గృహ నిర్బంధంలో ఉన్న ‘విరసం’ నేత వరవరరావు సహా మరో నలుగురికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భిన్నాభిప్రాయాలు తెలిపినందుకు కాదు, నిషేధిత మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలున్నందునే తగిన ఆధారాలతో అరెస్టు చేసినట్టు కోర్టు అభిప్రాయపడింది. మహారాష్ట్ర పోలీసులు కేసు యోగ్యతలకు అనుగుణంగానే తదుపరి చర్యలు తీసుకుంటారని కూడా కోర్టు తెలుపుతూ నిందితుల తక్షణ విడుదలకు నిరాకరించింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (‘సిట్’) వేయాలన్న విజ్ఞప్తిని సైతం సుప్రీం తోసిపుచ్చింది. గృహ నిర్బంధాన్ని మరో నాలుగువారాల పాటు పొడిగించింది. అర్బన్ మావోలకిది పెద్ద దెబ్బ.
విచారణ ఎలా జరగాలో నిందితులు ఎంచుకునే వీలు ఉండదని ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం. ఆగస్టు 28న ఈ ఐదుగురు నిందితులను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. వీరిని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్, దేవకీ జైన్, సతీశ్ పాండే, న్యాయవాది మజాద రూపలా సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టు నిందితులను గృహ నిర్బంధంలోకి పం పింది. మరో నాలుగు వారాలపాటు నిర్బంధంలో కొనసాగేలా తీర్పు చెప్పింది. దాంతో వారు ఆశించిన ఊరట లభించలేదు. వారి ఆశలకు భిన్నంగా సుప్రీం కోర్టు స్పందించింది. దాంతో నిందితులు, వారి తరపున కోర్టుకెళ్ళిన ప్రముఖులు నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు తీర్పును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ స్వాగతించారు. పోలీసులు చేపట్టిన చర్య సరైనదేనన్న విషయం ఈ రకంగా రుజువైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధారాలున్నాయి కాబట్టే అరెస్టులు జరిగాయని, పోలీసుల దర్యాప్తు సరైన దిశలోనే కొనసాగుతోందని చెప్పారు. అరెస్టుల వెనుక ఎలాంటి కుట్ర గాని, దురుద్దేశంగాని లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. సాక్ష్యాధారాలు కోర్టులో వీగిపోలేదని, వాటిపై అనుమానపడాల్సిన అవసరం లేదన్నారు.
నిషేధిత మావోయిస్టు పార్టీకి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చడంలో విరసం నేత వరవరరావు(వి.వి.)కు ప్రమేయమున్నదని మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ పరమ్‌వీర్ సింగ్ ఇటీవల పత్రికల వారితో మాట్లాడుతూ చెప్పారు. అంటే వరవరరావు ‘ఆయుధ బేహారి’ పాత్రను పోషిస్తున్నారన్నమాట. మణిపూర్, నేపాల్ నుంచి ఆయుధ సరఫరా జరిపే వారితో వి.వి.కి మంచి సంబంధాలున్నాయని, కేవలం ఆయనకు మాత్రమే వారిని సంప్రదించే ‘అధికారం’ ఉందని చెప్పే డాక్యుమెంట్లు తమవద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విదేశాల నుంచి ఆయుధాలు సమకూర్చుకునేందుకు అరెస్టు అయిన నిందితులు పారిస్, మైన్మార్‌లలో సమావేశాలు నిర్వహించారని తగిన ఆధారాలు చూపారు.
ఆగస్టు 28న వరవరరావుతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో మరో నలుగురు పౌర హక్కుల సంఘాల నేతలను పూణె పోలీసులు అరెస్టు చేశారు. కొందరు ‘ప్రముఖులు’ సుప్రీం కోర్టులో ఈ విషయమై ‘దావా’వేయగా గృహ నిర్బంధానికి పరిమితం చేయాలని కోర్టు ప్రకటించడంతో పోలీసులు వి.వి.ని పూణె నుంచి తిరిగి హైదరాబాద్‌కు తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు.
