Home Interviews ఆర్ ఎస్ ఎస్ పై బురద జల్లే ప్రయత్నాలను ప్రజలే తిప్పికొట్టుతున్నారు – ...

ఆర్ ఎస్ ఎస్ పై బురద జల్లే ప్రయత్నాలను ప్రజలే తిప్పికొట్టుతున్నారు – శ్రీ దత్తాత్రేయ హోసబళే

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డాక్టర్జీ జయంతి (ఉగాది) సందర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేను జాగృతి ప్రతినిధి రాకా సుధాకరరావు కలిసి ముఖాముఖి నిర్వహించారు. ఆ ముఖాముఖిలో సంఘం, హిందూ సంఘటన కార్యం, హిందూ సంస్కృతి, మహిళలు, ముస్లింలు, సామాజిక సమరసత, రిజర్వేషన్లు, రాబోయే సంఘం కార్యక్రమాలు వంటి అంశాలపై సంఘ ఆలోచనలను దత్తాత్రేయ హోసబళే స్పష్టం చేశారు.

ముఖాముఖి పూర్తి వివరాలు జాగృతి పాఠకుల కోసం..

ప్రశ్న : 93 సంవత్సరాల సంఘ ప్రస్థానం నేపథ్యంలో, 1925 నుంచి నేటి వరకూ జరిగిన ఈ యాత్ర వెలుగులో భవిష్యత్తు ఎలా ఉంటుందని భావిస్తున్నారు? సంఘం భవిష్యత్తును ఎలా దర్శిస్తోంది ?

సమాధానం : తొమ్మిది దశాబ్దాల నిరంతర ప్రయత్నం వల్ల నేడు హిందువులు తమను తాము హిందువులుగా భావించుకోగలుగుతున్నారు. ఇన్నేళ్లుగా సామాజికంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మి కంగా జరిగిన ప్రయత్నాల ఫలితంగా హిందువులు సంఘటితం కాగలరన్న నమ్మకం ఏర్పడింది. సమైక్య, సంఘటిత హిందూ సమాజమే ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలను, రుగ్మతలను తొలగించ గలదని, అది రామబాణం వంటి ఔషధమని హిందువులు నమ్ముతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఈ బృహత్తర మార్పులో సంఘకార్యం అతి ముఖ్యమైన పాత్ర వహించింది. బృహత్తర హిందూ సంస్థలు, వ్యక్తులు, జాతీయవాద ఉద్యమాలు కూడా ఈ విషయంలో సంఘం ప్రధాన భూమికను పోషించిందని నమ్ముతున్నారు. ఈ మహోద్యమానికి సంఘం కేంద్రబిందువని వారందరూ అంగీకరిస్తున్నారు.

అయితే దేశం ముందు కొన్ని ప్రధాన సవాళ్లున్నాయి. కొన్ని పురాతన కాలం నుంచి వస్తున్న సవాళ్లు. కొన్ని ఆధునిక యుగంలో తలెత్తినవి. ఇవి అంతర్గత సమస్యలు. ఇవే కాక మనకు బయటనుంచి కూడా సవాళ్లున్నాయి. మనం ఈ సవాళ్లకు సమాధానం చూపదలచుకున్నాం. ఈ సవాళ్లను హిందూ సమాజం సమర్థవంతంగా, ప్రతిభా వంతంగా గతంలోనూ ఎదుర్కొంది.

వాటిలో ఒకటి కుల సమస్య. రాజకీయ స్వార్థాల కోసం హిందూ సమాజ విరోధులు హిందూ సమాజాన్ని కులాల పేరిట విభజించే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ మన సమాజంలో కుల వివక్ష, అస్పృశ్యత ఇప్పటికీ ఉంది. ఈ విషయాన్ని మనం కాదనలేము. గత అనేక శతాబ్దాలుగా ఎందరో మహాపురుషులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనినుంచి లబ్ది పొందాలనుకోవడం నేరం. కానీ ఇది జరుగుతోంది. క్రమంగా తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్న హిందూ వ్యతిరేక సంస్థలు, భారత వ్యతిరేక శక్తులు కులాన్ని ఉపయోగించి విభేదాలను సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఇటీవలి నాలుగైదేళ్లలో జరిగిన సంఘటనలు ఋజువు చేస్తున్నాయి. షెడ్యూల్డు కులాలు, తెగల మధ్య ఒకరిపై ఇంకొకరిని ఉసిగొల్పుతున్నాయి.

