మాటతీరు మనస్తత్వానికి అద్దం పడుతుంది. ఫరూక్ అబ్దుల్లా కొంతకాలంగా చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే భారతీయుడిగా ఆయన నిబద్ధతపట్ల అనుమానాలు ముసురుకుంటున్నాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యసభ సభ్యుడిగా నియమితుడైన ఆ పెద్దమనిషి- ఇప్పుడు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే పనిలో ఎడతెరిపి లేకుండా ఉన్నారు. హురియత్‌కు మద్దతుగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు నివ్వెరపరచేవిగా ఉన్నాయి. కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో కలపడమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థకు భారత్‌కు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడు దన్నుగా నిలవడమేమిటి? ‘నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తలకు ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నా. ఈ పోరాటంలో మనమెప్పుడూ వెనకడుగు వేయలేదు. ఇకపైనా వేయరాదు! నేను మిమ్మల్ని హెచ్చరించి మరీ చెబుతున్నా… ఈ సంఘర్షణలో మనకు విడదీయలేని భాగస్వామ్యం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రతిసారీ మనం పోరాట పథం తొక్కుతూనే ఉన్నాం’ ఇదీ ఫరూక్ వ్యాఖ్యల వరస. హురియత్‌కు అండదండగా నిలవాలనే ఆయన భావిస్తున్నట్లయితే వెన్వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. కేంద్రమంత్రిగా, కశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా మాట్లాడటం సహించలేం. కశ్మీర్‌లో ఇటీవల నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఏ కొంచెం సంకోచమైనా లేకుండా భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తూ ఆయన పచ్చి వేర్పాటువాదిలా ప్రసంగించారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగే అర్హత ఇక ఆయనకు ఎంత మాత్రం లేదు!
ఆవేశం ముంచుకొస్తే ఫరూక్‌కు తాను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు. తన మీద తనకే నియంత్రణ లేని వ్యక్తి ఆయన. గతంలో అలీగఢ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన పూర్తి మతోన్మాదిలా మాట్లాడిన విషయం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆనాడు ఆ వేదికమీద నేనూ ఉన్నాను. తరవాత ప్రసంగించిన నేను ఫరూక్ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టాను. హిందూ ముస్లిములు ఒకే దేశంలో మనలేరని, వారికోసం రెండు వేర్వేరు రాజ్యాలు ఏర్పాటు చేయాల్సిందేనంటూ భారత్ విభజనకు ముందు ముస్లింలీగ్ నాయకుడు మహమ్మదాలీ జిన్నా చేసిన తరహా వ్యాఖ్యలను- ఫరూక్ ప్రసంగం గుర్తుకు తెచ్చిందని నేను గట్టిగా విమర్శించాను. శ్రీనగర్ నుంచి వెలువడే ఓ పత్రికలో కొన్ని వారాల క్రితం రాసిన వ్యాసంలో ఫరూక్ విద్వేషం వెలిగక్కారు. కశ్మీర్ స్వాతంత్య్రం కోసం రాష్ట్ర యువత తుపాకులు చేతపట్టి ఉంటే తన తండ్రి షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఎంతగానో సంతోషించి ఉండేవారని ఆయన అందులో వ్యాఖ్యానించారు. షేక్ అబ్దుల్లా గురించి నాకు బాగా తెలుసు. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయమూ ఉంది. కశ్మీర్ యువత హింసాత్మక పంథా తొక్కడాన్ని ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించి ఉండేవారు కాదు. షేక్ అబ్దుల్లా బాధ్యతలు తెలియని వ్యక్తి కాదు. ఫరూక్‌కు ప్రచార యావ ఎక్కువ. పత్రికల పతాక శీర్షికల్లో నిలిచేందుకు ఆయన ఏమైనా మాట్లాడతాడు. ఇవన్నీ చూస్తుంటే- హురియత్ ప్రతిపాదిస్తున్న సిద్ధాంతాలు దేశ ప్రయోజనాలకు ఏ స్థాయిలో విఘాతం కలిగిస్తాయన్న అవగాహన ఆయనకు ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కశ్మీర్‌లోయను భారత్‌నుంచి వేరు చేస్తే తలెత్తబోయే పరిణామాలను ఆయన ఏనాడైనా విశ్లేషించారా?
