ప్రతి వ్యక్తిలో భగవంతున్ని చూసే గొప్ప సంస్కృతి హిందూ సంస్కృతి అని అందుకే హిందుత్వము అందరిని కలుపుకుని వెళ్తుందని, హిందూ వేదాలలో, శాస్త్రాలలో ఎక్కడ అంటరానితనం లేదన్నారు. సామాజిక సంస్కర్తలు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్,మహాత్మా జ్యోతిబాఫులే,డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ ఈ ముగ్గురు మహనీయుల సామాజిక సమానత్వం,సామాజిక మార్పు కొరకు కృషి చేశారని సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు.
సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో “సామాజిక సమానత్వ సాధనలో మహనీయుల కృషి” అనే అంశం పై గురువారం (5-ఏప్రిల్) నాడు రాత్రి మెదక్ లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ లో చర్చా గోష్ఠి లో వారు ప్రధాన వక్త గా పాల్గొని ప్రసాద్ జీ ప్రసంగించారు.
సామాజిక సంస్కర్తలు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిబాఫులే, డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ ఈ ముగ్గురు మహనీయుల జయంతులను ఒకే వేదిక పై నిర్వహించిన ఈ చర్చా గోష్ఠిలో మగ్గురి చిత్ర పటాలకు పూల మాలలు వేసి పుష్పాంజలి సమర్పించిన అనంతరం ప్రసాద్ జీ మాట్లాడుతూ మహాత్ముల జీవితాల భాటలో నడిచి సమత్వ సాధనకు అడుగులు వేయాలని అన్నారు. సమరసత వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో ఈ ముగ్గురి సమరసత జీవనం గురించి ప్రజలకు తెలిపి వారి అడుగు జాడల్లో యువత నడిచి సమానత్వం సాధించే విధంగా ప్రయత్నిస్తుందన్నారు.
చర్చలో పాల్గొన్న వక్తలు ధన్ రాజ్, నర్సింగ్రావ్ కులకర్ణి, మశ్చేంద్రనాథ్, రవి, నాయుడు, చోళ పవన్ కుమార్, వెంకటేశం, మల్కాజీ సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ పరమాత్మ దృష్టిలో మనమంతా సమానమేనని అసమానతలు భేధాలు మనం సృష్టించుకున్నవేనని చెప్పిన ఫులే మనకు ఆదర్శమని, ఏకాత్మత, ఏకాత్మ రాష్ట్ర్ అనే శబ్ధాలు వారు ఎక్కువగా ప్రయోగించేవారని, ఫులే ఏ ఉత్తరం రాసిన సత్యమేవ జయతే అని రాసే వారన్నారు. దీనితో జాతీయత భావాలు మనకు గోచరిస్తాయన్నారు.
ప్రపంచంలో ఉన్నత స్థాయి మేధావి, పండితుడు, సమత ఉద్యమకారుడు సామాజిక సమానత్వము, దేశభక్తి భావాలు, ఒకే దేశం, సమైక్యత, సమ సమాజంతో కూడిన బలమైన భారత్ ను నిర్మించడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. అంటరానితనం, వివక్షతను రూపుమాపడానికి వారు చేసిన సమతా ఉద్యమాల స్ఫూర్తితో నేటి యువత కుల వివక్షతను రూపు మాపి సమరసతతో జీవించాలన్నారు.
గొప్ప పరిపాలనధక్షుడు, అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించి సమైక్యతకు కృషి చేసి యాభై సంవత్సరాల పాటు ఒకే నియోజక వర్గం నుండి నిరంతరంగా ఎన్నికై కీర్తి సాధించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని వక్తలు అన్నారు. దేశ ప్రగతిలోనే తమ ప్రగతి, దేశం యొక్క ఉద్ధరణలోనే తమ ఉద్ధరణ, దేశం యొక్క విముక్తిలోనే తమ విముక్తి ఇమిడి ఉందని హరిజనులు గుర్తించాలని సోదరభావంతో ఉండాలని, జాతీయభావాలు కలిగి ఉండాలని మొదటి నుండి చివరి వరకు ఉద్భోదించిన సంస్కర్త బాబూ జీ అని వక్తలు కొనియాడారు. అనంతరం పాల్గొన్న వారు అభిప్రాయాలు, సందేహాలు, సలహాలు, సూచనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక మెదక్ జిల్లా భాధ్యులు,వివధ క్షేత్రాల భాధ్యులు పాల్గొన్నారు.