Home News సుప్రీం జడ్జిగా బాధ్యతలు తీసుకున్న ఇందు మల్హోత్రా

సుప్రీం జడ్జిగా బాధ్యతలు తీసుకున్న ఇందు మల్హోత్రా

0
SHARE

సీనియర్‌ న్యాయవాది ఇందు మల్హోత్రా నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్ర ఈరోజు ఉదయం ఇందు మల్హోత్రాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఓ మహిళా న్యాయవాది నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులు కావడం ఇదే ప్రథమం. కొలీజియం సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం వెలువరించిన ఉత్తర్వుల మేరకు ఆమె ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.

స్వాతంత్ర్యం తర్వాత సుప్రీంకోర్టుకు ఆరుగురు మహిళా న్యాయమూర్తులు రాగా ఇందు మల్హోత్రా ఏడో వ్యక్తి. అయితే వారంతా హైకోర్టుల్లో అనుభవం ఉన్నవారే. ఇందూ మాత్రం నేరుగా న్యాయవాద వృత్తి నుంచి న్యాయమూర్తి అయ్యారు. 61ఏళ్ల ఇందూది న్యాయవాదుల కుటుంబం. పుట్టింది బెంగళూరులోనే అయినా చదువంతా దిల్లీలోనే సాగింది. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకుని, 1983లో ఆమె న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 1988లో కఠినతరమైన ‘అడ్వోకేట్‌ ఆన్‌ రికార్డ్‌’ పరీక్షలో ప్రథమురాలిగా నిలిచారు. 2007లో సీనియర్‌ న్యాయవాది అయ్యారు.

ఇందూ మల్హోత్రా స్వయానా ఉద్యమకారిణి. పలు సామాజిక అంశాలపై పోరాటం చేశారు. ఆమెకున్న అనుభవంతో కీలక అంశాలపై న్యాయ నిపుణురాలిగా మధ్యవర్తిత్వం వహించారు. పలు సామాజిక అంశాలపై పోరాటం చేశారు. తర్వాత ఆమెకున్న అనుభవంతో కీలక అంశాలపై న్యాయ నిపుణురాలిగా మధ్యవర్తిత్వం వహించారు. పౌరసేవలు, విద్యా సంబంధిత విషయాలు, మానవహక్కుల సంబంధిత అంశాల్లో చెప్పుకోదగ్గ సేవల్ని ఆమె అందించారు. ‘సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాదిగా మల్హోత్రా ఉన్నప్పుడు… రహదారి ప్రమాద బాధితులకు సాయపడేవారిని వేధింపుల నుంచి రక్షించే చట్టానికి మార్గదర్శకాలు రూపొందించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించడానికి ఉద్దేశించిన ‘విశాకా కమిటీ’లో ఆమె ఒక సభ్యురాలుగా ఉన్నారు. న్యాయస్థానంలో లైంగిక వేధింపుల ఫిర్యాదులపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన 10 మంది కమిటీలో ఆమె ఒకరు. చలనచిత్ర పరిశ్రమలో మహిళా మేకప్‌ కళాకారుల పట్ల ఉండే వివక్షపై జరిగిన పోరాటంలోనూ ఆమె న్యాయవాదిగా సేవలందించారు. వరకట్న వేధింపుల కేసులో అరెస్టులపై సుప్రీంకోర్టుకు న్యాయ సహాయకురాలిగా ఆమె వ్యవహరించారు.

(ఈనాడు సౌజన్యం తో)