కేరళ వరద బాధితులను ఆడుకునేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం 700 కోట్ల ఆర్ధిక సహాయం అందిస్తామని ముందుకు వచ్చినా కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని, వరద బాధితుల విషయంలో కూడా రాజకీయాలు చేస్తోందని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ ఆర్ధిక సహాయం అందిస్తామని తాము చెప్పనేలేదని, ఆ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సౌదీ రాయబారి స్పష్టం చేయడంతో కమ్యూనిస్టు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వట్టి బూటకమని, కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణల్లో పస లేనేలేదని తేలింది. ఒక ప్రముఖ భారతీయ వార్తాపత్రికతో మాట్లాడుతూ కేరళ వరదాబాధితులకోసం ఆర్ధిక సహాయం అందించాలనిగాని, ఎంత మొత్తం ఇవ్వాలనిగాని నిర్ణయించలేదని సౌదీ రాయబారి అహ్మద్ అల్బానా స్పష్టం చేశారు. “వరద తీవ్రత గురించి, ఎంత సహాయం అందించాలన్న విషయం గురించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా సహాయ రాశిని నిర్ణయించలేదు, ప్రకటించలేదు’’ అని అల్బానా వెల్లడించారు. 700 కోట్ల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వచ్చిన వార్తలు ఎంతవరకు నిజమని ఆ విలేఖరి అడిగిన ప్రశ్నకు `అవును ఆ వార్తల్లో నిజం లేదు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఎలాంటి ప్రకటన చేయలేదు’ అని అల్బానా సమాధానం ఇచ్చారు. “సౌదీ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయి పాలకుడు షేక్ మహమ్మద్ రషీద్ అల్ మక్తౌమ్ లతో జాతీయ అత్యవసర కమిటీ ఏర్పడింది. కేరళ బాధితులకు ఆర్ధిక సహాయంతోపాటు మందులు, ఇతర అత్యవసర సామగ్రి ఎలా అందించాలన్న విషయమై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది . ఇది ఇప్పటివరకు కేరళ గురించి జరిగిన కార్యాచరణ’ అని ఆయన వెల్లడించారు.
విచిత్రమేమిటంటే సౌదీ రాయబారి ఇలా చెపుతుంటే వారం క్రితమే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ 700 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం చేయడానికి సౌదీ ముందుకువచ్చిందని పత్రిక సమావేశంలో ప్రకటించడమేకాక, సౌదీ ప్రభుత్వానికి కేరళ ప్రజల తరఫున ధన్యవాదాలు కూడా తెలిపారు.