ఇంక రెండవ సవాలు యువ తరాన్ని హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు చేరువ చేయడం. కుటుంబాలు సంస్కార నిర్మాణ కేంద్రాలుగా ఉండాలి. కుటుంబాలు కలిసి ఉండాలి. ఆధునిక టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానాల ప్రభావం మనపై ఉంది. కేవలం మనకే కాదు. యూరోపియన్‌ దేశాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. క్రైస్తవ మత గురువులు కూడా దీనిపై గళమెత్తుతున్నారు. ఇది ఒక ప్రపంచవ్యాప్త ధోరణి. దీనిని ఎలా పరిష్కరించా లన్నది పెద్ద సవాలు.

నిజానికి నేటి యువత యోగ, ప్రాణాయామం, సూర్యనమస్కారాల వంటి వాటిని పెద్ద ఎత్తున స్వీకరిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్లొంటున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ తరువాతి తరానికి హిందూ సంస్కారాలను అందించేందుకు వ్యక్తి, కుటుంబం, విలువలు, విద్యావ్యవస్థల నుంచి పని జరగాలి. నేటికీ మతమార్పిడులు జరుగుతున్నాయి. దీని కోసం ధనాన్ని విపరీతంగా వెచ్చిస్తున్నారు. ఇదీ ఒక సవాలే. దీనినీ పరిష్కరించాలి.

కాబట్టి 93 ఏళ్ల తన యాత్రలో సంఘం హిందువులను సంఘటితం (ఐక్యం) చేయగలనన్న ఆత్మవిశ్వాసాన్ని పొందింది. దేశం లోపల, వెలుపల ప్రశంసలను పొందుతోంది. రానున్న రోజుల కోసం సంస్థలను, కార్యకర్తలను సన్నద్ధం చేయడం అవసరం. ఇంతవరకూ స్పృశించని, పూరించని ఖాళీలుగా మిగిలి ఉన్న ప్రాంతాలను, క్షేత్రాలను చేరుకునేందుకు ప్రణాళికలు తయారు చేయడం అవసరం. ఇవీ మనముందున్న అంశాలు. రాబోయే అయిదు నుంచి ఏడేళ్లు దీనిపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

ప్రశ్న : నేటి పరిస్థితులకు అనుగుణంగా స్వయంసేవక్‌ తనను తాను ఎలా మలచుకోవాలి ? సంఘం స్వయంసేవక్‌ నుంచి నేటి పరిస్థితుల్లో ఏమి ఆశిస్తోంది?

స : సంఘం కేవలం శాఖ పనికి మాత్రమే పరిమితం కాదు. అనేక పనులు చేయాలి. కొత్త వర్గాలను చేరుకోవాలి. దీనికోసం సంఘం స్వయంసేవకులకు సరైన దిశను, మార్గదర్శనాన్ని, నైపుణ్యాలను, దృక్పథాలను ఇచ్చేందుకు ఒక చక్కటి శిక్షణా వ్యవస్థను రూపొందించింది. శాఖా పనిలో అయిదారు దశాబ్దాలు శిక్షణ పొందాం. అది మనకు పునాది లాంటిది. మనం గత కొన్నేళ్లలో సమాజం లోని వివిధ రంగాలను, క్షేత్రాలను కలుసుకున్నాం. వీరందరితో బంధం సుదృఢం చేసేందుకు సేవా కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు, కొత్త వర్గాలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం, సాన్నిహిత్యాన్ని పెంపొందించడం (సంపర్క్‌) వంటివి కీలకమైన అంశాలు. ఈ గుణాలను పెంపొందించే దిశగా చక్కటి శిక్షణ ప్రణాళికను సంఘం రూపొందించింది.

బెంగుళూరులో సమర్థ భారత్‌, హైదరాబాద్‌లో టెక్‌ సేవా, మహారాష్ట్రలో నిర్మల్‌ వారీ వంటి వినూత్న, విలక్షణ కార్యక్రమాలను మనం నేడు నిర్వహిస్తున్నాం. ఉదాహరణకు పండరీపురం యాత్రీకులు పాదయాత్రగా వెళ్లినప్పుడు ఊళ్లలో బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేసేవారు. దాని వలన పలు సమస్యలు తలెత్తేవి. వాటిని నిరోధించేందుకు మన కార్యకర్తలు సమాజం సహకారంతో నిర్మల వారి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. మరాఠ్వాడాలోని దేవగిరి ప్రాంతంలో తమ ప్రయత్నంతో తాగునీటి సమస్యలకు పరిష్కారాన్ని మన స్వయంసేవకులు చూపగలిగారు. సామాజిక రంగాల్లోని సమస్యల పరిష్కారానికి స్వయంసేవకులు ముందుకెళ్తున్నారు.

