వెంగమాంబ అనే పేరంటాలు ఆలయం నెల్లూరుజిల్లా నర్రవాడలో ఉంది. పేరంటాలు అంటే సహగమనం చేసిన స్త్రీ. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. శ్రీకృష్టదేవరాయలు కాలం నుంచే ఇక్కడి అమ్మవారికి పూజలు జరుగుతున్నట్లు ఆధారాలున్నాయి. ఇక్కడి అమ్మవారిని స్థానికులు ఎంతో భక్తిప్రపత్తులతో కొలుస్తారు. ప్రతి ఏటా జ్యేష్ట మాసంలో పౌర్ణమిరోజుతో మొదలుపెట్టి ఐదురోజుల పాటు వెంగమాంబ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
వెంగమాంబ చరిత్ర
నర్రవాడ దగ్గరలో ఉన్న వడ్డిపాలేనికి చెందిన వచ్చమ వెంగమనాయుడు, సాయమ్మల కుమార్తె వెంగమాంబ. చిన్నతనం నుంచే దైవచింతనలో మునిగిపోయిన వెంగమాంబను నర్రవాడకు చెందిన వేమూరు గురవయ్యకు ఇచ్చి పెళ్ళిచేశారు తల్లిదండ్రులు. అత్తవారింట్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఓర్పు, సహనంతో వ్యవహరించి భర్త అభిమానాన్ని పొందింది వెంగమాంబ. భర్త గురవయ్య ప్రతిరోజూ పశువుల్ని దగ్గరలోని దొడ్డగడ్డ అడవికి మేతకు తీసుకువెళ్ళేవాడు. అలా వెళ్ళిన గురవయ్య ఒకసారి గజదొంగల దాడిలో తీవ్రంగా గాయపడతాడు. అతను బతకడం కష్టమని వైద్యులు తేల్చేస్తారు. దాంతో తన భర్త చనిపోకముందే తాను ముత్తయిదువుగా అగ్నిప్రవేశం చేయాలనుకుంది వెంగమాంబ. ఆమె అగ్నిప్రవేశం చేసిన కొద్ది క్షణాలకే గురవయ్య కూడా మరణించాడు.
పేరంటాలు మహిమ
తనువు చాలించిన తరువాత వెంగమాంబ కొందరి కలలో కనిపించి తన మహిమ తెలిపింది. దాంతో స్థానికులు ఆమెకు గుడికట్టి పూజలు జరపడం ప్రారంభించారు. ప్రతిఏటా జ్యేష్ట మాసంలో బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి ఇక్కడ.
గ్రామదేవతల వ్యవస్థ
సహగమనం చేసిన స్త్రీని దేవతగా భావించి పూజించడం పాటక (జానపద) ఆచారం. చాలా సందర్భాల్లో పేరంటాలు ఆరాధన జానపద, గ్రామీణ స్థాయికే పరిమితమవుతుంది. కొన్నిసందర్భాల్లో మాత్రం జానపద, గ్రామీణస్థాయి నుంచి పౌరాణిక (సార్వజనిక) స్థాయికి చేరుతుంది. పేరంటాలు పేరు ప్రఖ్యాతులు బాగా పెరిగి, భక్తగణం పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది. అప్పుడు పూజలు సరిగా జరిపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయవలసి వస్తుంది. అదే ఒక వ్యవస్థగా రూపొందుతుంది. అవ్యవస్థితమైన జానపద, గ్రామ్య పూజా పద్ధతుల స్థానంలో సువ్యవస్థితమైన పద్ధతులు అవసరమవుతాయి. ఆ వ్యవస్థితమైన పద్ధతే పౌరాణిక ఆగమ వ్యవస్థ. గ్రామ్య వ్యవస్థ స్థానంలో పౌరాణిక ఆగమ వ్యవస్థ అమలులోకి రావడం ఒక క్రమపరిణామం. అయితే గ్రామ్య వ్యవస్థకు పరిమితులు ఉన్నట్లే ఆగమవ్యవస్థకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, ఉంటాయి. వాటిని భూతద్ధంలో చూపించి ఆగమవ్యవస్థ ‘స్థానికమైనది’ కాదని, గ్రామీణ పూజాపద్ధతుల్ని కొద్దిమంది పండితులు, శిష్టులు ఆక్రమించుకున్నారంటూ కొందరు చేసే ప్రచారం వారి అజ్ఞానానికి తార్కాణం. మొగ్గ పువ్వుగా, పువ్వు కాయగా, కాయ పండుగా మారడం ఎంత సహజమో గ్రామీణ పూజా వ్యవస్థ ఆగమవ్యవస్థగా మారడం కూడా అంతే సహజం. వెంగమాంబ బ్రహ్మోత్సవాలను పరిశీలిస్తే ఈ మార్పు అర్థమవుతుంది.
ఐదురోజుల పండుగ
మొదటిరోజు వెంగమాంబ వంశస్థులు దేవాలయంలో పసువు దంచడంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రెండవరోజు, మూడోరోజు వెంగమాంబ దంపతుల ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ప్రతి ఇంటి ముందు భక్తులు కానుకలు, కొబ్బరికాయలు సమర్పిస్తారు. నాలుగవరోజు పసువుకుంకుమ ఉత్సవం, కళ్యాణోత్సవం జరుగుతాయి. ఐదువరోజు బండ్ల పొంగళ్ళు, ఎడ్లబండి లాగుడు పందాలు నిర్వహిస్తారు. బండ్ల పొంగళ్ళు అంటే వివిధ గ్రామాలలో భక్తులు పొంగలిని వండి దానిని బళ్ళలో పెట్టి తేవడం. ఇలా గ్రామీణ, పౌరాణిక పద్ధతుల కలయికగా బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా జరుగుతాయి.
– సత్యదేవ
– లోకహితం సౌజన్యంతో….