Home Telugu Articles పోటీ ఏదైనా, గెలుపు నాదే – హిమదాస్‌

పోటీ ఏదైనా, గెలుపు నాదే – హిమదాస్‌

0
SHARE

పరుగూ, జీవితం రెండూ ఒక్కటే..సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. అందుకే ఆ టైమ్‌ వెనుకే నేను పరుగు పెడతా.. అదే నా లక్ష్యం కూడా. ఆ తరువాతే ఈ విజయాలూ, పతకాలు అన్నీ. పరుగు మొదలైతే చాలు, గడియారపు ముళ్లు నా మెదడులో తిరుగుతూ ఉంటాయి. ఫలానా  టైమ్‌లో చేరుకోవాలనే ధ్యాసతోనే పరిగెడతా అంటుంది హిమదాస్‌. 18 ఏళ్ల ఈ అమ్మాయి పరుగుతో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు యావత్‌ దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఈ ప్రయాణంలో తన అనుభవాలను వసుంధరతో ప్రత్యేకంగా చెప్పుకొచ్చిందిలా..

మా నాన్న రంజిత్‌ దాస్‌, అమ్మ జోమాలీ. మేం నలుగురం. నాకు  ఇద్దరు చెల్లెళ్ల్లూ, ఓ తమ్ముడు. మాది ఉమ్మడి కుటుంబం. మొత్తం ఇంట్లో పదహారు మంది ఉంటాం. నాన్న రైతు. పెద్దనాన్నా వాళ్లంతా ఉద్యోగులు. ఇంట్లో నేనే పెద్దదాన్ని. చిన్నప్పటి నుంచీ అన్నింట్లో చురుగ్గా ఉండేదాన్ని. అందుకే నాన్నకు నేను బాగా దగ్గర. ఆయనతోపాటు రోజూ పొలానికి వెళ్లేదాన్ని. కాసేపు అక్కడ సాయం చేసేదాన్ని. మిగిలిన సమయం అంతా నా ఆటలూ, అల్లరితో గడిచిపోయేది. నాన్న నేనేం చేసినా ఏమనేవారు కాదు. అలా అక్కడ పంటపొలాల్లో పరుగుపెట్టడమంటే నాకు మహా ఇష్టం. ఈ అభిరుచే నన్ను ఈ రోజు ఈ స్థాయికి చేర్చిందేమో.

పరుగువైపు నా అడుగులు..

మాది అసోం రాష్ట్రంలోని నాగోన్‌ అనే ప్రాంతంలో థింగ్‌ అనే గ్రామం. అక్కడే నేను ఐదోతరగతి వరకూ చదువుకున్నా. అక్కడ జరిగే ప్రతి పోటీలో నాదే బహుమతి. అది కోకో, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, క్యారెమ్స్‌, క్రికెట్‌, డాన్స్‌, పాటలు పాడటం అయినా సరే. ముఖ్యంగా క్రీడల్లో నేను ఆసక్తి చూపిస్తున్నానని, నాన్నావాళ్లు నన్ను సమీపంలోని జవహర్‌ నవోదయా విద్యాలయలో చేర్చారు. ఎందుకంటే అక్కడ చదువుతో పాటు ఆటలకూ ప్రాధాన్యత ఉంటుంది. ఏటా జరిగే స్పోర్ట్స్‌డే అంటే నాకు పండగ వచ్చినట్లే. అక్కడ మూడేళ్లపాటు చదువుకున్నా. రోజు రోజుకీ ఆటలపై మక్కువ పెరగడంతో 2012లో నాగోన్‌లో అథ్లెటిక్‌ అసోసియేషన్‌లో చేరే అవకాశం లభించింది. ఇక్కడ క్రీడలకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది. ఇక నా ఆనందానికి అంతులేదు. ఈ అసోసియేషన్‌లో ఫుట్‌బాల్‌ బాగా ఆడేదాన్ని. అప్పుడే కోచ్‌ నిపొన్‌దాస్‌ నన్ను గమనించారు. ఆటల్లో నా వేగానికి పరుగు అయితే ఇంకా రాణిస్తానని ఆయన నన్ను ప్రోత్సహించారు. దాంతో మిగతా క్రీడల నుంచి నా అడుగులు పరుగు వైపు వేగాన్ని అందుకున్నాయి. అక్కడ రెండేళ్లు ఉన్నా. ఆ పై 2014లో గువహటి అథ్లెటిక్‌ అసోసియేషన్‌లో శిక్షణ కోసం చేరాను. అప్పటి నుంచి నా పరుగుకు మరింత ఉత్సాహం వచ్చింది.