కాబట్టి శాఖలో నేర్చుకున్న సంస్కారాలను, ప్రక్రియలను సామాజిక మార్పు కోసం ఉపయో గించడం చాలా అవసరం. ఇప్పుడు మనకు అప్లైడ్‌ సంఘ్‌ (స్వయంసేవకులు నేటి పరిస్థితులు, అవసరాలకు అనుగుణమైన కార్యక్రమాల ద్వారా సామాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం) ఎల్లెడలా కనిపిస్తోంది. కాబట్టి స్వయంసేవకులకు శిక్షణ నివ్వడం, సమాజంలో వివిధ విషయాలలో నిపుణు లను, జాతీయ వాదాన్ని బలపరిచే వర్గాలను కలుపుకుపోవడం వంటివి జరగాలి. దీనికి స్వయంసేవకులను తయారు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న : ఒక ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సంఘం నుంచి ప్రేరణ పొంది వివిధ రంగాల్లో పనిచేస్తున్న జాతీయవాద సంస్థలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. కానీ సంఘం విషయంలో మాత్రం ఇప్పటికీ విమర్శలు, ముద్రలు వేయడం కొనసాగుతూనే ఉంది. దీనిపై మీరేమంటారు ?

స : ఇందులో రెండు విషయాలున్నాయి. నేడు సంఘానికి ఎల్లెడలా ప్రశంసలు లభిస్తున్నాయి. రతన్‌ టాటా, ఆజీమ్‌ ప్రేమ్‌ జీ వంటి పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు, ప్రముఖులు సంఘాన్ని ప్రశంసిస్తు న్నారు. సంఘం యొక్క దేశభక్తి, క్రమశిక్షణను అందరూ గుర్తిస్తున్నారు. అజీమ్‌ ప్రేమ్‌ జీ ‘నా మిత్రులు చాలా మంది నేను ఆరెస్సెస్‌ కార్యక్రమా లకు వచ్చినందుకు ఆక్షేపించారు. కానీ సంఘం మంచి పనిచేస్తోంది. కాబట్టే నేను ఆరెస్సెస్‌ కార్యక్రమాలకు వస్తున్నాను’ అని చెప్పారు. ఆయన సరసంఘ్‌చాలక్‌ జీ తో వేదికను పంచుకున్నారు. కానీ కొందరు సంఘంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వారి వాదనలన్నీ పాతవి, పస లేనివి. కానీ ఏదో విధంగా బురద జల్లాలన్నదే వారి లక్ష్యం. సంఘం మహిళా వ్యతిరేకం, సంఘం పాత చింతకాయ పచ్చడి, సంఘం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యతిరేకిస్తుంది.. వంటి వాదనలన్నీ తేలిపోయాయి. ఎందుకంటే సంఘంలో అన్ని వర్గాలు, అన్ని శ్రేణులు, అన్ని వయసుల వారు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నారు. పైగా పలు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వాల్లో స్వయంసేవకులు ఉన్నారు. దాంతో వారు ఏదో ఒకరకంగా బురద జల్లే పనిని చేస్తున్నారు. కానీ ఇవేవీ విజయం సాధించవు. సంఘాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. తమదిగా భావిస్తున్నారు.

ఒక్క ఉదాహరణ చెబుతాను. కొన్నాళ్ల క్రితం ఆరెస్సెస్‌పై హిందూ ఉగ్రవాదం ముద్ర వేసే కుట్ర జరిగింది. ఆ సమయంలో మన కార్యకర్తలు ప్రజలందరినీ కలుసుకుని వాస్తవాలు తెలియ చేసేందుకు జనజాగరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశమంతటా నిర్వహించారు. ఆ సమయంలో ప్రజలు మేం ఈ ఆరోపణలను నమ్మే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. ఇదంతా రాజకీయ కుట్ర అని వారు చెప్పారు. 90 శాతం మంది మనల్ని సమర్థించారు. ఇటీవల అసొంలో, మీరట్‌లో భారీ సమ్మేళనాలు జరిగాయి. మీరట్‌లో 3.05 లక్షల మంది నమోదు చేసుకున్నారు. లక్షన్నర మంది హాజరయ్యారు. సమాజంలోని అన్ని వర్గాలు మనతో కలిసి వచ్చాయి. వీటన్నిటిలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. త్రిపురలో ఆరెస్సెస్‌ శరవేగంతో పెరుగుతోంది. కొందరు సంఘాన్ని దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారు. వారు చేస్తూనే ఉంటారు. సంఘం ముందుకు వెళ్తూనే ఉంటుంది.

