Home Telugu Articles డా. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఒక మహోన్నత దేశభక్తుడు

డా. శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఒక మహోన్నత దేశభక్తుడు

0
SHARE

సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైనా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ కమిషన్‌ వేస్తారు. కానీ, శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ అనుమానాస్పద మృతిపై విచారణ కమిషన్‌ వేయాలన్న డిమాండ్‌ను నాటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారు. అయినా ముఖర్జీ త్యాగం వృథా పోలేదు. ఆయన నాయకత్వంలో ఆవిర్భవించిన బిజెపి ఇప్పుడు పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో, అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తోంది.

స్వతంత్ర భారత రాజనీతిజ్ఞులలో అగ్రగణ్యుడు శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ. ఆయన గొప్ప విద్యావేత్త కూడా. 33 ఏళ్లకే అసాధారణ స్థాయిలో రెండు పర్యాయాలు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్సలర్‌ అయిన మేధావి. తదనంతర కాలంలో మహమ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలో శక్తిమంతమైన మతతత్వ పార్టీగా ముస్లిం లీగ్‌ అవతరిస్తున్న సందర్భంలో ఆయన సావర్కర్‌ ప్రభావంతో హిందూ మహాసభలో చేరి రాజ కీయాల్లో అడుగుపెట్టారు. డాక్టర్‌ ముఖర్జీ సామర్థ్యం పట్ల అపార విశ్వాసం ఉన్న గాంధీజీ ఒత్తిడితోనే ప్రధాని నెహ్రూ స్వతంత్ర హోదాతో మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రధాని నెహ్రూ అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక, మైనారిటీ సంతుష్టీకరణ విధానాలవల్ల భవిష్యత్తులో దేశంలో ఎదురుకానున్న పరిస్థితులను అంచనా వేసిన డాక్టర్‌ ముఖర్జీ, నెహ్రూ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆల్‌ ఇండియా హిందూ మహాసభ కార్యనిర్వాహక అధ్యక్షులుగా దేశమంతా విస్తృతంగా పర్యటించారు. అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ గురూజీ గోల్వల్కర్‌ను కలిసి పార్టీ స్థాపించాలన్న తన మనోగతాన్ని వెల్లడించారు.

ముఖర్జీకి ఆర్‌ఎస్‌ఎస్‌ నుండి పూర్తి సహకారం ఉంటుందని గురూజీ గోల్వాల్కర్‌ అభయమిచ్చారు. గురూజీ గోల్వాల్కర్‌ డాక్టర్‌ ముఖర్జీ స్థాపించబోయే పార్టీకి పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజపేయి లాంటి నాయకులను జతచేశారు. 1951 అక్టోబర్‌ 21వ తేదీన ఢిల్లీలో భారతీయ జనసంఘ్‌ పార్టీ ఆవిర్భవించింది. ఆవిర్భావం తొలినాళ్లలోనే భారతీయ జనసంఘ్‌ 1951–52 ఎన్నికల్లో మూడు లోక్‌సభ స్థానాలను సాధించింది. అదే సమయంలో కశ్మీర్‌ సమస్య రోజురోజుకు తీవ్రమవుతూ వస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా కశ్మీర్‌ సమస్యపై న్యాయసమ్మతమైన, ప్రజామోదమైన పరిష్కారాన్ని డాక్టర్‌ ముఖర్జీ చూపించినప్పటికీ ప్రధాని నెహ్రు అబ్దుల్లా చెప్పినట్లు గానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన శ్యాం ప్రసాద్‌ కశ్మీర్‌ సమస్యపై జాతీయవాద ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపరిషత్‌ పార్టీ పండిట్‌ ప్రేమ్‌ నాథ్‌ డోగ్రా నేతృత్వంలో షేక్‌ అబ్దుల్లాకు వ్యతిరే కంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఆందోళనకు శ్యాం ప్రసాద్‌ సంపూర్ణ బహిరంగ మద్దతు తెలిపారు. భారతీయ జనసంఘ్‌ పార్టీని దేశమంతా విస్తృత పరిచేందుకు వేగవంతమైన ప్రణాళికను రూపొందించారు. పండిట్‌ దీన్‌ దయాళ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శగా, వాజపేయిని వ్యక్తిగత సహాయకుడిగా ఎంచుకున్నారు. ఆనాడు జమ్మూకశ్మీర్లో ప్రవేశించాలంటే రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉండేది.

దీనిని జాతి, దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ రక్షణ శాఖ అనుమతి లేకుండానే జమ్మూకశ్మీర్లో పర్యటించాలని నిర్ణయించారు. ఢిల్లీ నుండి ప్యాసింజర్‌ రైలులో జమ్ము కశ్మీర్‌ పర్యటన ప్రారంభించారు. అదే సమయంలో వారికి జమ్మూకశ్మీర్లో ప్రవేశించేందుకు అనుమతిస్తూ పోలీసులకు ఆదేశాలందాయి. అయితే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ప్రపంచానికి తర్వాత తెలిసింది. జమ్ముకశ్మీర్‌లో ప్రవేశం సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు కనుక అక్కడ ఏంజరిగినా తర్వాత ఎదురయ్యే పరిస్థితులను తారుమారు చేయొచ్చన్నది షేక్‌ అబ్దుల్లా, ప్రధాని నెహ్రూల కుట్రగా తర్వాత ప్రజలు నిర్ధారణకు వచ్చారు. గురుదాస్‌ పూర్‌లో డాక్టర్‌ ముఖర్జీని అరెస్ట్‌ చేసివుంటే సుప్రీంకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌తో డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ బయటకు వచ్చేవారు. డాక్టర్‌ ముఖర్జీని అరెస్ట్‌ చేసి రాత్రి బటోటె పట్టణానికి తరలించారు. మరుసటి రోజు ఉదయం శ్రీనగర్‌కు తరలించారు. నిర్మానుష్యమైన చిన్న గదిని సబ్‌ జైలుగా మార్చి అసౌకర్యాల మధ్య నిర్బంధించారు. దీంతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఉద్దేశపూర్వకంగానే నెహ్రూ, షేక్‌ అబ్దుల్లాలు అటు బెయిల్‌ ఇవ్వకుండా, ఇటు మెరుగైన వైద్యం అందకుండా చేశారన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో 1953 జూన్‌ 23వ తేదీ తెల్లవారుజామున ముఖర్జీ తుది శ్వాస విడిచారని ప్రకటించారు. సాధారణంగా ప్రజాదరణ ఉన్న నాయకులు అదృశ్యమైనా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ కమిషన్‌ వేస్తారు. కానీ, నాటి ప్రధాని నెహ్రు విచారణ కమిషన్‌ వేయాలన్న డిమాండ్‌ను తిరస్కరించారు. అయినా ముఖర్జీ త్యాగం వృథా పోలేదు. ఆయన నాయకత్వంలో ఆవిర్భవించిన బిజెపి ఇప్పుడు పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో, అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తోంది.

-కొట్టె మురళీకృష్ణ
(జూన్‌ 23 డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి)

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)