Home News తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై సి బి ఐ విచారణకు విశ్వ హిందూ పరిషత్ డిమాండ్

తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై సి బి ఐ విచారణకు విశ్వ హిందూ పరిషత్ డిమాండ్

0
SHARE
Sri Ramana Deekshithulu File photo

హిందువుల పుణ్య క్షేత్రమైన తిరుమల తిరుమల దేవస్థానం వ్యవహరిస్తున్న తీరుపై విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీ రావినూతల శశిధర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థ సి బి ఐ ద్వార విచారణ చేయాలని డిమాండ్ చేసారు. దాంతో పాటు ఈ వ్యవహారంలో ఆలయ జే ఈ ఓ మరియు ఎండోమెంట్స్ ఆఫీసర్ పని తీరుపై పలు అనుమానాలను వెలిబుచ్చారు.

తిరుమల ఆలయం  మాజీ ప్రధాన అర్చకులు  రమణ దీక్షితులు  టి టి డి పై చేసిన ఆరోపణలు చాల తీవ్రమైనవి.  వాటి పై నిజా నిజాలు బయటికి తేవడానికి సి బి ఐ  విచారణ ఎందుకు వద్దు? ప్రభుత్వం  ఎందుకు తప్పించుకుంటున్నది?  పోటు తవ్వకాలపై రమణ దీక్షితులు చెప్పగానే జే ఈ ఓ ను చీఫ్ ఇంజనీరును పంపి పరిశీలన చేయించాను అని ఈ ఓ  గారు విలేకరుల సమావేశంలో స్వయంగా చెప్పారు, అంటే రమణ దీక్షితులు చెప్పనంత వరకూ ఈ ఓ కు కూడా  తవ్వకాల విషయం తెలియనట్లే కదా? అంత గోప్యంగా ఎందుకు ఎవరు తవ్వకాలు జరిపారు?

పల్లవులు చోళ రాజులు సమర్పించిన  వజ్రాలు నేలమాలిగల నుండి తవ్వేసుకున్నారా?

1000 సంవత్సరాల పోటు తవ్వకాలకు సంబంధించి ఎలాంటి నియమనిబంధనలు పాటించారో వాటికి సంబంధించి  అధికారిక అనుమతులు ఎమి తీసుకున్నారో ఎండోమెంట్స్ ఆఫీసర్ ఎందుకు వివరించ లేక పోతున్నారు?

స్వామి వారికి 25 రోజులు  భోజనం పెట్టని విషయం తెలియని ఈ ఓ కు పురాతన ఆభరణాలు భధ్రంగా ఉన్న విషయం తెలుసు అని నమ్మగలమా ?

స్వామి వారి నగల మాయం పై వచ్చిన తాజా ఆరోపణలపై కనీస ప్రాధమిక ధర్యాప్తు కూడా జరుపకుండా పాత రిపోర్టులను చూపెడుతూ ఇప్పుడు కూడా అంతా బాగానే ఉందని ఈ ఓ గారు మీడియాకు చెప్పడం దాన్ని గుడ్డిగా నమ్మిన మీడియా తాటిపండు అక్షరాలతో అంతా క్షేమమే అని వ్రాయడం హస్యాస్పదం కాదా?

ఆరోపణలు వచ్చాక స్వామి వారి నగలు ఈ.ఓ  ప్రత్యక్షంగా చుసారా, తిరుమల జీయంగార్లకు కానీ నూతనంగా తాను నియమించిన ప్రధాన అర్చకులకు గాని కనీసం చూపెట్టకుండా అంతా బాగుంది అని చిలుక పలుకులు పలికితే దాన్ని హిందూ సమాజం గుడ్డిగా నమ్మాలా?