ప్రశ్న : కుల విద్వేషాలను, ముఖ్యంగా ఎస్‌.సి., ఎస్‌.సి.యేతర విద్వేషాలు రెచ్చగొట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని ఆరెస్సెస్‌ ఎలా ఎదుర్కొంటుంది ?

స : దీనికి దేశ వ్యాప్తంగా ఒకే పరిష్కారం లేదా ఒకే వ్యూహం సాధ్యం కాదు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎస్‌.సి.ల సమస్యలకు వేర్వేరుగా ఉన్నాయి. దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో కుల వివక్షను, అస్పృశ్యతను తొలగించే దిశగా శతాబ్దాల కొద్దీ ఉద్యమాలు జరిగాయి. ఉత్తర ప్రాంతంలో పరిస్థితి వేరుగా ఉంది.

అంబేద్కర్‌ పేరును దుర్వినియోగం చేస్తూ ఎస్‌.సి. రాజకీయాలను హిందూ వ్యతిరేకంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంబేద్కర్‌ ఏనాడూ ముస్లింలతో చేతులు కలపమని చెప్పలేదు. కానీ ఈ వర్గం ఎస్‌.సి., ముస్లిం కూటమి కోసం ప్రయత్నిస్తోంది. ఆయన ఆర్యులు బయట నుంచి వచ్చారన్న వాదనను ఖండించారు. వీరు దాన్ని వెనకేసుకు వస్తున్నారు. అంబేద్కర్‌ పేరును వీరు వాడుకుంటున్నారు తప్ప ఆయన మౌలిక ఆలోచనలను పాటించడం లేదు. వీరు కుహనా అంబేద్కరిస్టులు. ఈ విషయంలో దేశం లోపల, వెలుపల అనేక కుట్రపూరిత శక్తులు పనిచేస్తున్నాయి.

వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పరిస్థితులు ఉన్నందున వేర్వేరు పరిష్కారాలు వెతకాల్సి ఉంటుంది. వేర్వేరు వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. ఒక్కటి మాత్రం సుస్పష్టం. హిందూ సమాజం అంటరాని తనాన్ని ఏరూపంలోనూ సమర్థించదు. మందిరం, స్మశానం, మంచి నీటి బావి, ఈ మూడు చోట్ల అందరికీ ప్రవేశం ఉండాలన్నది సంఘ్‌ అభిప్రాయం. దీనిని పాటించడం ద్వారా ఒక సామాజిక, మానసిక మార్పును తీసుకురావడం చాలా అవసరం.

మరో విషయం. నేటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త స్మృతి అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ధార్మిక నేతలు, మత గురువులు పూనుకోవాల్సిన అవసరం ఉంది. మూడవది రిజర్వేషన్లను సజావుగా అమలు చేయాలి. నిజమైన లబ్దిదారులకు రిజర్వేషన్లు అందేలా చూడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో విధివిధానాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ చేరాల్సిన చాలామందికి అవి చేరడం లేదు. ఈ పరిస్థితిని మార్చాలి.

ఈ విధంగా రాజ్యాంగపరంగా, సేవాకార్యక్ర మాల పరంగా, ధార్మిక ఆధ్యాత్మిక నేతల పరంగా, యావత్‌ హిందూ సమాజపరంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కుట్రలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌ పేరిట అంబేద్కర్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ భారత వ్యతిరేక ధోరణిలో సాగుతున్న కుట్రలను బహిర్గతం చేయాలి. వీరు చేస్తున్న కుట్రలు నిజానికి ఎస్‌.సి. ప్రజల బాగు కోసం జరుగుతున్న ప్రయత్నాలు కావు. రోహిత్‌ వేముల విషయంలో, జెఎన్‌యులో జరుగుతున్నవి ఎస్‌.సి. ప్రజల బాగు కోసం జరుగుతున్న ప్రయత్నాలు కావు. వీటిని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న : ముస్లిం సమాజంలో కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తోంది. దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి ?

