Home Hyderabad Mukti Sangram ప్రతీకార చర్యతో కాంగ్రెసుకు ఎలాంటి సంబంధం లేదు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 23)

ప్రతీకార చర్యతో కాంగ్రెసుకు ఎలాంటి సంబంధం లేదు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర – 23)

0
SHARE
హింస, ప్రతీకార చర్యలతో కాంగ్రెసుకు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షులు స్వామీ రామానంద తీర్ధ స్పష్టం చేసివున్నారు.  “ప్రజలు కూడా శాంతి, అహింసలతో తమ ప్రతిఘటనలు కొనసాగించాలని మేము అభ్యర్ధిస్తున్నాము. కమ్యూనిస్టు మిత్రులు ఈ విషయాన్ని గ్రహించి ప్రవర్తించాలని కోరుతున్నాము. హింస వల్ల ప్రతిహింస, తద్వారా ముగింపు లేని ప్రతీకార చర్యలు తప్ప మరేమీ మిగలవు. సార్వజనీనమైన ఉద్యమాలు సత్యం, అహింసల ఆధారంగానే నైతికబలాన్ని నిలుపుకోగలుగుతాయి. పాలకపక్షం శాంతిభద్రతల సంరక్షణ కోసం ఎలాంటి కఠిన చర్యకైనా సిద్ధమేనని ప్రకటించినంత మాత్రాన లాభం లేదు. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ కార్యకలాపాలపై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకు విధించకూడదు? ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే మంత్రివర్గాన్ని ఎందువల్ల ఏర్పాటు చేయదు? ప్రజాభిప్రాయాన్ని మన్నించి పరిపాలన సాగిస్తేనే ఏ ప్రభుత్వమైనా మనగలుగుతుంది”.
ఇదే విధంగా నిర్భయంగా యధార్ధాన్ని ప్రజలకు చూపుతూ “ఇమ్ రోజ్” ప్రజల వాణిగా నిలద్రొక్కుకుంది. జూన్ 1948 నాడు ఖాసీం రజ్వీ ఒకచోట ఉపన్యసిస్తూ త్వరలోనే ఆసఫియా ధ్వజం ఎర్రకోటపై ఎగురగలదని డంబాలు పలికాడు. ఇమ్ రోజ్ తన సంపాదకీయంలో ఈ ఉపన్యాసాలను నిశితంగా ఖండించింది. రజ్వి ఈ పత్రిక విమర్శలను తట్టుకోలేకపోయాడు. ఆ రోజుల్లో దాదాపు ఉర్దూ పత్రికా రచయితలందరూ రజ్విని సమర్ధించారు. యువకుడైన షోయబ్ ఉల్లా మాత్రమే ధైర్యంగా రజాకార్ల అమానుష చర్యలను ప్రతిఘటించాడు. తత్ఫలితంగా షోయబ్ తనకు కంట్లో ముల్లులా ఉన్నాడని రజ్వి గ్రహించాడు. ఆనాడు భారత ప్రభుత్వానికి, నిజాం ప్రభుత్వానికి మధ్య సంబంధాలు విషమించి ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాలలో భారత సైనికాదళాలకు, నిజాం సైన్యం, రజాకార్ల ముఠాలకు ఘర్షణలు జరుగుతుండేవి. ఒకసారి నానజ్ అనే గ్రామం నుండి వెళ్తున్న భారత సైనిక దళాన్ని రజాకార్ల దళం ముట్టడించింది. 1948 జూలై 24వ తేదీ నాడు జరిగిన సంఘటనలో భారతీయ సైనికులు వీరోచితంగా దాడిని ఎదుర్కొని నిజాం సైనికులను, రజాకార్లను వెనక్కి తిప్పికొట్టారు. చాలామంది రజాకార్లు చనిపోయారు. నానజ్ గ్రామాన్ని భారతీయ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ సంఘటన జరగడానికి ఒక కారణం ఉంది. ఆనాటి బొంబాయి ప్రాంతంలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న బార్షి అనే గ్రామం నిజాం పాలనలో ఉన్న సరిహద్దు గ్రామం నానజ్ గుండా వెళ్ళాలి. ఆ నానాజ్ నుండి వెళ్తున్నప్పుడు రజాకార్లు కావాలని దాడి జరిపారు. ఫలితంగా ఎదురుదెబ్బ తిన్నారు.
షోయబ్ హత్య:
భారతీయ సైనికులు తమ గ్రామం నానజ్ ని అక్రమంగా ఆక్రమించుకున్నారని ప్రచారం చేస్తూ రజాకార్లు రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు లేవదీశారు. “నానాజ్ డే” అనే పేరుతొ హైదరాబాద్ రాజ్యమంతటా నిరసనదినం జరిపారు. 1948 ఆగస్టు 19వ తేదీ నగరంలోని జమరుద్ మహల్ సినిమా హాలులో భారీఎత్తున బహిరంగ సభ జరిపారు. ఇసుక వేస్తె రాలనంతగా ముస్లిం ప్రజలు ఆ సభకు హాజరైనారు. నానాజ్ గ్రామంలో ప్రాణాలు వదిలిన రజాకార్లకు శ్రద్ధాంజలి ఘటించారు.