భారత సైన్యంపై మరోసారి ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. పోలీస్ దుస్తులు ధరించిన ఒక ఉగ్రమూక భారీ ఆయుధాలతో జమ్ము శివారుల్లోని నగ్రోటాలో 166 ఆర్టిలరీ యూనిట్‌పై మంగళవారం ఉదయం దాడికి దిగింది. సైన్యం తీవ్రంగా ప్రతిఘటించి వారిని హతమార్చింది. ఈ దాడిలో ఏడుగురు సైనికులు అసువులు బాశారు. అందులో ఇద్దరు అధికారులు. ఈ దాడి సందర్భంగా ఉగ్రవాదులు కొద్ది సేపు 12 మంది సైనికులను, ఇద్దరు మహిళలను, ఇద్దరు శిశువులను బందీలుగా పట్టుకునేంత పని చేశారు. వారందరినీ సైన్యం రక్షించింది. దాదాపుగా ఈ దాడి జరుగుతున్న సమయంలోనే మరో సంఘటనలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో సాంబా సెక్టారులోని రాంగఢ్ వద్ద పాక్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడడానికి ప్రయత్నించగా బీఎస్‌ఎఫ్ జవాన్లు తీవ్రంగా ప్రతిఘటించారు. పలు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. అటువైపు నుంచి పాకిస్థానీ దళాలు భారత భూభాగం వైపు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ డీఐజీ సహా నలుగురు జవాన్లు గాయపడ్డారు. పాకిస్థాన్ కొత్త సైన్యాధిపతిగా కమర్ జావేద్ బజ్వా బాధ్యతలు స్వీకరించిన రోజునే ఈ రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి.
నగ్రోటా దాడికి సంబంధించి సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం… ఉగ్రవాదులు గ్రెనేడ్లను విసురుతూ నగ్రోటా యూనిట్‌లోని ఆఫీసర్స్ మెస్ ఆవరణలోకి బలవంతంగా ప్రవేశించారు. వారిని ఆ దశలోనే ప్రతిఘటించే క్రమంలో సైన్యాధికారి ఒకరు, ముగ్గురు సైనికులు అమరులయ్యారు. అధికారులు, కుటుంబాలు, ఇతరులున్న రెండు భవంతుల్లోకి ఉగ్రవాదులు ప్రవేశించడంతో బందీలుగా చిక్కే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని సైన్యం వెంటనే కట్టడి చేసింది. ఆ భవంతుల్లో ఉండేవారిని రక్షించే ప్రయత్నంలో మరో అధికారి, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఈ సందర్భంగా సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో మృతి చెందిన అధికారులను మేజర్ గోసావి కునాల్ మన్నదీర్(33), మేజర్ అక్షయ్ గిరీష్ కుమార్ (31)గా గుర్తించారు. గోసావి కునాల్.. మహారాష్ట్రలోని సోలాపుర్ జిల్లాకు చెందిన వారు. అక్షయ్.. బెంగళూరు వాసి. అసువులు బాసిన ఇతర సైనికులు.. హవల్దార్ సుఖ్‌రాజ్ సింగ్(32)- పంజాబ్‌లోని గుర్దాస్‌పుర్, లాన్స్‌నాయక్ కదమ్ శంభాజీ యశోవంతరావ్ (32)- మహారాష్ట్రలోని నాందేడ్, రాఘవేంద్ర సింగ్(28)-రాజస్థాన్‌లోని ధోల్‌పుర్, ఆసిప్ రాయ్ (32)-నేపాల్‌లోని ఖోటంగ్. అమరుడయిన మరో సైనికుడి పేరును వెల్లడించలేదు. సైన్యానికి చెందిన 16 కార్ప్స్ ప్రధాన కార్యాలయానికి మూడు కి.మీ.దూరంలో నగ్రోటా యూనిట్ ఉంది. జమ్ము ప్రాంతంలో సైనిక కార్యకలాపాల బాధ్యత 16 కార్ప్స్‌దే.
వీర పత్నుల తెగువ
నగ్రోటా(జమ్ముకశ్మీరు): వారు వీరపత్నులనిపించారు. ఉగ్రవాదులను ధైర్యసాహసాలతో నిలువరించి భారీ ప్రాణ నష్టాన్ని తప్పించారు. తమ వెంట నవజాత శిశువులున్నా వారు భయపడలేదు.ఈ శిశువుల్లో ఒక శిశువు వయస్సు 18 నెలలు కాగా మరో శిశువు వయస్సు రెండు నెలలే. నగ్రోటాలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు సైనిక కుటుంబాలు నివసించే క్వార్టర్లలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే ఇద్దరు సైన్యాధికారుల సతీమణులు అపార సాహసాన్ని ప్రదర్శించారు. క్వార్టర్లలోకి ప్రవేశించే ద్వారానికి ఇంటిలో ఉండే వస్తువులన్నింటినీ అడ్డుపెట్టారు. ఉగ్రవాదులు చొరబడడం కష్టమయ్యేలా చేశారు. ఈ మహిళలు ఈ పని చేయకుండా ఉండిఉంటే వారిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని సైన్యానికి, వారి కుటుంబాలకు భారీ నష్టంచేసి ఉండేవారని ఓ అధికారి తెలిపారు.
(ఈనాడు సౌజన్య తో )