స : మనం మొదటి నుంచీ ముస్లింలలో జాతీయవాదులున్నారన్న విషయాన్ని నొక్కి చెబుతూనే వచ్చాం. మన ఆరెస్సెస్‌ ఏకాత్మతా స్తోత్రంలో మనం కబీర్‌, రసఖాన్‌లను రోజూ స్మరించుకుంటాం. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌, పరమవీర చక్ర అబ్దుల్‌ హమీద్‌, విప్లవవీరుడు అష్ఫాఖుల్లా ఖాన్‌, శివాజీ అంతరంగిక సన్నిహితుడు మదారీ మెహతర్‌ వంటి చాలా మంది జాతీయవాదుల పరంపర మన దేశంలో కొనసాగుతూనే ఉంది. సాహిత్యంలో, జానపద సంగీతంలో, మతపరమైన అంశాల్లో, సాధు మహాత్ముల విషయంలో ముస్లింలను మనం గౌరవిస్తూనే ఉన్నాం. నేడు ముస్లింలు తమ మధ్య సామాజిక సంస్కరణ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. హిందూ సమాజంలో ఇలాంటి సంస్కరణోద్యమాలు వచ్చాయి. అలాగే ముస్లిం సముదాయంలోనూ రావాలి. కానీ ముస్లిం సముదాయంలో ఇలాంటి సంస్కర్తలు ఎందరు కనిపిస్తున్నారు? కేవలం మత నేతలే సముదాయంపై గుత్త పెత్తనం చేస్తున్నారు. ‘మూడుసార్లు తలాక్‌’ చెప్పే విధానంపై గళం విప్పిన ముస్లిం మహిళలను నేను అభినందిస్తున్నాను.

జాతీయ వాద ముస్లింలు ఇప్పటికే రాష్ట్రీయ ముస్లిం మంచ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వారు మన సహాయాన్ని అర్థించారు. మనం సహాయం చేస్తున్నాం కూడా.

రెండో విషయం.. ముస్లింలందరూ అయోధ్యలో రామ మందిరాన్ని వ్యతిరేకించడం లేదు. ముస్లింలందరూ గోహత్యను సమర్థించడం లేదు, ముస్లింలందరూ జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ఉండాలని కోరడం లేదు. ముస్లింలలో జాతీయ వాదులు కూడా ఉన్నారు. అలాంటివారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నాం కూడా. అన్ని సమాజాల్లో సంస్కరణలు రావాలి. ముస్లిం సముదాయంలోనూ అంతర్గత సంస్కరణలు రావాలి.

ప్రశ్న : మహిళల విషయంలో ఆరెస్సెస్‌ ఆలోచనా ధోరణి మహిళల్ని వెనకబాటుతనంలోకి నెట్టేసేలా ఉందని ఒక వాదన ముందుకొస్తోంది.

స : సంఘానిది హిందూ ఆలోచనా విధానం. అంటే స్వామి వివేకానంద ఆలోచనా విధానం. ఆయన ఆలోచనా విధానమంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సాధు మహాత్ముల ఆలోచనా విధానం. సంఘం ఆలోచనా విధాన మంటూ వేరుగా ఏమీ లేదు. హిందూ ఆలోచనా విధానంలో మహిళలకు ఎంతో గౌరవాన్వితమైన స్థానం ఉంది. మనం పవిత్రమైన అన్ని వస్తువులను మాతృభావంతోనే చూస్తాం.

ఇటీవలే దేవుడిని మహిళా రూపంలో ఆరాధించే విషయంపై ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. మనకు ఇది కొత్త విషయమేమీ కాదు. సంఘ శాఖలకు మహిళలు రారు. అంతే. కానీ సంఘ కుటుంబ ప్రబోధన్‌ కార్యక్రమాలకు మహిళలు వస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. రాజకీయ క్షేత్రంలో మహిళలు లేరా? రాజకీయంలో ఉన్న స్వయంసేవకుల వల్లే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అత్యాధునికమైనప్పటికీ మన సాంస్కృతిక మూలాలతో ముడిపడిన వివేకానందుని ఆలోచన లను మనం ఆచరిస్తున్నాం. సంఘం మహిళా వ్యతిరేకమన్న మాట కేవలం విష ప్రచారం మాత్రమే.

పాశ్చాత్య ఆలోచనా విధానమైన వుమన్స్‌ లిబ్‌ను మనం వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే అది తప్పని నిరూపితం అయింది. భారతీయ జీవన విధానంలో మహిళలకు అత్యున్నత స్థానం ఉంది. అన్ని రంగాల్లో వారు ముందుండాలి. దీన్ని సంఘం సమర్థిస్తుంది.

(జాగృతి సౌజన్యం తో)