మా స్నేహబృందం…

మాన్‌ జెయ్‌ అని చెబితే అర్ధం కాలేదు కదా. అది మా ఊరి భాషలో ‘నాకు ఇష్టమైన’ అని అర్థం. దీని గురించి చెప్పాలంటే ముందు నా స్నేహితుల గురించి చెప్పాలి. నాకు చిన్నప్పుడు ఏడుగురు స్నేహితులుండేవారు. అందరూ అబ్బాయిలే. అయితేనేం ప్రపంచంలో మాకన్నా గొప్ప స్నేహితులు ఉండరేమో అనుకుంటా. అందుకే మా గ్రూపును ‘మాన్‌ జెయ్‌’ అని పిలుచుకుంటాం. కాస్తంత సమయం దొరికితే చాలు.. వాళ్లతో కలిసి క్యారెమ్స్‌, ఫుట్‌బాల్‌ వంటి ఆటలన్నీ ఆడేస్తా. ఇక తిండి గురించి చెప్పాలంటే ఇదీ అదీ అని ఏదీ లేదు. అన్నం నుంచి పండ్లు, అన్ని రకాల కూరగాయలూ అన్నీ ఇష్టంగా తింటా.

నా బూట్లను నేనే కొనుక్కుంటా..

చిన్నప్పటి నుంచీ పాల్గొన్న ప్రతీ పోటీలో బహుమతి నాదే. అలా వచ్చిన డబ్బులను నాన్నకిస్తే…నీకు కావలసింది నువ్వే కొనుక్కో అనేవారు. వాటితోనే నాకు ఆటలకు కావలసిన పరికరాలూ, దుస్తులూ, వస్తువులూ అన్నీ నేనే కొనుక్కునేదాన్ని. అవన్నీ తక్కువ ఖరీదులోనే అనుకోండి. మిగిలిన డబ్బుతో మా చెల్లెళ్లకూ కానుకలు ఇచ్చేదాన్ని. ఏ పోటీలోనైనా ఎంతో కొంత నగదు బహుమతిగా లభిస్తుంది. అందుకే గెలుపు నాదే అనే నమ్మకంతో ముందుగానే కొనవలసిన జాబితాను సిద్ధంగా ఉంచుకునేదాన్ని. అంతర్జాతీయస్థాయికి వచ్చిన తరువాతే ఖరీదైన బూట్లు తొడుక్కున్నది. నిజానికి నాకు కాళ్లకు చెప్పులు అవసరమే ఉండదనిపిస్తుంది. ఎందుకంటే పొలాల్లో పరుగుపెట్టిన పాదాలు నావి. వాటికి మార్గం మాత్రమే కనిపిస్తుంది తప్ప, సౌకర్యాన్ని వెతుక్కోవు.

కన్నీళ్లు ఆగలేదు..

