి దేశాల్లో అన్యమత ప్రస్తావనకే అవకాశం లేదు. హిందువుల్లో సహనం ఎక్కువ, ఆత్మవిశ్వాసం తక్కువ. సమస్య తీవ్రతను వారు అర్థం చేసుకోవటం లేదు. వారిలో చైతన్యం రానంతవరకు ప్రభుత్వాల పెత్తనం తప్పదు. మైనారిటీ ఓటుబ్యాంకు నిర్మాణానికి రాజకీయనేతలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. హిందూ సమాజాన్ని మరింతగా బలహీనపరచేందుకు అనేక శక్తులు పనిచేస్తున్నాయి. అందుకే హిందువులకు నిరంతర జాగరూకత ఈనాటి అవసరం. ఏ సెక్యులర్ ప్రభుత్వమూ మతవ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. మతాల మధ్య వివక్ష చూపకూడదు. అన్యమతాల వారికి మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వటమే కాక, వారికి మద్దతుగా నిలబడటం హిందూ వ్యతిరేకతే తప్ప మరొకటి కాదు.
-డాక్టర్ బి. సారంగపాణి
(ఆంధ్రభూమి సౌజన్యం తో)