శత్రువు (ప్రస్తుత ప్రభుత్వం)కు అపార నష్టం కలిగించాల్సిన అవసరం ఉందని వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్ (మరో ముద్దాయి) అభిప్రాయపడ్డారని రోనా జాకబ్ విల్సన్, ప్రకాశ్ అనే మావోయిస్టు ప్రముఖ నాయకుడికి రాసిన లేఖలో (ఈ-మెయిల్)లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారి పరమ్‌వీర్ మరోసారి గుర్తుచేశారు. తాము స్వాధీనం చేసుకున్న అసంఖ్యాక లేఖలు, ఇతర డాక్యుమెంట్లలో ఇంకా కీలకమైన సమాచారమున్నదని కూడా ఆయన వెల్లడించారు. నాలుగు లక్షల గ్రెనేడ్లు, గ్రెనేడ్ లాంఛర్లను సమకూర్చేందుకు రూ.8 కోట్లు అవసరం ఉందని కూడా విల్సన్ రాసిన లేఖలో స్పష్టంగా ఉందని ఇదంతా ప్రధాని మోదీ హత్య కుట్రలో అంతర్భాగమేనన్న విషయం అర్థమవుతోందని పోలీసు అధికారి పేర్కొన్నారు. మావోయిస్టుల కేంద్ర కమిటీకి, పౌర హక్కుల నాయకులకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు తమకు లభ్యమయ్యాయని, వాటిలో అతి సున్నితమైన అంశాలు అనేకమున్నాయని ఆయన చెప్పారు. ‘పాస్‌వర్డ్’తో కూడిన సందేశాలను కొరియర్ ద్వారా పంపారని కూడా తెలుస్తోంది. ఈ విధంగా భారీ కుట్రకు పౌర హక్కుల సంఘం నాయకుల ముసుగులో పాల్పడ్డారని, నిషేధిత మావోయిస్టు పార్టీకి అరెస్టయిన నిందితులు పూర్తిగా సహకరించారని ఆయన అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలను హతమార్చేందుకు జరిగిన కుట్ర చిన్నాచితకది కాదని ఇట్టే ఊహించవచ్చు. గతంలో తమిళ టైగర్లు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హతమార్చిన రీతిలో మోదీని అంతమొందించాలన్న బలమైన ఆలోచనతో అడుగులు ముందుకుపడిన వైనం ఆ లేఖల్లో, వివిధ డాక్యుమెంట్లలో స్పష్టమవుతోంది. ఈ విషయమై తిరుగులేని ఆధారాలున్నాయని, కుట్ర ప్రమాదకరమైనదని, ప్రభుత్వానికి కోలుకోలేని రీతిలో నష్టం కలిగించాలన్న ఆలోచనలు చేయడం అందుకు నేపాల్, మణిపూర్ తదితర ప్రాంతాల నుంచి ఆధునిక ఆయుధాలను సేకరించడానికి పూనుకోవడం, ఈ సేకరణలో వి.వి. పాత్ర గణనీయమైనదని, ఆమేరకు ఆధారాలుండగా- ఇంకా అనేక మంది ఈ అంశంపై బుకాయింపు ధోరణితో పొద్దుపుచ్చుతుండటం విషాదం.