ఫిన్‌ల్యాండ్‌లో జరిగిన ‘ప్రపంచ అండర్‌ 20 ఛాంపియన్‌షిప్‌- 400 మీటర్లు’ పరుగు పోటీ జరగక ముందు అమ్మావాళ్లకి ఫోన్‌ చేసి ఫైనల్స్‌లో ఎంపికైన విషయాన్ని చెప్పా. పోటీలో గెలుపు నాదే అని ధీమాగా వారికి చెప్పా. వాళ్ల ఆనందానికి అంతులేదు. ‘‘ఎలాగైనా నువ్వు గెలవాలి..నీదే గెలుపు’’ అని ఉత్సాహపరిచారు. నాన్న అయితే నువ్వే గెలుస్తావులే నాకు తెలుసన్నారు. నాకు పోటీ అంటే భయం ఉండదు. వేగంగా పరుగుపెట్టడమే నా పని. మెదడులో లక్ష్యం స్థిరంగా ఉంటుంది. అలాగే ఈ పోటీకి కూడా సిద్ధమయ్యా. ఈ పోటీ ద్వారా మా అమ్మానాన్నలూ, మా గ్రామం మాత్రమే కాకుండా దేశం మొత్తం గర్వపడేలా పేరు తేవాలనుకున్నా. పోటీ మొదలైంది.  ఇందులో నాకంటూ ఓ ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారం చేస్తా. అలాగే ఆ రోజు కూడా చివరి 80మీటర్ల దూరం నుంచి నా అసలైన లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత వేగాన్ని పెంచా. గెలిచా. మొదటిస్థానంలో నిలబడి ఉన్న సమయంలో మన జాతీయగీతం నా చెవుల్లో వినిపిస్తోంది. మా ఊరు గుర్తు వచ్చింది. నా లక్ష్యం చేరుకున్నా. ముందే చెప్పినట్లు ఆ పోటీలో గెలవడమే కాదు దేశానికి పతకం తేగలిగా. ఆ ఆలోచన నన్ను ఎందుకో ఉద్వేగానికి గురిచేసింది. నా కళ్ల నుంచి ధారాపాతంగా నీళ్లు .. అదేమీ నాకు తెలియలేదు. ఎన్నో సార్లు పోటీలో పాల్గొన్నా. అయితే ఎప్పుడూ ఇలా అవలేదు. ఇలా జరగడం నాకు ఇది మొదటిసారి. కానీ ఆ అనుభవాన్ని మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. అవి కన్నీళ్లా లేదా ఆనంద భాష్పాలా నాకు తెలీదు.

17 బంగారు పతకాలు..

ఇప్పుడు నా మీద అంచనాలు పెరిగాయి. ఇక ప్రతీ పోటీలో నేనే ముందుండాలనే పట్టుదలా పెరిగింది. ఈ ఉత్సాహంతో ముందుకు సాగుతా. ఈ మూడేళ్లగా జాతీయస్థాయిలో ఎక్కడ పరుగు పోటీ ఉంటే అక్కడ హిమ ఉండేది. ఇప్పటివరకూ 17 బంగారు పతకాలను సాధించా. అయితే ఎప్పుడూ పతకాల గురించి ఆలోచించను. కేవలం సమయాన్ని తగ్గించుకోవడానికే కృషి చేస్తూ ఉంటా. భవిష్యత్తులో ఇంకా తక్కువ సమయాన్ని సాధించడమే నా లక్ష్యం. నా భవిష్యత్తు లక్ష్యం. ఏషియన్‌ గేమ్స్‌. ఉక్రెయిన్‌, పోలెండ్‌లో శిక్షణ తీసుకోబోతున్నా. అయితే ఈ లోపు అమ్మావాళ్లందరినీ ఓ సారి చూసిరావాలని ఉంది.

మేం ఏమీ ఇవ్వలేదు..: హిమ తల్లిదండ్రులు

చిన్నప్పటి నుంచి హిమకు మేం ఏమీ ఇవ్వలేదు. అన్నింటినీ తానే సమకూర్చుకునేది. తనకు కావలసిన బూట్లు, దుస్తులను తానే కొనుక్కునేది. పోటీలో వచ్చే నగదు బహుమతితో తనకు కావలసినవి, అలాగే చెల్లిళ్లకు కూడా కొనేది. ఎప్పుడూ ఇది నాకు కావాలి అని అడిగేది కాదు. తనకు ఏం కావలసి వచ్చినా, పోటీలున్నాయిగా అంటూ ధీమాగా ఉండేది. చాలా అల్లరి పిల్ల, అలాగే ధైర్యవంతురాలు. మేం ఏమీ ఇవ్వకపోయినా, తాను మాత్రం అన్నింటిలో విజయం సాధించి మమ్మల్ని దేశమంతా గౌరవించేలా చేస్తోంది. చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల మా గ్రామంలో కరెంటు లేదు. ఈ పోటీకి ముందు రోజు నుంచీ కరెంటు పోవడంతో హిమ గెలుపును చూడలేకపోయాం. అందరం అక్కడ కొంత వేదనకు గురయ్యాం. అయితేనేం.. దేశమే గర్వపడేలా చేసింది. దానికి మించిన సంతోషం ఇంకేముంది. మా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దేశాన్ని గర్వపడేలా చేసిన హిమను చూస్తే, మాకు గర్వంగా ఉంది.

సీహెచ్‌. వసుంధరాదేవి

(ఈనాడు సౌజన్యం తో)