బంగారు డాలర్లు మాయం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల చేతుల్లో స్వామి వారి నగలు ఎలా భధ్రంగా ఉంటాయో, వారిని ఇంకా అక్కడే కొనసాగిస్తున్న అధికారులు వివరణ ఇవ్వగలరా? ఒక రిటైర్డ్ ఉద్యోగి చేతిలో వేలకోట్ల విలువైన ఆభరణాల  తాళాలు ఉంచడం ప్రమాదం అని గతంలో  చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్సు ఆఫీసర్  హెచ్చరించినా ఇంకా ఆ ఉద్యోగుల చేతిలోనే ఎందుకు తాళాలు ఉన్నట్లు?

1996 నుండి ఆభరణాలకు ఎవరు జవాబు వహిస్తున్నారు అని ప్రధాన అర్చకులు లేవనెత్తిన పశ్నకు ఈ ఓ  సింఘాల్ ఎందుకు జవాబు దాట వేస్తున్నాడు?

శ్రీ క్రిష్ణ దేవరాయలు, మైసూర్ రాజులు సమర్పించిన విలువైన నగలు మాయమైనాయా? గులాబి వజ్రం దేశం దాటిందా? ఉన్న నగలలో కూడా అసలు మణి మాణిక్యాలు మాయం చేసి గిల్టు నగలు అలంకరిస్తున్నారా? గత రెండు రోజులుగా రికార్డుల తారుమారు ప్రక్రియ వేగంగా జరుగుతుందా?

ఎందుకు వెంటనే రికార్డులు సీజ్ చేసి తాజాగా ఆభరణాల లెక్కింపు మరియు దర్యాప్తు చేయించడానికి ప్రభుత్వం వెనుకడుగు వేయడంలో కారణాలు ఏమై ఉంటాయి?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు జే ఈ ఓ శ్రీనీవాస రాజులను రక్షించడానికై ఈ ఓ గారిని బలి చేయనున్నారా? తప్పు చేస్తే నన్ను శిక్షించండి ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను , విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి, సి బి ఐ  విచారణ జరిపించండి అని ప్రకటించిన రమణదీక్షితులు  గారి డిమాండ్ పై ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడు?

తెలుగు ప్రజల హక్కులకై ముందుండి పోరాడే తెలుగు మీడియా  తెలుగు వారి ఇలవేల్పు వెంకన్న పవిత్రతకు అపచారం కలుగుతుంటే సి బి ఐ  విచారణకు ఎందుకు ఆంధ్ర ప్రదేశ ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని ప్రశ్నించడం లేదు?

రమణదీక్షితులు గారు చేసిన ఆరోపణలను పక్కదారి పట్టించడానికి వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయించడం వాటిని పతాక శీర్షికలతో ప్రచురించడంలో దాగున్న కుట్ర ఏమిటి?

స్వామి వారి నగలు అన్యమతస్థుల చేతిలో భధ్రంగా ఉన్నాయి అని చెబితే సమాజం నమ్మాలా?

ఇవి సగటు భక్తుని ప్రశ్నలు. ఇక్కడ సమస్య ప్రభుత్వ ముఖ్య మంత్రిదో లేదా రమణదీక్షితులు గారిది  అని చూడొద్దు ఇది తిరుమల తిరుపతి పవిత్రత అక్కడి వ్యవస్థల సంరక్షణ అంశంగా పరిగణించాలి.

తిరుపతి విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం సి బి ఐ  విచారణకు ఆదేశించి జరుగుతున్న చర్చకు ముగింపు పలికి తిరుమల పవిత్రత కాపాడాలి. ఒక్కటి మాత్రం మనం గుర్తించాలి మనందరం చర్చిస్తుంది ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో చోటు చేసుకుంటున్న అపచారాల గురుంచి, ఈ పాపాలకు పూనుకున్న వారిని ఆ స్వామి శిక్షించడం ఖాయం. హిందూ సమాజం జాగృతమై భగవద్గీత ప్రేరణగా అధర్మం పై యుద్ధం ప్రకటించడమే భక్తులుగా మనం చేయాల్సిన భగవత్ కార్యం.

– రావినూతల శశిధర్,
విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ అధికార ప్రతినిధి.