లక్షలాది గ్రెనేడ్లు, గ్రెనేడ్ లాంఛర్ల కోసం కోట్ల రూపాయలను ఖర్చుచేసేందుకు సిద్ధమవడం, ఆ ధనాన్ని వి.వి సహా మరికొందరు సమీకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రష్యా, చైనా ఆయుధాలను నేపాల్ ద్వారా తరలించేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. రోనా విల్సన్ తన లేఖతోపాటు ఆయుధాల క్యాటలాగ్‌ను, ఇతర వివరాలను సైతం మావోయిస్టు కేంద్ర కమిటీకి పంపినట్టు తెలుస్తోంది. గత సంవత్సరం చివర్లో మహారాష్టల్రోని భీమా కోరెగావ్‌లో జరిగిన హింస-అల్లర్లకు మావోయిస్టుల మద్దతు ఉండటమేగాక ధనం కూడా సమకూర్చారని, ఆ మొత్తం హక్కుల నాయకులకు అందిందని తెలుస్తోంది. ఆ అల్లర్లలో అమాయక ప్రజలకు సంబంధించి ఆస్తినష్టం అపారంగా జరిగింది. పథకం ప్రకారం ఒక వర్గానికి చెందినవారి ఆస్తులను టార్గెట్ చేసి భయంకరంగా దాడులు నిర్వహించారు. ఇది కేవలం ‘నమూనా’ (శాంపిల్) మాత్రమే, భవిష్యత్‌లో ఇంతకన్నా భయానక దాడులు జరిపేందుకు ఇదొక రిహార్సల్స్‌గా మావోయిస్టులు భావించారు.
భీమా కోరేగావ్ అల్లర్లు, మోదీ హత్యకు కుట్ర, ఇతరచోట్ల అల్లర్లకు పథక రచన, లక్షలాది గ్రెనేడ్ల సరఫరా… ఈ ఆలోచనా సరళి అత్యంత భయానక రీతిలో ఉంది. ఇందులో ఏదోమేరకు పాత్రధారులైన పౌర హక్కుల నాయకుల, కవుల మనసులు ఎంత మలినమయ్యాయో తేటతెల్లమవుతోంది. కేవలం మావోయిస్టులకు ‘రాజ్యాధికారం’ కట్టబెట్టేందుకు ఇంతటి దారుణమైన, హీనమైన పనులకు తెగబడటం పూర్తిగా అన్యాయం. ఈ ప్రక్రియలో ఎందరో అమాయకులు- అభాగ్యులు, అధోఃజగత్ సోదరులు కన్నుమూసేవారో! ఇప్పటికే ఇలాంటివారు లక్షలాది మంది గత 50 ఏళ్ళలో కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య పది కోట్లకు మించిందని పారిస్‌లో ఓ అధ్యయన సంస్థ పేర్కొన్నది. రోజులు గడుస్తున్నకొద్దీ మానవుల ఆలోచనలు- అభిప్రాయాలు మరింత మెరుగవ్వాలి, సానబట్టిన రీతిలో మెరవాలి. మానవత్వ ధోరణిలో కదం తొక్కాలి. మార్దవంతో నర్తన మాడాలి. కాని అందుకు పూర్తి భిన్నంగా, రక్తదాహంతో చెలరేగిపోతే ఎలా? ‘రక్తచరిత్ర’ను సృష్టించేందుకు ఆతృత ప్రదర్శిస్తే ఎలా? జరిగిన కొద్దిపాటి అభివృద్ధిని సైతం ధ్వంసం చేయడానికి ఉవ్విళ్ళూరితే అదెలా సమంజసం?
రష్యా, చైనా, తూర్పు యూరప్ దేశాలు ఇలాంటి ప్రయత్నాలు నిరర్ధకమని అనుభవ పూర్వకంగా పేర్కొన్నాయి. వారికన్నా గొప్ప త్యాగాలుచేసి గొప్ప ఆచరణను కనబరిచే వారేం కాదు భారత మావోయిస్టులు. మరి వారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి కదా? ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా? అన్యాయంగా రక్తకాసారాలను సృష్టించరాదు కదా? ఈ రకమైన తర్కం, వివేచనను పాతాళానికితొక్కి తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించాలని కుట్రలు పన్నడం మొత్తం సమాజాన్ని కలుషితం చేయడమే తప్ప మరొకటి కాదు.
-వుప్పల నరసింహం 99857 81790
(ఆంధ్రభూమి సౌజన్యం తో)