కశ్మీర్‌లో ఆందోళనలు చేస్తున్న యువత ఇప్పుడు ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో కలపాలని భావించడం లేదు. కానీ, హురియత్ నాయకుడు సయ్యద్ అలీషా గిలానీ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేయాలని కోరుతున్నారు. కొంతకాలం క్రితం వరకూ కశ్మీర్ ఆందోళనకు గిలానీయే నేతృత్వం వహించారు. కానీ, ఇటీవల అక్కడ పరిస్థితి మారిపోయింది. కశ్మీరీ యువత ఇప్పుడు ఎంతమాత్రమూ గిలానీ అజమాయిషీలో లేరు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో వేగంగా మారుతున్న పరిస్థితులను, భావజాలాన్ని గమనించాల్సి ఉంది. షేక్ అబ్దుల్లా ప్రజా ఉద్యమాల నుంచి పుట్టిన నాయకుడు. మతోన్మాదం పొడ కూడా గిట్టని ఆయన పూర్తిగా బహుళత్వ సిద్ధాంతాలకు కట్టుబడ్డ వ్యక్తి. ప్రజాస్వామ్య సూత్రాలకు, మత స్వేచ్ఛకు పెద్దపీట వేసిన భారతావనిలోనే కశ్మీర్ మనుగడ సజావుగా సాగుతుందని ఆయన బలంగా విశ్వసించారు. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసిన సందర్భంగా అధికరణ 370 ప్రకారం- విదేశీ వ్యవహారాలు, రక్షణ, సమాచార సదుపాయాలు మినహా మిగిలిన అంశాలన్నింటిపైనా రాష్ట్రానికే అధికారాన్ని దఖలుపరచారు. ఆ రకంగా దేశంలోని మరే రాష్ట్రానికీ లేని ప్రత్యేకత కశ్మీర్‌కు ఏర్పడింది.
భారత్‌లో అంతర్భాగంగా కశ్మీర్ ప్రస్థానం ప్రారంభమైంది మొదలు ఆ ప్రాంత నాయకుడిగా షేక్ అబ్దుల్లా స్ఫూర్తిదాయకంగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఆదర్శ నేతగా నిలిచారు. ఇందిరాగాంధీ హయాములో ఆత్యయిక పరిస్థితి విధించినప్పుడు ఆ చర్యను ధిక్కరించినవారినందరినీ జైళ్లలో పెట్టారు. ఆ రకంగా జైలుకు వెళ్ళి విడుదలయ్యాక నా సహ ఖైదీలు శ్రీనగర్‌కి వెళ్ళి షేక్ అబ్దుల్లాను కలిసి ఆత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా ఆయన మద్దతు కోరాలని అభ్యర్థించారు. అప్పట్లో షేక్ అబ్దుల్లా అంటే దేశవ్యాప్తంగా అందరికీ గౌరవం ఉండేది. శ్రీనగర్‌కి వెళ్ళి మేమంతా అభ్యర్థించిన వెన్వెంటనే ఆయన ఏ మాత్రం సంకోచించకుండా ఆత్యయిక స్థితిని తక్షణం ఉపసంహరించుకోవాలంటూ ప్రకటన జారీచేశారు. అలాంటి వ్యక్తికి కుమారుడిగా ఉండి ఫరూక్ అబ్దుల్లా నేడు వేర్పాటువాదులతో చేతులు కలిపి జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వేర్పాటువాద మూకలకు మద్దతు ప్రకటించడం ద్వారా ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్ వాసుల్లోనే కాదు, దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజల్లోనూ అనుమానాల తేనెతుట్టె కదిపారు. తక్షణం ఆయన వాస్తవాలను గ్రహించి, తప్పు దిద్దుకుంటే మంచిది!
-కులదీప్ నయ్యర్
ప్రముఖ పాత్రికేయులు
బ్రిటన్ లో భారత మాజీ హై కమిషనర్
(ఈనాడు సౌజన్యం తో)